
ఫ్రాన్స్‌లో మాక్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా మూడున్నర నెలలుగా ఫ్రెంచ్ కార్మిక వర్గం నిరవధిక పోరాటం సాగిస్తోంది. ఇప్పటికి ఓ డజన్ సార్లు దేశవ్యాప్త ఆందోళనలు జరిగాయి. మేడే రోజు ఉధత రూపం దాల్చింది. వందల మంది ఉద్యమ కారులను అదుపులోకి తీసుకున్నారు. ఐనా ఫ్రెంచ్ కార్మిక వర్గం తన ఆందోళనలను ఆపడానికి సిద్ధంగా లేదు. ఏకపక్షంగా అమలు చేయబూనుకున్న పింఛను సంస్కరణలను 83% శాతానికిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే... పదవీ విరమణ అనంతరం ఓ కార్మికుడు పూర్తి పెన్షన్ పొందాలంటే 43 ఏళ్ల పాటు పని చేయడంతో బాటు ,సదరు యాజమాన్యం నగదు చెల్లింపులు చేయాల్సి వుంటుంది. 62 ఏళ్లు ఉన్న కార్మికులు మరో రెండేళ్ల పాటు పదవి విరమణ కోసం వేచి చూడాల్సివుంది.
అప్రతిష్టాకరమైన ఈ సంస్కరణలను వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. జనవరి 31 నాడు 12 లక్షల మంది రోడ్ల మీద కొచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్బంధాన్ని ఎంతగా ప్రయోగించినా లెక్క చేయకుండా జనం పెద్దయెత్తున కదులుతున్నారు. దీంతో కొన్ని చోట్ల ప్రదర్శకులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లోయిరే రీజియన్‌లోని మోంటార్గిస్‌లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. పారిశుధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగడంతో పారిస్ వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. రైల్వే ట్రాకులన్నీ ఆందోళన జరుపుతున్న కార్మికులతో కిక్కిరిసిపోయాయి. దేశవ్యాప్తంగా రిఫైనరీల్లో సమ్మెలు జరుగుతున్నాయి. రవాణా కార్మికులు, ఉపాధ్యాయులు కూడా సమ్మె చేశారు. పలు యూనియన్లు, వామపక్ష సంస్థల ఆధ్వర్యంలో రవాణా, విద్య, ఇంధన రంగాలకు చెందిన కార్మికులు ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టారు. తమకు గుర్తున్నంతవరకు ఇవి అతిపెద్ద నిరసన ప్రదర్శనలని ఫ్రెంచ్ విశ్లేషకులు చెప్తున్నారు.
.
ఫ్రాన్స్ కార్మిక సంఘాల వాదన
ఆర్థిక సంక్షోభం ఇప్పుడు దేశంలో ఏ మాత్రమూ లేదని మాక్రాన్ ప్రభుత్వం బుకాయింపులకు దిగుతోందని ఫ్రెంచ్ కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి.. 62 ఏళ్ల నుండి 64 ఏళ్లకు రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచడం వల్ల వచ్చే రెండేళ్ల వరకు కేవలం జీతాలిస్తే సరిపోతుంది. అందుకే ..ఈ ప్రతిపాదన అంటున్నాయి. అయితే రిటైర్మెంట్ వయసు పెంచడం ఒకటే కాదు, ,ఆ ముసుగులో కొత్త కార్మిక చట్టాలను తేవాలని ప్రతిపాదించడం కూడా కార్మికుల ఆందోళనలకు ముఖ్య కారణం. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఈ సెప్టెంబర్ 2023 నుండి 2030 వరకు ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ వయస్సు మూడు నెలలు పెరుగుతుంది. అలాగే పూర్తి పెన్షన్ కావాలంటే 43 ఏళ్ల పాటు కార్మికులు పనిచేయాలి. శారీరకంగా లేదా మానసికంగా కష్టతరంగా భావించే ఉద్యోగాలలో ఉన్న కొంతమంది కార్మికులు చాలా మంది శ్రామిక జనాభా కంటే ముందుగానే పదవీ విరమణ చేసే హక్కును కలిగి ఉంటారు. కానీ ఇప్పుడది కష్టమవుతుంది.ఈ కొత్త ప్రతిపాదనలు తక్కువ జీతాలు ఆర్జించే కార్మికుల మీదా, మహిళల మీదా తీవ్రంగా పడుతుంది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికీ ఇది భారంగా మారుతుంది. అందుకే వారి నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంది.
అధ్యక్షుడు మాక్రాన్ కార్పొరేట్, వ్యాపార వర్గాలకు మేలు చేకూర్చే విధంగా కార్మిక చట్టాలను సవరించాలని చూస్తున్నాడని, ఇప్పటికే కార్పొరేట్ సంస్థల మీద పన్ను తగ్గింపు లాంటి చర్యలు తీసుకున్నాడని కార్మిక సంఘాలు చెపుతున్నాయి. ఇప్పుడు కొత్త చట్టానికి శ్రీకారం చుడితే అది కార్మికులకు అన్యాయం చేసినట్లే అవుతుంది. నిజానికి కొంత కాలం నుండి ఫ్రాన్స్‌లో కార్పొరేట్, భారీ పరిశ్రమల్లో, వ్యాపారాల్లో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.
గత ఏడాది ఫ్రాన్స్‌లో ఇంధన రంగంలో 19 బిలియన్ యూరోల లాభం వచ్చింది. 2022లో 40 లిస్టెడ్ కంపెనీలు 80 బిలియన్ యూరోలను షేర్ హోల్డర్లకు బోనస్, డివిడెండ్ల రూపంలో పంపిణీ చేశారు. ఇది గాక, ప్రతీ ఏడాది ఫ్రెంచ్ ప్రభుత్వం సుమారు 157 బిలియన్ యూరోలు కార్పొరేట్లకు ప్రోత్సాహకాలుగా అందిస్తున్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే....కార్పొరేట్ల అడ్డగోలు లాభాలపై పన్నులు విధించి, ఖజానా లోటు లేకుండా చేసుకోవాలి. కార్పొరేట్లకు అడ్డగోలు లాభాలు తెచ్చి పెడుతున్న ఇంధన, బ్యాంకింగ్ రంగాలను జాతీయకరణ చేయాలి. అప్పుడు ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. అంతే తప్ప మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్న పెన్షన్ సంస్కరణలను అమలు చేయకూడదని కార్మిక సంఘ నాయకులు తెగేసి చెప్తున్నారు.
అయితే ...పార్లమెంటు సభ్యుల ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా పెన్షన్ సంస్కరణలను దూకుడుగా తీసుకురావడానికి అధ్యక్షుడు మాక్రాన్ తన ప్రత్యేక రాజ్యాంగాధికారాన్ని ఉపయోగించారు. ఫ్రెంచ్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 49.3 ను కార్మికుల పదవీ విరమణ వయస్సును పెంచడానికి, పూర్తి పెన్షన్ కావాలంటే 43 ఏళ్ల పాటు కార్మికులు పనిచేయాలని, ప్రభుత్వ రవాణా, ఇంధన కార్మికులు కలిగివున్న కొన్ని ప్రత్యేక పెన్షన్ సదుపాయాలు తొలగించడానికి ప్రయోగించారు. ఈ చర్యపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలోని ఎగువ సభలో పెన్షన్ సంస్కరణల చట్టం ఓటింగ్‌కి పెట్టకుండా బిల్ పాస్ చేయడానికి మాక్రాన్ ప్రభుత్వం ప్రయత్నించిన తరుణంలో హింస ప్రజ్వరిల్లింది !
ఎటువంటి చట్టమైనా....ప్రజాస్వామ్య యుతంగా చర్చకు పెట్టి ఆమోదింపజేసుకోవాలే తప్ప ఏకపక్షంగా రుద్దడమేమిటని కార్మికులు, పెన్షనర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుడు మాక్రాన్ మీద రెండు సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే అది వీగిపోయింది. ఫ్రాన్స్ కాంస్టిట్యూషనల్ కౌన్సిల్ పెన్షన్ సంస్కరణలకు దాదాపుగా జై కొట్టడంతో ,ఇదే అదనుగా మాక్రాన్ పెన్షన్ సంస్కరణల చట్టాన్ని ఏప్రిల్ 15న ఆమోదించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుని ఏకపక్ష ధోరణిపై ప్రజాకోర్టు లోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని కార్మిక వర్గం భావిస్తోంది. ఇప్పటికే తన ఏకపక్ష ధోరణులతో మాక్రాన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆయన రేటింగ్ 28%కి పడిపోయినట్లు సర్వే సంస్థలు తెలియచేస్తున్నాయి. 2010లో రిటైర్మెంట్ వయసును 60 నుండి 62 కి పెంచినప్పుడు అప్పటి అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తీవ్ర నిరసనలు ఎదుర్కొని, తదనంతరం తన పదవిని కోల్పోయారు. ఎటువంటి చర్చ లేకుండా, వివాదాస్పదమైన పెన్షన్ సంస్కరణలను అమలు చేయాలని అధ్యక్షుడు మాక్రాన్ చేస్తున్న దుందుడుకు ప్రయత్నాలను ఫ్రెంచ్ ప్రజానీకం నిరసిస్తున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం అటు యూరోపియన్ దేశాల పైనా, ఇటు ఓపిఎస్ (గ్యారంటీ పింఛను పధకం) కావాలని నిరసనలు జరుగుతున్న మన దేశంపై సైతం పడే అవకాశం ఉంది.
పెన్షన్ సంస్కరణలపై జూన్ 6న మరోసారి ఫ్రాన్స్ లో దేశవ్యాప్త పోరాటం
మాక్రాన్ నిరంకుశ అధికారంతో చట్టాన్ని చేసిన తర్వాత కూడా ఫ్రెంచ్ కార్మికవర్గం వెనకంజ వేయలేదు. జూన్ 6న మరోసారి ఫ్రెంచ్ కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనా దినం ప్రకటించాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత(2009 తర్వాత) మే ఒకటి, 2023న ఫ్రాన్స్‌కి చెందిన 8 కార్మిక సంఘాలు ఒక్క తాటి మీదకి వచ్చి నిరసనల్లో సమరశీలంగా పాల్గొన్నాయి. జూన్ 6న అంతకంటే తీవ్రస్థాయిలో పాల్గొనే పరిస్థితి ఉంది. దీంతో మాక్రాన్ ప్రభుత్వం గడగడ వణికే పరిస్థితి ఏర్పడింది.! ఫ్రెంచ్ కార్మికవర్గం సాగించే పోరాటం నుండి ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గం స్ఫూర్తి పొంది పోరాటాలను ఉధతం చేయాలి.
వ్యాస రచయిత - ఉపాధ్యక్షులు, ఎఐఐఇఎ
పి సతీష్