Nov 09,2023 07:08

''ఎక్కడైతే చరిత్ర విస్మరించబడుతుందో... ఆ సమాజానికి గతం, భవిష్యత్తు కూడా ఉండవ''ని ప్రసిద్ధ రచయిత హిన్లీన్‌ అన్నాడు. అంతటి ప్రాధాన్యత కలిగిన చరిత్ర సబ్జెక్టు చదివే విద్యార్థులు లేక మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలలు వెలవెల పోతున్నాయి. ఇప్పటికే 80 శాతం కాలేజీల్లో హిస్టరీ సబ్జెక్టును ఎత్తేశారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవకపోతే! ''పూర్వం కళాశాలల్లో చరిత్ర బోధించేవారట'' అని చెప్పుకోవాల్సి వస్తుంది.
       ఈ ఏడాది రాష్ట్రంలో డబ్బై శాతం విద్యార్థులు ఇంటర్లో గణితం చదువుతుంటే! కేవలం మూడున్నర శాతం విద్యార్థులు మాత్రమే చరిత్రను చదువుతున్నారు. ఈ వ్యత్యాస ప్రభావం భావి సమాజంపై తీవ్రంగా పడుతుందనడంలో సందేహం లేదు. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో హెచ్‌ఇసి గ్రూపుకు ప్రాధాన్యత కాస్త మెరుగ్గానే ఉంది. దక్షిణాదిన ముఖ్యంగా మన రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ ప్రవాహంలో చరిత్ర సబ్జెక్టు కొట్టుకుపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, మోడల్‌, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, సహకార, కేంద్రీయ, ప్లస్‌ టు తదితర మేనేజ్‌మెంట్లలో 3,654 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరం అంటే ఈ ఏడాది 20,47,844 మంది విద్యార్థులు ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. వారిలో ఏకంగా 15,27,366 మంది గణితం ఉండే ఎంపిసి గ్రూపు చదువుతుంటే కేవలం 53,764 మంది విద్యార్థులు మాత్రమే హిస్టరీ సబ్జెక్టు గ్రూపులు చదువుతున్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మండలానికో పాఠశాలను ప్లస్‌ టూ గా మార్చి ఇంటర్మీడియట్‌ కూడా ఏర్పాటు చేసింది. ఈ 292 ప్లస్‌ టూ లలో ఒకటి కూడా హిస్టరీ గ్రూప్‌ ఉన్న కళాశాల లేకపోవడం విచారకరం. చదివే విద్యార్థులు లేకపోవడం వల్ల హిస్టరీ గ్రూపును ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వ వాదన. చరిత్ర ప్రాధాన్యతను గుర్తెరిగి, చరిత్రకి ప్రచారం కల్పించి విద్యార్థులను చేర్పించి, చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సామాజిక శాస్త్రాలు (సోషల్‌ సైన్సెస్‌) లేకపోతే సమాజం సంపూర్ణ ప్రగతి, వికాసం సాధించలేదు. అందుకే ప్రపంచ అగ్ర దేశాలు సాంకేతిక విద్యతోపాటు సమాన స్థాయిలో చరిత్ర బోధనకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. అమెరికా, చైనా, రష్యా, ఇంగ్లండ్‌ తదితర దేశాలు పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు చరిత్ర బోధనకు పెద్ద పీట వేస్తున్నాయి.
 

                                                                       చరిత్ర ఎందుకిలా డీలా !

కేంద్ర మానవ వనరుల శాఖ నేతృత్వంలో ఎన్‌సిఇఆర్‌టి (జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి) 1961 నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిగతా సబ్జెక్టులతో పాటు చరిత్రకీ ఉన్నత స్థానాన్ని కల్పించి బోధన సాగిస్తోంది. ఎన్‌సిఇఆర్‌టి సూచనల మేరకు ఆయా రాష్ట్రాల్లో ఎస్‌సిఇఆర్‌టి (రాష్ట్ర విద్యా శోధన మరియు శిక్షణ సంస్థ)లు సిలబస్‌ తయారుచేసుకుని చరిత్రను బోధిస్తున్నాయి. ఆరంభంలో అన్ని కళాశాలలో చరిత్ర మెయిన్‌గా ఉండే హెచ్‌ఇసి గ్రూపులు విద్యార్థులతో కళకళలాడుతుండేవి. సైన్స్‌ కంటే ఎక్కువ విద్యార్థులు హిస్టరీ ఉన్న ఆర్ట్స్‌ గ్రూపుల్లోనే చేరేవారు. గతంలో 'లా' చదవాలంటే కచ్చితంగా హిస్టరీ గ్రూప్‌ నుంచి వెళ్లేవారు. ఇప్పుడు సైన్స్‌ గ్రూపుల నుంచి ఎక్కువమంది 'లా' చదువుతున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి పరీక్షలు హిస్టరీ చదివిన వాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు సర్వం ఇంజనీరింగ్‌గా మారుతోంది. ఐసిహెచ్‌ఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌) సంస్థ మన దేశంలో జాతీయ స్థాయిలో చరిత్రను పరిశోధిస్తూ కొన్ని ఆధునిక విషయాలను ఎన్‌సిఇఆర్‌టి ద్వారా ఎస్‌సిఇఆర్‌టి లకు అందిస్తూ వుంటుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో కీలుబొమ్మై రాజకీయ రంగు పులుముకుంటోందని తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్‌సిఇఆర్‌టి చరిత్రలో కొన్ని కీలక పాఠ్యాంశాలు తొలగించ డం ఇటీవల దేశవ్యాప్తంగా విమర్శలకు, నిరసనలకు దారితీసింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర బోధన మీద శీతకన్ను వేస్తూనే ఉన్నాయి.
          ఈ గందరగోళాల నేపథ్యంలో చరిత్ర బోధన ప్రాబల్యం కోల్పోతూ వస్తోంది. రోజు రోజుకి చరిత్ర గ్రూప్‌ చదివే విద్యార్థుల సంఖ్య తరిగిపోతోంది. ఇప్పటికే చాలా కళాశాలల్లో చరిత్ర చదివే విద్యార్థులు లేక హిస్టరీ గ్రూపుని మూసేశారు. రాబోయే పరిణామాలను పసిగట్టిన అప్పటి కేంద్ర ప్రభుత్వం 1986లో డిగ్రీ చదివే విద్యార్థులందరికీ రెండు కంపల్సరీ సబ్జెక్టులను ప్రవేశపెట్టింది. సైన్స్‌ విద్యార్థులకు ఆర్ట్స్‌ పట్ల, ఆర్ట్స్‌ విద్యార్థులకు సైన్స్‌ పట్ల కనీస అవగాహన కోసం ఐహెచ్‌సి (భారతీయ సంస్కృతి, వారసత్వం), సైన్స్‌ అండ్‌ సివిలైజేషన్‌ (విజ్ఞానము, పౌరస్మృతి) సబ్జెక్టులు కచ్చితంగా బోధించి తీరాలని నిబంధన పెట్టింది. 2020 తర్వాత నుంచి ఇది 'ఇండియన్‌ కల్చర్‌ అండ్‌ సైన్స్‌' పేరిట ఏక సబ్జెక్టుగా మారింది. ఇంతవరకు బానే ఉంది. దీన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా పరిగణించడంతో కొందరే ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకుంటున్నారు. దీంతో హిస్టరీ ఉనికిపై మరో రాయి పడింది. సాఫ్ట్‌వేర్‌ మోజులో విద్యార్థులు సాధారణ డిగ్రీల కంటే బిటెెక్‌ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంజనీరింగ్‌ చదువుల ముందు చరిత్ర డీలా పడుతోంది. దాంతో ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ లెక్చరర్ల సంఘం హిస్టరీ గ్రూపుకి పూర్వ వైభవం తేవాలని ఉద్యమం నడుపుతోంది. సైన్సు, ఆర్ట్స్‌, ఇంజనీరింగ్‌ ఇలా చదువుకునే వారందరికీ చరిత్ర పరిజ్ఞానం చేరాలంటే... తెలుగు, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ మాదిరిగా హిస్టరీని కూడా ఒక కంపల్సరీ సబ్జెక్టుగా నేర్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 

                                                                       చరిత్ర బోధన ఎందుకు ?

ఆధునిక సాంకేతిక యాంత్రిక యుగంలో మానవుడు చంద్రుడు మీదకు సైతం దూసుకుని వెళుతూ ఉంటే జరిగిపోయిన గతాన్ని తవ్వుకుంటూ చరిత్ర ఎందుకు? అనే విమర్శలు లేకపోలేదు. ఒకవైపు పెత్తందారులు, కార్పొరేట్‌ సంస్థలు, దళారులు చేతికి అందింది దోచుకుంటున్నారు. ఎంత కష్టపడ్డా రైతులకు, శ్రామికులకు పూట గడవడం కష్టంగా మారిపోతుంది. సమాజంలో అంతరాలు పోయి సమ సమాజ స్థాపన జరగాలి అంటే దానికి చరిత్ర ఒక సాధనం. సాంఘిక శాస్త్రాన్ని (సోషల్‌ సైన్సెస్‌) చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఒక పరిణితి గల సమాజం ఏర్పడుతుంది. అమెరికన్‌ ప్రముఖ రచయిత్రి పెరల్‌.ఎస్‌.బక్‌ ఏమన్నారంటే...'ఇవాళ్టి గురించి నీవు అన్వేషించాలనుకుంటే కచ్చితంగా నీవు నిన్నటి గురించి తెలుసుకుని ఉండాలి'. గతం అంటే... చరిత్ర ఎప్పుడూ కూడా గొప్పదే. 'గతం పునాదుల మీదే వర్తమానం నడుస్తుంది, భవిష్యత్తు నిర్మితమవుతుంది'. ఇదే చరిత్ర మూల సిద్ధాంతం.
 

                                                                            చరిత్రకు పూర్వ వైభవం

భవిష్యత్‌ సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే చరిత్ర సబ్జెక్టుకు కళాశాలల్లో పూర్వ వైభవం దక్కాలంటే ప్రభుత్వాలు కచ్చితంగా ప్రత్యేక దృష్టి సారించాలి. చరిత్ర చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి. పురావస్తు శాఖ, పర్యాటకం, అటవీ శాఖ, పోలీసు శాఖ తదితర రంగాల్లో హిస్టరీ విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించాలి. కాంట్రాక్ట్‌, ప్రైవేట్‌ బోధకులతో కాకుండా నిష్ణాతులైన రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించి కళాశాలల్లో వారితో పాఠ్యాంశాలు బోధించేటట్టు చూడాలి. ప్రభుత్వ కళాశాలల్లో హిస్టరీ గ్రూపు నడుపుతూ వాటిలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వం ప్రచారం కల్పించాలి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో కూడా కచ్చితంగా హిస్టరీ గ్రూపులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హిస్టరీ స్కాలర్లని కూడా పెంచాలి. హిస్టరీ, సైన్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌తో కొత్త గ్రూపులు ఏర్పాటుచేసి విద్యార్థులకు దగ్గర చేయాలి. హిస్టరీ ప్రాభవాన్ని, అవసరాన్ని తెలిపి విద్యార్థుల్లో చరిత్ర చదవడానికి ఆసక్తి రేకెత్తించాలి.

/వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చిలుకూరి శ్రీనివాసరావు
సెల్‌: 8985945506