Oct 23,2022 08:21

'నేనిక నుండి స్కూల్‌కు వెళ్లనమ్మా!' ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్న కూతురు శ్వేతను చూస్తుంటే, ఆశ్చర్యం కల్గింది సరోజకి. 'ఏంటమ్మా రోజూ స్కూల్‌కు లేట్‌ అయితేనే హడావుడి పడేదానివి, స్కూల్‌ మానేస్తున్నానని చెపుతున్నావేమి?' దగ్గరకు వెళ్లి అడిగింది తల్లి సరోజ. తొమ్మిదో తరగతి చదువుతున్న శ్వేత క్లాస్‌ ఫస్ట్‌ వస్తుంటుంది. ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ తన వంతుగా హుషారుగా పాల్గొని, బహుమతులు సాధించుకు వస్తూ 'బెస్ట్‌ స్టూడెంట్‌' గా స్కూల్‌ టీచర్స్‌ అభిమానాన్నీ సంపాదించుకుంది. స్కూల్‌కు వెళ్లాలని తయారై కూడా ఏదో ఆలోచిస్తూ, స్కూల్‌ బాగ్‌ చేతికి తీసుకుని కూడా అక్కడే పెట్టి, బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తుంటే.. కన్నీళ్లు తుడుచుకుని వచ్చినట్లు అర్థమౌతున్నది సరోజకి. శ్వేతను చూస్తుంటే ఏదో చెప్పాల్సింది చెప్పలేక దాస్తూ బాధ పడుతున్నట్లుంది. 'అమ్మా శ్వేతా, ఏంటమ్మా అలా తటపటాయిస్తున్నావ్‌? కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయెందుకు?' అడిగింది సరోజ దగ్గరకు తీసుకుని.
'ఏముందమ్మా రోజూ దారెమ్మట చేరి కొందరు నన్ను వేధిస్తున్నారు. యూనిఫామ్‌ కూడా నిండుగా ఉండేలా కుట్టించుకున్నాను. ఆడ పిల్లలను చూస్తే జులాయిల్లా తిరిగే పనికిమాలిన వాళ్లకు ఎక్కడలేని అలుసు. ఏదో ఒక మాట అంటూ వెంటబడుతుంటారు' అని కన్నీళ్లు తుడుచుకుంది శ్వేత.
'ఓ ఇందుకేనా స్కూల్‌కు వెళ్ళననేది. పద నీతో కల్సి, నేనూ వస్తా బజారు పనుంది నాకూ' అని సరోజ కూడా బయల్దేరింది. ఇద్దరూ స్కూల్‌ బస్సు వచ్చే సెంటర్‌ వరకు వెళ్తుంటే, 'చూడరోరు మనదెబ్బకు తోడు తెచ్చుకుంది. ఏమనుకుందో మన పవర్‌ అంటే. ఎన్నాళ్లని తోడొస్తుందో చూద్దాం.. అదెవరో?' అంటున్నాడో జులాయి. చదువు మధ్యలో ఎగ్గొట్టి సిగరెట్‌ పొగను రింగురింగులుగా వదులుతూ ఫోజులిస్తున్నాడు. శ్వేత స్కూల్‌ బస్‌ ఎక్కాక, వాళ్ళదగ్గరికెళ్లింది సరోజ. 'ఏమోరు ఏమి చదువుకున్నావ్‌? హైస్కూల్‌ చదువు కూడా పూర్తిచేసినట్లులేవే చూస్తుంటే. ఏమి చేస్తున్నారు మీ అమ్మానాన్నా నిన్ను బజార్లోకి ఆంబోతులా వదిలి?' అంది సరోజ.
అందరూ ఆమెను చుట్టుముట్టి, 'నీకెందుకే మేమెంత చదివితే? పెద్ద పుడింగిలా మమ్మల్నే అడుగుతున్నావు?' అన్నారు.
వాడి చెంప మరుక్షణంలో చెళ్లుమంది. ఆ దగ్గర్లో లేడీ ట్రాఫిక్‌ పోలీస్‌ అంతా గమనిస్తూ అక్కడకొచ్చి 'పదండ్రా మీరంతా పోలీస్‌స్టేషన్‌కు' అంటూ అందర్నీ జీపులో ఎక్కించి, తీసుకెళ్లింది.
రోడ్డుపై జనం గుంపు చేరి, ఏమైందో అడిగి తెలుసుకున్నారు. 'పిల్లల్ని ఏమీ పట్టించుకోక కొందరు తల్లిదండ్రులు చేస్తున్న నిర్లక్ష్యం.. ఇలాంటివాళ్ళను తయారు చేస్తోంది. బారెడెత్తు పెరుగుతున్నారు, చిటికెడు బుద్ధిమాత్రం లేదు. వీళ్ళది గాదు, తప్పంతా వీళ్ళ తల్లిదండ్రులది!' అన్నదక్కడికి చేరిన ఒకామె. నెమ్మదిగా అంతా వెళ్లారు. సరోజ ఇంటికి వచ్చేసింది. అన్యమనస్కంగా పనులు చేసిందారోజు.
'నాకే అవమానం వేసిందే, వేలెడంత లేడు.. నన్నే ఎలా అంటున్నాడో.. ఇక టీనేజ్‌లోకి వచ్చిన ఆడపిల్లలకు ఎంత అవమానంగా ఉంటుందో. పాపం, శ్వేత అందుకే స్కూలుకు వెళ్లనని అంది. ఏదో ఒకటి చెయ్యాలి. మనొక్కరికేగాదు, ఈ అనుభవం ఎందరికి జరుగుతున్నదో?' అనుకుంది.

ఆ మధ్యాహ్నం టీవిలో న్యూస్‌ చూస్తుంటే స్క్రోలింగ్‌లో 'ఈవ్‌ టీజింగ్‌ ఓర్చుకోలేక టెన్త్‌క్లాస్‌ అమ్మాయి హాస్టల్‌ భవనంపై నుండి దూకి ఆత్మహత్య!' అనేవార్త చెపుతుంటే గుండె ఝల్లుమంది. వెంటనే, శ్వేత చదువుతున్న స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను కలుసుకుని మాట్లాడాలని ఫోన్‌ చేసి 'మేడం మిమ్మల్ని కలవాలి. ఈరోజు సాయంత్రం వస్తాను మీరు ఖాళీగా ఉంటారా?' అని అడిగింది. 'ఒకే తప్పకుండా రండి' అని ఆమె బదులిచ్చారు.
సాయంత్రం, నాలుగింటికి ప్రిన్సిపాల్‌ను కలిసేందుకు వెళ్లే ముందే, సరోజ తమ కాలనీలోని సామాజిక సమస్యలపై చర్చించేందుకు ఇష్టపడే రమ, షాజిదా, జమీమ్‌లను కలిసింది. వాళ్లను ఒప్పించి, వాళ్లను తీసుకుని ప్రిన్సిపాల్‌ను కలిసింది సరోజ. దార్లో మద్యం షాపు వద్ద మూగిన యువకులు, కిళ్లీ షాపుల వద్ద గుమిగూడి వున్న వారినీ, బస్టాప్‌ వద్ద సిగరెట్స్‌ తాగుతూ పొగ వదులుతూ, వచ్చేపోయే ఆడవాళ్లను టీజ్‌ చేస్తున్న ప్రబుద్ధులను గమనించమని, తనతోపాటు వచ్చిన రమ, షాజిదా, జమీమ్‌కు చెప్పింది. ఆటో దిగి, ప్రిన్సిపాల్‌ రూముకు నేరుగా వెళ్లారు ముగ్గురూ!
'రండమ్మా' అని సాదరంగా ఆహ్వానించి, తన రూములో కూర్చోబెట్టారు ప్రిన్సిపాల్‌ వాళ్ళను. కాసేపు స్కూల్‌ విషయాలు మాట్లాడాక, 'మేడం, ఈ రోజు మా శ్వేత స్కూల్‌కు ఇక పోనని కన్నీళ్లు పెట్టుకుంది. తరచి తరచి అడగ్గా, దార్లో కొందరు తనను ఈవ్‌ టీజ్‌ చేస్తున్నట్లు చెప్పింది. నేను శ్వేత వెంటే వెళ్లి, బస్సు ఎక్కించి స్కూల్‌కు పంపాను. అక్కడ నేనుండగానే శ్వేతనేగాదు, నన్నూ ఆ పోకిరీలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ట్రాఫిక్‌ పోలీస్‌ చూసి, వాళ్ళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారనుకోండి' అని చెప్పింది సరోజ.
'అవునా, ఈ రోజుల్లో పిల్లలు ఒకరిద్దరవడంతో వారి తల్లిదండ్రులు గారాబం చేస్తున్నారు. హైస్కూల్‌ లెవెల్‌లోనే చెడిపోయినా, బాగుపడినా. అందుకే మేము మోరల్‌ వాల్యూస్‌ మీద ప్రత్యేక క్లాస్‌ కూడా తీసుకుంటాము. మీరు ఏమైనా సూచనలు చేస్తే, తప్పకుండా పాటిస్తాం చెప్పండి. మా స్కూల్‌గానీ మరే ఇతర స్కూల్స్‌లోని పిల్లలైనా వాళ్ళు బాగుపడితేనే గదా సమాజం బాగుండేది!' అన్నారు ప్రిన్సిపాల్‌.
'మేడం మీరు పేరెంట్స్‌ మీటింగ్‌ పెట్టండి, చర్చిద్దాము. ప్రతి ఇంటి నుండి, ఒక తల్లి వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలను లింక్‌ అప్‌ చేసి, ఒక ''హోమ్‌ఫోర్స్‌'' అనే టీమ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని' అంది సరోజ.
'అది మంచి ఆలోచన మేడం!' అంది షాజిదా.
'అందరం కలిస్తే, వివిధ ఆలోచనలు వస్తాయి' అని జమీమ్‌ అనగా..
'ఓకే, అలాగే వచ్చే ఆదివారం ఏర్పాటుచేద్దాం' అన్నారు ప్రిన్సిపాల్‌.
'ఆదివారం వద్దు మేడం, స్కూల్‌ వర్కింగ్‌ డేస్‌లో అయితే, తమ పేరెంట్స్‌ రావడంలో ఏదో ప్రత్యేకత ఉందని ఇక్కడి అబ్బాయిలకు ఒక హింట్‌ - ఆడపిల్లలకు కాన్ఫిడెన్స్‌ వస్తుంది.' అని అంటున్న సరోజ అభిప్రాయాన్ని అందరూ బలపరిచారు.
ఆ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పేరెంట్స్‌ మీట్‌కు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలని కోరుతూ ప్రిన్సిపాల్‌ క్లాసులకు సర్కులర్‌ పంపారు. 'ఆహ్వానపత్రిక తయారుచేయించి, ఇళ్లకు పంపుతాను' అని ప్రిన్సిపాల్‌ కూడా చెప్పగా, సరోజ వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోయారు.
దారిలో ట్రాఫిక్‌ పోలీసులకు ఇక్కడ ఏ సెంటర్‌లో ఈవ్‌ టీజింగ్‌ జరుగుతున్నదో చెప్పి పోయారు సరోజ, షాజిదా, జమీమ్‌.

అనుకున్నట్లు, పేరెంట్స్‌ మీటింగ్‌కు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యారు. ఎక్కువమంది తల్లులు వచ్చి, మీటింగ్‌ బుక్‌లో తమ పిల్లల పేరు ఎదురుగా సంతకం చేశారు. ప్రిన్సిపాల్‌ మీటింగ్‌ ప్రారంభిస్తూ 'ఈ రోజు సమావేశం ప్రధాన ఉద్దేశం, చదువుతో పాటు -నడవడిక బాగుండాలంటే, తల్లిదండ్రుల పెంపకం పిల్లలపై ఎంతవరకు ప్రభావితం చూపుతుందో చర్చించి, మీ అభిప్రాయాలు తీసుకుని ''హోమ్‌ఫోర్స్‌'' అనే టీమును ఏర్పాటు చేయాలని! దీని గురించి శ్వేత అనే విద్యార్థిని తల్లి సరోజను మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను' అని చెప్పారు.
సరోజ తనకు, తన కూతురికి జరిగిన అనుభవాల గురించి చెప్తూ ,'హోమ్‌ఫోర్స్‌'' టీం ఉద్దేశాన్ని వివరించారు. షాజిదా -జమీమ్‌ కూడా తాము ప్రత్యక్షంగా గమనించిన ఈవ్‌ టీజింగ్‌ ఘటనల గురించి చెప్పారు. 'ఇంకా ఒక్కొక్కరూ వచ్చి, ఈ టీమ్‌ ఏర్పాటు అవసరం ఉందా / లేదా, ఉంటే ఎలా ఏర్పాటు చేద్దామో చెప్పండి!' అని ప్రిన్సిపాల్‌ అడిగారు.
ఒక్కొక్కరే వచ్చి, తమ దృష్టిలోకి వచ్చిన ఆడపిల్లలపై లైంగిక వేధింపులు స్కూళ్ళు -కాలేజీ -బస్టాండ్‌ -రైల్వేస్టేషన్‌ -గుడులు, షాపింగ్‌ సెంటర్ల వద్ద తాము చూడటం తటస్థించిన వాటిని గురించి చెప్పారు. మొత్తం మీద అందరి అభిప్రాయాలు తీసుకుని, నోట్‌ చేసుకున్న ప్రిన్సిపాల్‌ స్కూల్‌ పిల్లల తల్లిదండ్రులతో 'హోమ్‌ఫోర్స్‌' అనే టీమ్‌ను ఏర్పాటు చేశారు.
మీటింగ్‌ అయిన తర్వాత 'హోమ్‌ఫోర్స్‌' గ్రూప్‌తో కలిసి, స్థానిక డిఎస్పీ గారిని కలుసుకున్నారు. తమ టీమ్‌కు తగిన సపోర్టు ఇవ్వాలని కోరారు. 'తప్పకుండా, మీరు శాంతిభద్రతలు అదుపులో పెట్టే మా బాధ్యతల్లో పాలుపంచుకున్నట్లుగా మేము భావిస్తూ మీకు తప్పకుండా మద్దతిస్తాం. బస్టాప్‌, రైల్వేస్టేషన్‌, రైతుబజార్‌, షాపింగ్‌ సెంటర్స్‌లో మఫ్టీలో మా మహిళా పోలీసులు ఉండేలా చూస్తాం. స్కూళ్ళు, కాలేజీలు ముమ్మరంగా ఉండే సెంటర్లలో కూడా దృష్టి పెడతాం. మీరు మీ దృష్టికి వచ్చిన ఈవ్‌ టీజింగ్‌ కేసులను మఫ్టీలో వున్న మా కానిస్టేబుల్స్‌కు ఫోన్‌ చేసిగానీ, మెసేజ్‌ పెట్టిగానీ అలర్ట్‌ చేసిన వెంటనే వారు అక్కడికి వస్తారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇదే మాదిరి టౌన్‌ మొత్తం ప్రతివీధిలోని గృహిణులుగా ఉన్న స్త్రీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తాము. మిమ్మల్ని పిలిచి, మీ అనుభవాలు చెప్పిస్తే వాళ్లలో ప్రేరణ కలిగి, ఈ బాధ్యతను వాళ్లూ చేస్తారు.' అన్నారు ప్రిన్సిపాల్‌ సుగుణ.
ఆ విధంగా సావిత్రీబాయి నగర్‌లో ముందుగా గృహిణులుగా ఉన్న మహిళలు 'హోమ్‌ఫోర్స్‌' లో చేరిన నెలరోజుల్లో జులాయిలు ఎందరో పట్టుబడ్డారు. 'హోమ్‌ఫోర్స్‌' వాళ్లకు క్లాసు తీసుకోవడం జరిగేది. క్రమంగా సావిత్రీబాయి నగర్‌ 'హోమ్‌ఫోర్స్‌' తో ఒకరోజు డిఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ప్రిన్సిపాల్‌ను కూడా పిలిచారు. ''హోమ్‌ఫోర్స్‌'' నేరుగా తమ అనుభవాలను, ఆ ఆలోచన వచ్చిన విధానాన్ని మీడియాతో చెప్పారు.
'ఇక నుండి ఎవరికివారు మహిళలు దళంగా, ఇలా ''హోమ్‌ఫోర్స్‌''గా ఏర్పడాలి. ఊరంతా ఎటుపోతే మనకెందుకు? అని అనుకోకుండా.. మేము పట్టనట్లు ఎందుకుండాలని ఈవ్‌ టీజింగ్‌ను ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చినందుకు ''హోమ్‌ఫోర్స్‌'' వారికి ధన్యవాదాలు, అభినందనలు. ఊర్లో అన్ని వీధుల్లోని, కాలనీలలోని గృహిణులు ముందుకు వచ్చి, మీ వీధికి -ప్రాంతానికి ''హోమ్‌ఫోర్స్‌''గా ఏర్పడాలి. దీనివల్ల మన నగరంలో ఈవ్‌ టీజింగ్‌ను అరికట్టడం ద్వారా ఆడపిల్లల్లో భద్రతా, అబ్బాయిలు దారితప్పకుండా ముందు జాగ్రత్త తీసుకున్నట్లవుతుంది' అని డిఎస్‌పి వివరించారు.
ఆరోజు టీవీ ఛానల్స్‌లో ఈ వార్తను చూసిన నగరంలోని గృహిణులు స్ఫూర్తి పొంది, డిఎస్పీ గారిని అడిగి 'సావిత్రీబాయి నగర్‌ హోమ్‌ఫోర్స్‌' సభ్యుల ఫోన్‌ నంబర్లు తీసుకున్నారు. తాము కూడా ''హోమ్‌ఫోర్స్‌'' లో చేరతామని, సూచనలడిగి తీసుకున్నారు.
సరోజ టీమ్‌ వారు తమకు ఫోన్‌ చేసిన వివిధ ఏరియాల్లోని మహిళల వద్దకు వాళ్లే వెళ్లి, కలుస్తున్నట్లు చెప్పారు. ఒక్కోవారం ఒక్కో ఏరియాలో ఒక స్కూల్‌ లేక కాలేజీ వద్ద సమావేశమై, తాము ఎలాగైతే స్కూల్‌ పిల్లల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారో అలాగే వారినీ సమావేశాలకి సన్నద్ధం చేశారు. ఆ విధంగా పట్టణం మొత్తం ఏరియాలవారీగా వీధులపేర్లతో ''హోమ్‌ఫోర్స్‌'' టీములు ఏర్పాటయ్యాయి. ఈ ప్రయత్నం సఫలమై, క్రమక్రమంగా ఈవ్‌ టీజింగ్‌ దాదాపుగా పోయిందనే చెప్పాలి. కలెక్టర్‌, ఎస్పీ ఆ సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ''హోమ్‌ఫోర్స్‌'' టీములను ప్రత్యేకంగా అభినందించారు.
తమ తొలి విజయం తర్వాత ''హోమ్‌ఫోర్స్‌'' సభ్యులు నగర స్థాయిలో సమావేశమై, 'కాలేజీల్లో ర్యాగింగ్‌ ఎంత ఘోరంగా జరుగుతున్నదో గమనించారా? మన రెండవ ప్రయత్నం ''ర్యాగింగ్‌ రహిత కాలేజీలు!''' అని నిర్ణయించు కున్నారు. ''హోమ్‌ఫోర్స్‌'' బృందాలలో ప్రతి టీమ్‌ నుండి ఐదుగురు చొప్పున కొత్తగా ''ర్యాగింగ్‌ నిరోధక ఫోర్స్‌''గా ఏర్పడ్డారు.
అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లను విడివిడిగా కలిశారు. వారానికి ఒకసారి సెకండ్‌ ఇయర్‌కు వచ్చిన విద్యార్థులకు నైతిక, సామాజిక జీవిత విలువల గురించి క్లాసు తీసుకుంటామని చెప్పి, ఒప్పించారు. సెకండ్‌ ఇయర్‌ మొదలవగానే, ఫస్ట్‌ ఇయర్‌ క్లాసులు ప్రారంభం కాకమునుపే కాలేజీ అవర్స్‌లో క్లాసు తీసుకుని కథలు, అనుభవాల రూపంలో, వారి తొలి ఏడాది అనుభవాలను చెప్పించుకుని, జీవితం విలువ నైతిక, సామాజిక విలువల ద్వారా ఎలా పెరుగుతుందో చర్చ పెట్టేవారు. కొత్త ఏడాది కాలేజీలో చేరి, సీనియర్స్‌ గురించి భయపడుతూ క్లాసులకు వెళుతున్న స్టూడెంట్స్‌కు సెకండ్‌ ఇయర్‌ వారిచేత పరిచయం చేసుకోమని చెప్పి, వాళ్ల నుండి ఏమేమి నేర్చుకోవాలో చెప్పించారు. క్రమంగా ర్యాగింగ్‌ కనుమరుగు కాసాగింది.
ఈవ్‌ టీజింగ్‌ అంతరించడం, స్కూళ్ళు కాలేజీల్లో ర్యాగింగ్‌ మాయమవడం ''హోమ్‌ఫోర్స్‌'' కృషి ఫలితమేనని ప్రిన్సిపాల్స్‌ కలెక్టర్‌కి, ఎస్పీకి పర్సనల్‌గా కలిసి చెప్పారు.
అప్పటి నుండి ''హోమ్‌ఫోర్స్‌'' ప్రతి ఏడాదీ కాలేజీల్లో క్లాసులు కొనసాగించేది. ఊర్లో ఈవ్‌ టీజింగ్‌ అదుపుకు కృషి చేస్తూనే, కాలేజీ వయసులో జీవితంలో కొన్ని ఆదర్శాలను పాటించాలని చెప్పారు. ప్రధానంగా వరకట్నం, వేధింపులు, గృహహింస వంటివి చెప్పడం అవసరం అని ''హోమ్‌ఫోర్స్‌'' భావించింది. దీనివల్ల భవిష్యత్తులో అవి జరగకుండా నిరోధించే అవకాశాలుంటాయని భావించింది.
'అదే కాకుండా, ''హోమ్‌ఫోర్స్‌'' టీములు ఇంకాస్త బాధ్యత తీసుకుని, ఛాలెంజింగ్‌గా ''వరకట్న వ్యతిరేక హోమ్‌ఫోర్స్‌'' ఏర్పాటుచేద్దాం' అని ఒకరోజు సరోజ చెప్పింది.
సిటీ లెవెల్‌ ''హోమ్‌ఫోర్స్‌'' మీటింగ్‌లో కోమలి, కొందరు గృహిణులు ముఖముఖాలు చూసుకున్నారు. 'ఏమిటి, మీకు మీ అబ్బాయిల పెళ్లికి కోల్పోబోతున్న వరకట్నాలు గుర్తుకొచ్చాయా?'
అడిగింది సరోజ.
కొంత నిశ్శబ్దం తర్వాత, 'నిజాయితీగా చెప్పాలంటే.. కొంత అనిపించింది, వాళ్ళను ఎంతో ఖర్చు పెట్టి చదివించాం గదా' అని శ్రీలలితమ్మ అంది. 'నిజమే, అమ్మాయిలనూ అంతే కష్టపడి చదివిస్తున్నారు గదా, మరలా కట్నకానుకలు,పెళ్లి ఖర్చు అదనం కదా! మీ అమ్మాయికి కట్నం ఇవ్వకండి. అబ్బాయికి తీసుకోకండి. కొందరికి ఇలా బాలెన్స్‌ అవుతుంది.' నవ్వుతూ అంది కోమలి.
'అదేంటండీ చదివించి ఉద్యోగం చేయిస్తూ, తగిన వరుడ్ని ఎంపిక చేస్తే, రిటైర్‌ అయ్యే వరకూ అమ్మాయి జీతం కట్నం కన్నా ఎక్కువే' అంది హేమలత. అలా అనేక విషయాలు కాస్త హాస్యంగానే అనుకుంటూ మొత్తం మీద ''హోమ్‌ఫోర్స్‌'' వరకట్న వ్యతిరేకంగా టీమ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
దీనిమీద కాలేజీ కాలేజీకి డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలకు పర్యటిస్తూ ''హోమ్‌ఫోర్స్‌'' తీసుకుంటున్న క్లాసులకు ప్రతిసారీ ఎస్పీగానీ ఏఎస్పీ గానీ హాజరవుతారు. ఒక్కోసారి సీనియర్‌ లాయర్‌నూ తీసికెళ్లి వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం ఎంత నేరమో, ఏ ఏ సెక్షన్ల కింద శిక్షలు ఎలా వుంటాయి కూడా చెప్పించసాగారు. తాము తీసుకునే మోరల్‌ క్లాసుల్లో మానవతా విలువలు- వరకట్నం గురించి చెప్పసాగారు.
'చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరి, రెండేళ్లు చేసి, సమాజాన్ని తెలుసుకుని, వరకట్నం తీసుకోకుండా ఉన్న వ్యక్తినే పెళ్లాడాలని అమ్మాయిలూ ఒక ఆదర్శనానికి కట్టుబడి ఉండాలి!' అని చెప్పడం ప్రారంభించారు. క్రమంగా చెప్పుకోదగ్గ మార్పు రాసాగింది. ఈవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌ అంత వేగంగా ఫలితం రాకపోవచ్చుగానీ, తమ ప్రయత్నం విఫలం కాదని నమ్మారు ''హోమ్‌ఫోర్స్‌'' సభ్యులు.
ఈ క్రమంలో రమేష్‌ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ''హోమ్‌ఫోర్స్‌'' కన్వీనర్‌ సరోజ వద్దకు వచ్చి 'మేడం, డౌరీ తీసుకోడానికి నేను వ్యతిరేకం, అమ్మాయి కూడా ఇవ్వడానికి వ్యతిరేకం. అయితే పేరెంట్స్‌ నుండి సమస్యగా ఉంది. మీ సలహా కోసం వచ్చాను' అని అన్నాడు. 'మీ పేరెంట్స్‌ ఫోన్‌ నంబర్లు ఇవ్వండి, మేము మాట్లాడుతాము. వినకుంటే ఏమి చెయ్యాలో చూద్దాం' అంది సరోజ.
తర్వాత ఫోన్‌ చేసి అబ్బాయి పేరెంట్స్‌తో మాట్లాడింది. 'ఏమండీ రామసుబ్బయ్యగారూ మీ అబ్బాయిని ఎంత ఖర్చుపెట్టి చదివించారో, అమ్మాయి సుమలతను వాళ్ళ తల్లీతండ్రి కూడా అంతే కష్టపడి, చదివించారు. ఇద్దరూ ఒకే జీతంతో ఉద్యోగం చేస్తున్నారు. ఇక కేవలం అబ్బాయి అని పదిలక్షలు కట్నమివ్వాలా మీకు? రెండేళ్లలోపే ఆ అమ్మాయి అంతకన్నా ఎక్కువే జీతం ద్వారా సంపాదిస్తుంది. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం! మీరు ఒప్పుకోకుంటే వాళ్లు మేజర్లు.. మేమే వాళ్లకు పెళ్ళిచేస్తాం, మరి చేయమంటారా?' అనడిగింది. దాంతో అయిష్టంగానే ఒప్పుకున్నారు రమేష్‌ తల్లిదండ్రులు.
ఇలా కొన్ని కేసుల్లో ఒప్పించడం, కొన్నిసార్లు తమ ఆధ్వర్యంలోనే ''హోమ్‌ఫోర్స్‌'' పెళ్లిళ్లు చేసింది.
పెళ్లయ్యాక ఆడపిల్ల పుట్టడాన్ని వ్యతిరేకించే వాళ్లుంటారు. వారు లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకొమ్మని కోడళ్లను బలవంతం చేస్తుంటే ''హోమ్‌ఫోర్స్‌''ను ఆశ్రయించేవారు బాధిత అమ్మాయిలు. అలాంటి సందర్భాల్లో అబ్బాయి పేరెంట్స్‌ను కూర్చోబెట్టి డాక్టర్స్‌ చేత 'ఆడ-మగ పిల్లలను కనడం అమ్మాయి, అబ్బాయిల చేతుల్లో ఉండదు. పురుషుల్లో ఎక్స్‌, వై క్రోమోజోములు, స్త్రీలలో ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోములు ఉంటాయి. ఎక్స్‌ ఎక్స్‌ కలిస్తే అమ్మాయి, ఎక్స్‌ వై కలిస్తే అబ్బాయి పుడతారు. మీరు అనుకున్నట్లు పుట్టరు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం!' అని ప్రత్యేక క్లాసులు చెప్పించారు.
మొత్తం మీద ''హోమ్‌ఫోర్స్‌'' నగర వ్యాప్తంగా తమ ఇతోధిక సేవలను ఇష్టపూర్వకంగా కొనసాగిస్తూ.. ఉత్తమ పౌర సమాజ నిర్మాణంలో తమపాత్రను కొనసాగిస్తోంది. నలుగురి చేత కొనియాడబడుతూ తమ సేవలను విస్తరిస్తోంది.

చాకలకొండ శారద
9440757799