Sep 02,2023 07:15

10న విద్యుత్‌, 17న సిపిఎస్‌ ఉద్యోగుల ఆందోళనలు
ప్రజాశక్తి-అమరావతి :ఉద్యోగుల ధర్నాలకు హైకోర్టు అనుమతినిచ్చింది. పలు సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ కార్మిక సంఘాలు ఈ నెల 10న విజయవాడలో ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌ సాధన కోసం 17న విజయవాడలో సమావేశం నిర్వహించుకునేందుకు ఉద్యోగులకు అనుమతిచ్చింది. సమావేశానికి హాజరయ్యే వారి ఆధార్‌ కార్డు వివరాలు పోలీసులకు అందజేయాలని నిర్వాహకులను ఆదేశించింది. ఐదు వందల మందితో మాత్రమే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని షరతు విధించింది. విద్యుత్‌ ఉద్యోగులు పదో తేదీన ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యకాలంలో ధర్నా, నిరసన కార్యక్రమాలను పూర్తి చేయాలంది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, విద్వేషపూరితంగా మాట్లాడరాదని షరతు విధించింది. ఈ మేరకు జస్టిస్‌ కె శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి కోరితే పోలీసులు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ పలు సంఘాలు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. విజయవాడలోని ధర్నా చౌక్‌ లేదా జింఖానా గ్రౌండ్‌లో ధర్నా చేసేందుకు విజయవాడ పోలీస్‌ కమిషనరు నిరాకరించడాన్ని ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కమిటీ తరఫున న్యాయవాది నల్లూరి మాధవరావు వాదించారు.
సిపిఎస్‌ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదని హైకోర్టు షరతు విధించింది. విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాకు విధించిన అన్ని షరతులూ సిపిఎస్‌ ఉద్యోగుల సమావేశానికి వర్తిస్తాయని పేర్కొంది. ర్యాలీకి అనుమతివ్వలేదు. వైఎస్‌ జగన్‌ విపక్ష నేతగా ఉండగా పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎస్‌ ఉద్యోగులు ప్రైవేట్‌ స్థలంలో సమావేశం నిర్వహించుకునేందుకు ప్రయత్నించారు. అందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మహ్మద్‌ హుస్సేన్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనరు తరఫున న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదించారు.