
కాలనాళికలో నిక్షిప్తమైన మంచి, చెడుల చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. తొలగిస్తే తొలగిపోదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యా సంస్థల పాఠ్యాంశాల్లో తమకు అనుకూలమైనవి ఉంచి, ప్రతికూలమైనవి తొలగించేస్తే సచ్ఛీలురమైపోతామనే భ్రమలతో సంఫ్‌ు పరివార్, బిజెపి చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుమాలినవి. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో నడిచే జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) ఇటీవల పది, 12 తరగతుల పాఠ్యపుస్తకాల నుంచి భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రధానమైన పాఠ్యాంశాలను తొలగించడం సంఫ్‌ు పరివార్ తుంటరి చేష్టలకు పరాకాష్ట. మహాత్ముని హత్య, తదనంతరం సంఫ్‌ు పరివార్‌పై నిషేధం వంటి ప్రధాన పాఠ్యాంశాలను తాజాగా తొలగించారు. కోవిడ్ నేపథ్యంలో సిలబస్ భారాన్ని తగ్గించే క్రమంలో హేతబద్ధీకరణతో కొన్ని పాఠ్యాంశాలను తొలగిస్తున్నామంటూ గతేడాది ఎన్‌సిఇఆర్‌టి ప్రకటించింది. జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొదించే పాఠ్యాంశాలను, సంఫ్‌ు పరివార్ నేతల అసలు బాగోతాన్ని చాటి చెప్పే అధ్యాయాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే అంశాలను, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం వంటి రాజ్యాంగ విలువలను పెంపొందించే పాఠ్యాంశాలను ఇప్పటికే తొలగించారు. తాజాగా ప్రచురించిన కొత్త పుస్తకాల్లో ప్రధానంగా జాతిపిత మహాత్మాగాంధీకి సంబంధించిన పాఠ్యాంశాలు, అలాగే సంఫ్‌ు పరివార్‌పై నిషేధం వంటి భాగాలను తొలగించేశారు. గతేడాది సిలబస్ భారాన్ని తగ్గించాలనే పేరుతో తొలగిస్తే ఈ ఏడాది తొలగింపులకు కారణాలే చెప్పకపోవడం గమనార్హం. సంఫ్‌ు పరివార్‌కు ప్రతికూలంగా ఉన్న పాఠ్యాంశాలు తొలగించేసి తాము సచ్ఛీలురమని అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి ఇదొక ఎత్తుగా కనిపిస్తోందే తప్ప మరో కారణమేదీ కానరాదు.
భరతమాత దాస్య శృంఖలాలను తెంచిన స్వతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి లొంగిపోయిన చీకటి చరిత్ర సంఫ్‌ు పరివార్‌ది. షాహిద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి యువకిశోరాలు ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి భారతావనికి స్వేచ్ఛ ప్రసాదించేందుకు నవ్వుతూ ఉరికంబమెక్కితే..పట్టుమని పది రోజులు కూడా కారాగారవాసాన్ని భరించలేక వి.డి సావర్కర్ వంటి నాటి మతతత్వ నేతలు బ్రిటీష్ పాలకులకు మోకరిల్లిన సిగ్గుమాలిన చరిత్ర సంఫ్‌ు పరివార్‌ది. దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా వారిది హీన చరిత్రే. మహాత్మ గాంధీ హత్య మొదలు..గోద్రా అనంతర మారణహోమం దాకా..గౌరీ లంకేష్, గోవింద్ పన్సారే, నరేంద్ర దభోల్కర్ వంటి హేతువాదులను బలిగొన్న ముసుగు గూండాలు మొదలుకొని..దళితులను, మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న గోగూండాల వరకు.. వినాశకర, విధ్వంసకర మూఢత్వ భావజాలం నిండిన తడారని నెత్తుటి చరిత్ర సంఫ్‌ు పరివార్‌ది.
చరిత్రను మతోన్మాద ధోరణులతో తిరిగిరాయడానికి చేస్తున్న ప్రాజెక్టులో ఇది ఒక భాగం. కేవలం మతతత్వ అభిప్రాయ భేదాలను ప్రాతిపదికగా తీసుకుని కాలగర్భంలో నిక్షిప్తమైన గతాన్ని తొలగించలేమన్న ఇంగితం కూడా మోడీ సర్కార్‌కు లేకపోయింది. మొఘల్ సామ్రాజ్యం గురించిన మొత్తం అధ్యాయాలను తొలగించడం ద్వారా చరిత్రను వక్రీకరించే మెజారిటీవాదుల ధోరణిని ఎన్‌సిఇఆర్‌టి చర్య ప్రతిబింబిస్తోంది. మహాత్మా గాంధీ హత్య, తదనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించిన కీలకమైన పాఠ్య భాగాలను తొలగించడం కచ్చితంగా ఆర్‌ఎస్‌ఎస్ విచ్ఛిన్నకర, హింసాత్మక పాత్రను తుడిచిపెట్టే ఉద్దేశ్యం మినహా మరొకటి కాదు. హేయమైన ఈ చర్యలను చైతన్యశీలురైన ప్రజానీకమే తిప్పికొట్టాలి. మన రాజ్యాంగం విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది. కానీ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ విరుద్ధంగా విద్యను కేంద్రీకరించే పన్నాగాలు కొనసాగిస్తోంది. ఏకపక్షంగా నూతన విద్యా విధానాన్ని రుద్దుతోంది. కేంద్రీకరణ, కాషాయీకరణ, వ్యాపారీకరణ గావించే ఈ యత్నాలను ప్రజలందరం ప్రతిఘటించి తీరాలి. పార్లమెంటును దాటవేసి, రాష్ట్రాలను, విద్యతో సంబంధమున్న అన్ని పక్షాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ భారత విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్న సంఫ్‌ు పరివార్ ఆగడాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలి.