
గతంలో ఉండిన'' హిందూ రేటు వృద్ధి'' అనేది దీర్ఘకాలం పాటు కొనసాగగలిగింది. కాని ఇప్పుడు అదే ''హిందూ రేటు వృద్ధి'' అలా దీర్ఘకాలంపాటు కొనసాగగలిగే అవకాశాలు లేవు. ఇప్పుడు డిమాండ్‌కు కొరత ఉన్న కారణంగా వృద్ధిరేటు తగ్గుతోంది. ఈ పరిస్థితి మారి డిమాండ్ కొరత తగ్గాలంటే ప్రభుత్వ జోక్యానికి అవకాశం లేదు (నయా ఉదారవాద విధానాల కారణంగా). అందుచేత ఇంక ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు పెరిగి ఆ ప్రేరణతో మన దేశంలోనూ కొంత కదలిక రావడం ఒక్కటే మనకు మిగిలిన అవకాశం.
కాని ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు పడిపోతోంది. దాని వలన అంతకంతకూ మరింత ఎక్కువగా స్థాపక సామర్ధ్యం వినియోగంలోకి రాకుండా నిరుపయోగం అయిపోతోంది. అందువలన మరింత తక్కువగా అదనపు పెట్టుబడులు వస్తాయి. దానివలన వృద్ధిరేటు ఇప్పుడున్నదానికన్నా ఇంకా తక్కువకి పడిపోతుంది. అందుచేత ఇప్పుడున్న వృద్ధిరేటును ఈ స్థాయిలోనైనా కొనసాగించడం సాధ్యం కాదు. దాని ఫలితంగా ప్రస్తుత అసమానతలు మరింతగా పెరిగిపోతాయి. శ్రామిక ప్రజల పరిస్థితి మరింత దిగజారుతుంది.
నయా ఉదారవాద విధానాలు అమలు జరగకముందు కాలంలో, అంటే, ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ ఉన్న కాలంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రతీ ఏడూ 4 శాతం లేదా అంతకన్నా తక్కువగా వృద్ధి నమోదు చేస్తూ వచ్చింది. వలస పాలన కాలంలోనైతే ఎటువంటి వృద్ధీ నమోదు కాలేదు. దానితో పోల్చినప్పుడు ఈ 4 శాతం వృద్ధి అనేది మెరుగు. కాని అది అంత చెప్పుకోదగ్గ వృద్ధి రేటు అని అనలేము. ఇలా ఒక దీర్ఘకాలం పాటు తక్కువ మోతాదులో నిలకడగా అభివృద్ధి కొనసాగడాన్ని ''హిందూ వృద్ధిరేటు'' అని చాలామంది ఆర్థికవేత్తలు వెటకారంగా అనేవారు (బహుశా అంత తక్కువ వృద్ధిరేటు కొనసాగితే సామాజిక మార్పు జరగడానికి అనంత కాలం పడుతుంది అన్న అర్ధంలో ఆ విధంగా అనివుండొచ్చు). ప్రభుత్వ నియంత్రణ నుండి మారి నయా ఉదారవాద విధానాలు అమలు మొదలయ్యాక, జిడిపి వృద్ధి రేటులో వేగం పెరిగింది. ఇది 1980 దశకంలో మొదలై కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ జిడిపి వృద్ధిరేటు వేగం తగ్గిపోవడం మొదలైంది. బహుశా అందుకేనేమో ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మళ్ళీ ''హిందూ వృద్ధిరేటు'' దశ లోకి జారిపోతున్నాం అని గుర్తు చేశారు.
కరోనా మహమ్మారి విరుచుకు పడకముందే మన ఆర్థిక వృద్ధిరేటు వేగం తగ్గడం మొదలైంది అన్నది తిరుగులేని వాస్తవం. కరోనా కాలంలో ఉత్పత్తి స్థాయి అమాంతం పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కోలుకుంటున్న తీరు బలహీనంగా ఉంది. ఇదంతా చూసినప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగం మళ్ళీ తగ్గుముఖం పడుతోంది అన్న నిర్ధారణకు రావడం సహజం. ఐతే గతకాలంలో (అంటే ప్రభుత్వ నియంత్రణలో దేశ ఆర్థిక వ్యవస్థ నడిచిన కాలంలో) కనపడిన వృద్ధిరేటుకు, ఇప్పటి వృద్ధిరేటుకు-ఈ రెండూ తక్కువగానే నమోదు అయినప్పటికీ-మౌలికంగా ఒక తేడా ఉంది. ఆ విషయాన్ని చర్చిద్దాం.
ఈ తేడాను అర్ధం చేసుకోవాలంటే ముందు ''డిమాండుకు అనుగుణంగా సరుకులు అందించలేకపోయిన వ్యవస్థ''కి (సప్లై కన్‌స్ట్రైన్డ్ సిస్టమ్), ''జరిగిన ఉత్పత్తికి తగినట్టుగా సరుకులు కొనగలిగిన పరిస్థితి లేని వ్యవస్థ''కి (డిమాండ్ కన్‌స్ట్రైన్డ్ సిస్టమ్) మధ్య తేడాను గుర్తించగలగాలి. జరిగిన ఉత్పత్తికి తగినట్టు సరుకులు కొనలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఆర్థిక వ్యవస్థలో స్థూల ఉత్పత్తి ఎంత ఉండాలనేది ఆ వ్యవస్థలో ఉన్న స్థూల డిమాండ్ నిర్ణయిస్తుంది. అదే మాదిరిగా, ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు కూడా ఆ వ్యవస్థలోని స్థూల డిమాండ్ వృద్ధిరేటు మీద ఆధారపడి వుంటుంది. అంతే తప్ప ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తి స్థాయి మేరకు ఉపయోగించడం జరిగిందా, లేదా అన్న అంశం మీద కాని, పూర్తిస్థాయిలో ఉద్యోగులను పనిలో పెట్టుకోగలిగామా లేదా అన్న అంశం మీద కాని, తగినంత విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో ఉందా లేదా అన్న అంశం మీద కాని, ఆహారధాన్యాలు తగినంత మేరకు అందుబాటులో ఉన్నాయా, లేవా అన్న అంశం మీద కాని ఆధారపడి వుండదు.
అదే సప్లై కన్‌స్ట్రైన్డ్ సిస్టమ్‌లోనైతే ఎంత మేరకు ఉత్పత్తి చేయగలం అనేది వ్యవస్థలో ఉన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగలిగామా లేదా అన్న అంశం మీద, ఆ విధంగా వినియోగించుకోడానికి తోడ్పడే ఇతర అంశాలమీద ఆధారపడి వుంటుంది. ఎంత మేరకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోగలిగాం అన్నదానిని బట్టి ఆర్థిక వృద్ధిరేటు ఆధారపడివుంటుంది.
సాంప్రదాయంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ డిమాండ్ కు కొరత ఉన్న (డిమాండ్ కన్‌స్ట్రైన్డ్) వ్యవస్థ గానే ఉంటుంది. అదే సాంప్రదాయంగా సోషలిస్టు వ్యవస్థ ఎప్పుడూ సరఫరా కొరత ఉన్న ( సప్లై కన్‌స్ట్రైన్డ్) వ్యవస్థగానే ఉంటుంది. ఈ విషయాన్ని పోలెండ్‌కు చెందిన మార్క్సిస్టు ఆర్థికవేత్త మైకెల్ కాలెక్కీ చాలా కాలం క్రితమే చెప్పాడు. ఉత్పత్తి స్థాపక సామర్ధ్యం అంతా వినియోగించబడకుండా కొంత మేరకు మూలపడిఉండడం, అదే సమయంలో కొంత నిరుద్యోగం ఉండడం, విదేశీ మారకద్రవ్యం కావలసినంత అందుబాటులో ఉండడం, ఆహారధాన్యాలు అందుబాటులో ఉండడం (జనాభాలో కొందరు ఒకవైపు ఆకలితో మాడుతున్నా) - ఈ లక్షణాలన్నీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో కొనసాగుతాయి. అదే సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో అటువంటి లక్షణాలు కనపడవు. అందువలన వనరులు వృధాగా పడివుండడం అనేది సోషలిస్టు వ్యవస్థలో ఉండదు.
స్వాతంత్య్రానంతరం భారతదేశంలో పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి కొనసాగింది. ఐతే అది ఒక ప్రణాళికా విధానపు చట్రానికి లోబడి జరిగింది. ప్రణాళికా విధానం అంటేనే డిమాండ్ కు కొరత ఉండదు అని అర్ధం. అందుచేత ఆ కాలంలో ప్రభుత్వ నియంత్రణలో కొనసాగిన పెట్టుబడిదారీ ఆర్థిక విధానం సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానం కాదు. స్థాపక సామర్ధ్యం మేరకు ఉత్పత్తి జరగడంలో ఎక్కడైనా వెనుకపట్టు పడితే, వెంటనే డిమాండ్ ను పెంచడానికి వీలుగా ప్రభుత్వ వ్యయం పెంచడం చేసేవారు. అందుకోసం అవసరం అయితే ద్రవ్యలోటు పెంచేవారు. ఆ రోజుల్లో ద్రవ్యలోటు మీద ఎటువంటి నియంత్రణలూ ఏ అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచీ ఉండేది కాదు. ప్రభుత్వ నియంత్రణలో కొనసాగుతున్నందున, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు బలవంతంగా తమ ఆదేశాలను అమలు చేసేవిధంగా ఒత్తిడి చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. ఆ కాలంలో వృద్ధిరేటు మీద ప్రతికూల ప్రభావం సప్లై వైపు నుండే ఉండేది. అంటే డిమాండ్ మేరకు సరుకులను సరఫరా చేయగలిగిన పరిస్థితి ఉండేది కాదు. ఉదాహరణకు: ఆహారధాన్యాల సరఫరాకు ఎప్పుడూ కొరత ఉండేది. దేశం ఆ విషయంలో అప్పటికి స్వయం సమృద్ధి సాధించలేదు. దానికి తోడు విదేశీ మారక ద్రవ్యం కొరత కూడా ఉండడం వలన అవసరమైన మేరకు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం కూడా సాధ్యం అయ్యేది కాదు. ఆహారధాన్యాలకు కొరత ఉన్నందువలన ఎప్పుడూ వాటి ధరలు పెరుగుతూ నిత్యం ఎంతో కొంత ద్రవ్యోల్బణం ఉంటూవచ్చింది. కాని ఆ కాలంలో ఎప్పుడూ స్థాపక సామర్ధ్యం మేరకు ఉత్పత్తి జరగకపోవడం అనే ధోరణి ఉండేది కాదు.
నయా ఉదారవాద విధానాలు అమలు మొదలయ్యాక పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. స్థాపక ఉత్పత్తి సామర్ధ్యంలో కొంత భాగం వినియోగంలోకి రాకుండా ఉండిపోవడం ఈ దశలో నిరంతరం కొనసాగుతోంది. దానిని వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వం ఏ విధంగానూ జోక్యం చేసుకోలేని స్థితిలో ఉండిపోతోంది. ప్రభుత్వ వ్యయం పెంచడానికి కావలసిన అదనపు వనరులను సమీకరించాలంటే ధనవంతులపై అదనపు పన్నులైనా విధించాలి, లేకుంటే ద్రవ్యలోటును పెంచడానికైనా పూనుకోవాలి. ఈ రెండూ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించిన షరతులు అలాంటివి. అందుచేత నయా ఉదారవాద కాలం అంతా మనం వినియోగంలోకి రాని ఉత్పత్తి సామర్ధ్యాన్ని, భారీ నిరుద్యోగాన్ని, అమ్ముడు పోకుండా భారీ పరిమాణంలో పడివున్న ఆహార ధాన్యాలను, ఎక్కువ మొత్తంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను చూస్తున్నాం (విదేశీ ద్రవ్య పెట్టుబడులు స్పెక్యులేషన్ మార్కెట్ లోకి ఎక్కువ మోతాదులో వచ్చి పడుతూ వుండడం దీనికి కారణం). నయా ఉదారవాద కాలంలో ఎక్కువ వనరులు వినియోగంలోకి రాకుండా వృధా అయిపోతూ వుండడం మనకు నిత్యం కనిపించే ఒక ధోరణి. ఇది పూర్తిగా హేతువిరుద్ధం. ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ కొనసాగిన కాలంలో సప్లరు వైపు లోటు కారణంగా ఇబ్బందులు వచ్చేవే తప్ప వనరులు వృధా అయిపోవడం అనేది ఉండేది కాదు.
అంతే కాదు. తలసరి ఆహారధాన్యాల వినియోగం డిమాండ్ పెరుగుదల రెండు అంశాలమీద ఆధారపడి వుంటుంది. మొదటిది: తలసరి జిడిపి వృద్ధిరేటు మీద. రెండవది ఆదాయాలు ఆ యా తరగతుల నడుమ ఏ విధంగా పంపిణీ అవుతున్నాయి అన్న అంశం మీద. ఆదాయాల్లో అసమానతలు బాగా పెరిగిపోతే ఆహారధాన్యాల వినియోగం కొసం ఏర్పడే డిమాండ్ తగ్గిపోతుంది. ప్రభుత్వ నియంత్రణ కొనసాగిన కాలంలో ఉత్పత్తి అయిన ఆహారధాన్యాలకు, నయా ఉదారవాద కాలంలో ఉత్పత్తి అవుతున్న ఆహారధాన్యాలకు పరిమాణంలో పెద్ద మార్పు లేదు. నిజానికి అప్పటికన్నా కొంత పరిమాణం తగ్గిందనే చెప్పాలి. కాని ఆ కాలంలో ఆహారధాన్యాల కొరత ఉండేది. ఇప్పుడు ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోతున్నాయి. అంటే ఆహారధాన్యాల డిమాండ్ లో పెరుగుదల అనేది అప్పటితో పోల్చితే ఇప్పుడు తగ్గిపోయిందన్నమాట. మరి ఇంకోవైపు చూస్తే తలసరి జిడిపి మాత్రం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ విధంగా తలసరి జిడిపి పెరిగినా, ఆహారధాన్యాలకు డిమాండ్‌మాత్రం తగ్గిపోతోందంటే దానర్ధం ఆదాయాల పంపిణీలో అసమానతలు బాగా పెరిగిపోయాయన్నమాట. ప్రభుత్వ నియంత్రణ ఉన్న కాలంతో పోల్చితే నయా ఉదారవాద కాలంలో ఆదాయాల మధ్య అసమానతలు బాగా పెరిగిపోయాయి.
స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాలలో దేశంలోని ఒక్క శాతంగా ఉన్న అత్యంత సంపన్నుల వాటా జాతీయ సంపదలో క్రమంగా తగ్గిపోతూ, 1982 నాటికి 6 శాతానికి చేరుకుంది. నయా ఉదారవాద విధానాలు అమలులోకి వచ్చాక మళ్ళీ వారి వాటా పెరగసాగింది. 2014-15 నాటికి వారి వాటా 22 శాతానికి పెరిగింది. గత శతాబ్ద కాలంలో ఇంత ఎక్కువ ఎన్నడూ లేదు.
గతంలో ఉన్న ''హిందూ రేటు వృద్ధి'' మళ్ళీ ఇప్పుడు కనిపించవచ్చు. కాని గతంలో అసమానతలు పెరగలేదు. మరి ఇప్పుడు మాత్రం అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇదీ తేడా.
గతంలో ఉండిన'' హిందూ రేటు వృద్ధి'' అనేది దీర్ఘకాలం పాటు కొనసాగగలిగింది. కాని ఇప్పుడు అదే ''హిందూ రేటు వృద్ధి'' అలా దీర్ఘకాలంపాటు కొనసాగగలిగే అవకాశాలు లేవు. ఇప్పుడు డిమాండ్‌కు కొరత ఉన్న కారణంగా వృద్ధిరేటు తగ్గుతోంది. ఈ పరిస్థితి మారి డిమాండ్ కొరత తగ్గాలంటే ప్రభుత్వ జోక్యానికి అవకాశం లేదు (నయా ఉదారవాద విధానాల కారణంగా). అందుచేత ఇంక ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు పెరిగి ఆ ప్రేరణతో మన దేశంలోనూ కొంత కదలిక రావడం ఒక్కటే మనకు మిగిలిన అవకాశం. కాని ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు పడిపోతోంది. దాని వలన అంతకంతకూ మరింత ఎక్కువగా స్థాపక సామర్ధ్యం వినియోగంలోకి రాకుండా నిరుపయోగం అయిపోతోంది. అందువలన మరింత తక్కువగా అదనపు పెట్టుబడులు వస్తాయి. దానివలన వృద్ధిరేటు ఇప్పుడున్నదానికన్నా ఇంకా తక్కువకి పడిపోతుంది. అందుచేత ఇప్పుడున్న వృద్ధిరేటును ఈ స్థాయిలోనైనా కొనసాగించడం సాధ్యం కాదు. దాని ఫలితంగా ప్రస్తుత అసమానతలు మరింతగా పెరిగిపోతాయి. శ్రామిక ప్రజల పరిస్థితి మరింత దిగజారుతుంది.
రఘురాం రాజన్ వృద్ధిరేటు పడిపోతోందని ఎక్కువ ఆందోళన పడుతున్నారు. మళ్ళీ పాతకాలం నాటి వృద్ధిరేటు స్థాయికి చేరుతుందని దిగులు పడుతున్నారు. కాని అప్పటికన్నా ఇప్పుడు శ్రామిక ప్రజల స్థితి మరింత హీనంగా దిగజారుతుంది. మనం ఆందోళన చెందవలసినది దీని గురించే.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్