
ప్రజా ఉద్యమ కార్యకర్తలకు ఉద్యమా క్షరాలు దిద్దించి, సామాజిక, ఆర్థిక పాఠాలు నేర్పి, కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దిన ధీశాలి. కర్నూలు జిల్లా సిపిఎం పార్టీ సీనియర్ నేత, రచయిత, కామ్రేడ్లకు పెద్దాయన తెలకపల్లి నరసింహయ్య వర్ధంతి నేడు. 'తారాజువ్వలు బుస్సుమని ఎగిరి మిరుమిట్లు గొలిపి, క్షణంలో మళ్ళీ పతనమవుతాయి. దీపం నిలకడగా నిరంతరం వెలుగునిస్తూనే వుంటుంది. అలాంటి దీపమే తెలకపల్లి నరసింహయ్య గారు' అని పార్టీ అగ్రనేతలు గౌరవంతో అభివర్ణించారాయనను. గార్గేయపురం లోని ఉన్నత సంప్రదాయ కుటుంబానికి చెందిన తెలకపల్లి రామయ్య, సరస్వతమ్మ దంపతులకు 1928 జూన్ 8న జన్మించిన నరసింహయ్య గారు చదివింది ఆనాటి ఎఫ్.ఎ మాత్రమే అయినా... రాజకీయ అర్థశాస్త్ర సూత్రాలను అలవోకగా చెప్పేవారు. తండ్రి రామయ్య ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేదంలో వైద్య విద్వాన్ సాధించినప్పటికి వృత్తి రీత్యా బ్రాంచి పోస్టు మాస్టర్‌గా పనిచేశారు. 1945 మే నెలలో 'అరుణతార', మహిళా ఉద్యమనేత టి.సి లక్ష్మమ్మతో వివాహం అయ్యింది. 1947 జనవరిలో జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఆడిట్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించారు. 18 స్టోర్లు ఆడిట్ చేసే బాధ్యత అప్పగించారు. మళ్ళీ అనారోగ్యం కలగడంతో ఎక్కువ రోజులు సెలవు పెట్టే అవకాశం లేకపోవడంతో ఉద్యోగం కాస్త పోయింది. అయితే కమ్యూనిస్టు ఉద్యమం గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉద్యోగం చేసే సమయంలో కలిగింది. వెలుగోడు కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షుడిగా కామ్రేడ్ సుదర్శనవర్మ ఉండేవారు. వ్యవసాయ పరికరాలు, బండ్ల పట్టాలు, పేదలకు పంపిణీ అయ్యేలా చూసేవారు. ఆయన కర్నూలు సెంట్రల్ బ్యాంకుకు వస్తే సిబ్బంది ఆయనను ప్రత్యేకంగా చూసేవారు. 1949 జిల్లా బోర్డు ఎన్నికల్లో సుదర్శనవర్మను ఆ ప్రాంతం నుండి బోర్డు సభ్యులుగా ఎన్నుకున్నారు. ఆయనొక్కడే కమ్యూనిస్టు సభ్యుడు. అది పార్టీ గొప్పతనం అనే భావన నరసింహయ్యకు కలిగింది. స్నేహితుడు రాముడు ఇచ్చిన పుస్తకాలు తెలకపల్లి నరసింహయ్యను ఉద్యమం వైపు నడిచేలా ప్రభావితం చేశాయి. 1946లో కాంగ్రెసు పార్టీలో ఉన్న నరసింహయ్య 1948లో యూత్ కాంగ్రెస్ సభ్యుడయ్యారు. 1949లో కర్నూలు జిల్లా బోర్డుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడటంతో దానిని వ్యతిరేకించి బయటికొచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమ నేతగా పార్టీకి అంకితమైనారు. పదవుల కోసం ఏమాత్రం పరితపించని నేతగా, సౌమ్యులుగా పేరొందారు. అనారోగ్యంతోడు జైలుశిక్షలు అనుభవించారు. మరీ ముఖ్యంగా తీవ్రవాద ఉద్యమ విచ్ఛిన్నం తర్వాత సిపిఎంను జిల్లాలో నిలబెట్టడంలోనూ యవ కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ ఆయనది ప్రధాన పాత్ర. అందుకే ఉద్యమ నిర్మాతగా ఆ పేరు వింటేనే ఒక గౌరవం ప్రతి ఒక్కరిలో తొణికిసలాడుతుంది. 1984లో నందమూరి తారకరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి హైపవర్ కమిటీ వేశారు. అందులో ఆయనను సభ్యులుగా నియమించారంటే ఆయన అధ్యయనం అర్థమవుతుంది.
తెలకపల్లి నరసింహయ్య గారి జీవిత పుటలన్నీ ఎర్రజెండాకు అంకితమైనవే. ఆయన శ్రీమతి టి.సి లక్ష్మమ్మ ప్రజా ఉద్యమాల్లో మరీ ముఖ్యంగా మహిళా ఉద్యమాల నిర్మాణానికి అంకితమైనారు. 'నా భార్య టి.సి లక్ష్మమ్మ నా కమ్యూనిస్టు ఉద్యమ ప్రవేశానికి ఒక ప్రధాన ప్రేరణ' అని చెప్పుకున్నాడంటే ఆమె ఎంత ప్రభావశీలో అర్థమవుతుంది. అందరికీ అమ్మగా ఆ రోజుల్లో కార్యకర్తలకు సదా ఆహ్వానం పలికి ఆతిథ్యమిచ్చేది. వారి ముగ్గురు కుమారులు పోరుబాట పట్టినవారే. పెద్దబ్బాయి చంద్రం హెచ్‌ఏయల్ సంస్థలో పనిచేస్తూ సిఐటియును స్థాపించి, ఆ కార్మికుల సమస్యల సాధనకై 11 రోజులు సమ్మెలో పాల్గొని నిరాహారదీక్ష చేశారు. రెండవ కుమారుడు తెలకపల్లి రవి ప్రజాశక్తి ప్రారంభం నుంచి పని చేశారు. రాజకీయ విశ్లేషకులుగా సుపరిచితులు. మూడవ అబ్బాయి హరీంద్రనాథ్‌శర్మ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘాన్ని నిర్మించి కార్మికోద్యమంలో కృషి చేస్తున్నారు. మేనల్లుడు, రచయిత జంధ్యాల రఘుబాబు, మనవలు, మనవరాళ్లు కూడా ఉద్యమాల కార్యకర్తలుగా సానుభూతిపరులుగా వున్నారు.
టి.ఎన్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే హైదరాబాద్‌లో 2002లో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జనకవనంలో పాల్గొని నేను కవిత చదివాను. ఆ రోజు పరిచయమైన సాహితీ స్రవంతిలో సామాన్య కార్యకర్తగా నా సాహిత్య జీవితాన్ని ప్రారంభించాను. ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అద్దేపల్లి రామ్మోహన్‌రావు రాసిన కవిత టి.నరసింహయ్యకు సరిగ్గా సరిపోతుంది. ''మా అమ్మ సూర్యుడు. మా నాన్న చంద్రుడు. పగలల్లా సూర్యుడు జీవశక్తి దగ్ధం చేసుకుంటూ ఆగని పరుగుతో కదిలిపోతూ ఆందరికీ జీవశక్తినిస్తాడు.''
- కెంగార మోహన్,
రాష్ట్ర అధ్యక్షులు సాహితీ స్రవంతి,
సెల్ : 9493375447