
ఏకరూప పౌర స్మృతి (యుసిసి) ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదు, వాంఛనీయమూ కాదని సాక్షాత్తూ 21వ లా కమిషన్ స్పష్టం చేసినా, ప్రజల మధ్య విద్వేష సృష్టికి మోడీ సర్కారు దాన్ని మళ్లీ ముందుకు తెస్తుంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సింది పోయి 'అందులో ఏమున్నాయో తెలియద'ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, 'సూచనలను అధ్యయనం చేస్తామ'ని ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ప్రజా వంచనగా భావించాల్సి వుంటుంది. యుసిసి బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలువురు ముస్లిం మత పెద్దలు బుధవారంనాడు వారిరువురిని వేర్వేరుగా కలిసిన సందర్భంలో ఈ విధంగా స్పందించడం ఆశ్చర్యం కలిగించింది. యుసిసిపై భయాందోళనలకు గురికావద్దని, ముస్లిముల మనసు నొప్పించేలా తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యవహరించదంటూనే ముసాయిదాలో ఏమున్నాయో తెలియదని, మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగా మనోభావాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పడం యుసిసిపై చర్చను ఆటంకపర్చడమే అవుతుంది. ఒక రాష్ట్రానికి పాలకుడిగా తాను ఉన్నానని, ఇదే విషయంలో మీరైతే ఏమిచేస్తారో చెప్పాలని వారిని ఎదురు ప్రశ్నించడం మత పెద్దలను ఇబ్బంది పెట్టడమే కదా! అవసరం లేదు, వాంఛనీయం కాదన్న యుసిసిని తిప్పికొట్టడం మాని ఇంకా అధ్యయనం చేస్తామని టిడిపి చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి ఊతం ఇవ్వడంగానే భావించాలి. మొత్తంగా చూస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలను తిరస్కరించి, విశాఖ ఉక్కును అమ్మి తీరుతామంటున్న మోడీ సర్కారుకు అన్ని విధాలా మద్దతునందిస్తున్న ఈ రెండు పార్టీలూ యుసిసి విషయంలోనూ అదే వైఖరిని కొనసాగిస్తున్నాయని బోధపడుతోంది.
ఈ రెండు భేటీల సందర్భంగానూ సిఎంఓ, టిడిపి కేంద్ర కార్యాలయం ప్రకటనలు విడుదల చేశాయి తప్ప అక్కడికి మీడియాను అనుమతించలేదు. కానీ సిఎంను కలిసి వచ్చాక పెద్దలు ముస్లింలకు నష్టం జరిగేట్టయితే తాము యుసిసిని వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి అన్నారని మీడియాతో చెప్పారు. సిఎంఓ ప్రకటనలో ఆ ఊసే లేదు. పర్సనల్ లా బోర్డులే తేల్చాలి అన్నది వైసిపి కచ్చితమైన వైఖరి అయితే, యుసిసి బిల్లు అవసరం లేదని కరాఖండిగా చెప్పివుండాల్సింది. కానీ ఆ పని చేయలేదు. అయితే, ఈ సమయంలో ముఖ్యమంత్రి ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూనే వచ్చిన నాయకుల్లో కొంతమందికి, ఆయా కుటుంబాలకూ పదవుల భరోసానివ్వడం చర్చనీయాంశం అయ్యింది. అలాగే మత స్వేచ్ఛకు అడ్డుపడే ఈ చట్టానికి మద్దతు ఇవ్వొద్దని మత పెద్దలు చంద్రబాబును కోరితే దానిపై స్పష్టంగా చెప్పకుండా తమది లౌకిక పార్టీ అని, మత సామరస్యానికి ప్రాధాన్యత ఇచ్చిందని, తమ ఏలుబడిలో ముస్లింలకు చేసిన మేళ్ల గురించి వివరించి వారిని బుజ్జగించడానికి యత్నించడం మభ్యపుచ్చడమే కదా !
ఎన్‌ఆర్‌సి, సిఎఎ విషయంలో ఈ రెండు పార్టీలు బిజెపికి మద్దతునిచ్చాయి. గో రక్షణ పేరిట పేరిట బిల్లు తెచ్చి గోగూండాల స్వైర విహారానికి తెర లేపిన బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని బలపర్చాయి. పలు రాష్ట్రాల్లో ఎంతోమందిపై మూక దాడి చేసి చంపినా, నాలుగు చక్రాల వాహనంలో బంధించి తగులబెట్టినా ఈ పార్టీలు పల్లెత్తు మాటాడలేదు. దేశ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగం కల్పించిన 370 అధికరణాన్ని ఒక్క ఉదుటన రద్దు చేసి రాష్ట్రంగా ఉన్న జమ్ము కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చీల్చినా కిమ్మనని పార్టీలివి. ఏళ్ల తరబడి కాశ్మీర్‌ను ఓ జైలుగా మార్చినా ఆ పార్టీల ఎంపీలు ఏనాడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఈనాడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న యుసిసి విషయంలో దాదాపు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలూ తమ వైఖరులను వెల్లడిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు దాగుడుమూతలాడడం తగదు. గత లా కమిషన్ అవసరం లేదని చెప్పిన యుసిసి ని తాము కూడా అక్కరలేదని చెబుతారా లేక ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి బిజెపి చేస్తున్న విచ్ఛిన్నకర కుట్రకు తోడ్పడతారా తేల్చి చెప్పాలి. రాజకీయ పార్టీగా ఇలాంటి కీలక అంశాల్లో ఏదో ఒకవైపున ఉండాలేతప్ప గోడ మీద పిల్లిలా వుంటే కుదరదు. ఆ పార్టీలు తమంతట తాము ప్రకటించేట్టు కనబడడంలేదు కనుక వారు బిజెపి తో ఉంటారా ప్రజల పక్షాన నిలుస్తారా అని జనం ఒత్తిడి చేయాలి. ప్రజాస్వామ్యంలో అదే మార్గం !