Feb 24,2023 07:07

వు చుట్టూ రాజకీయం చేస్తున్న పాలకులారా మీకు నిజంగా వాటిపై ప్రేమ ఉంటే.. 'ఇవిగో ఆవులు.. రండి కౌగిలించుకోండి.. మీ ఇళ్లల్లో కట్టేసుకోండి..' అన్న నినాదాలు.. 'మేము రైతులం.. అక్కర్లేని ఈ పశువుల వల్ల మా జీవితాలు నాశనమౌతున్నాయి. ఆస్తి నష్టపోతున్నాం.. ప్రాణాలు కోల్పోతున్నాం.. ఎన్నాళ్లీ సమస్య? ఇప్పటికైనా పరిష్కరించకపోతే మీ కార్యాలయాలన్నీ పశువులతో నిండిపోతాయి' అంటూ హెచ్చరికలు జారీచేయడం ఇప్పుడక్కడ కనిపిస్తోంది. 'ఆవును చూస్తే భయమేస్తోంది.. వాటి పోషణ అంటేనే వణుకు పుడుతోంది.. అన్న రైతులు ఇప్పుడిలా నినదిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..
        ఫిబ్రవరి 14న ప్రపంచమంతా ప్రేమికుల రోజు వేడుకల్లో మునిగితేలుతోంది. ఆ రోజే హర్యానా అంబాలా జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం మునుపెన్నడూ చూడని నిరసనలతో హోరెత్తింది. ఆ రోజు.. వందలాది పశువులు ట్రాక్టర్లతో దిగాయి. 'ఈ పశువులను మీరే రక్షించుకోండి.. ప్రేమికుల రోజు సాక్షిగా ఆవులను కౌగిలించుకోండి అన్న నాయకులారా.. రండి ఇవిగో ఆవులు.. కౌగిలించుకోండి.. మీ ఇళ్లల్లో కట్టేసుకోండి. ఇవి మాకక్కర్లేదు..' అంటూ రెండు గంటలపాటు అంబాలా రైతులు బిగ్గర స్వరాలతో నినదించారు.
        హర్యానా వ్యాప్తంగా చాలాచోట్ల రైతులు ముక్తకంఠంతో ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే- అక్కడ రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల వల్ల వాళ్లకు తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. నాలుగు నెలల నుండి ఇదే పరిస్థితి.. యమునానగర్‌కు చెందిన రైతుల నుండి గతవారం ఆ జిల్లా అధికారులకు ఇటువంటి హెచ్చరికే ఎదురైంది. 'నేను నా పంటను కాపాడుకునేందుకు రాత్రుళ్లు అక్కడే నిద్రిస్తున్నాను. ఈ సమస్య ఎప్పటికీ తీరేది కాదు.. అందుకే ఇక్కడే ఓ ఇల్లు కట్టుకుని ఉండాలనుకుంటున్నాను. మా జీవితం ఇలా తయారైంది. పశువులకు భయపడే రోజులు వచ్చాయి. పాలకులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పశువులకు ఏమైనా హాని చేస్తే ఎక్కడ మమ్మల్ని చంపేస్తారోనని భయపడి చస్తున్నాం' అంటున్నాడు 50 ఏళ్ల జోగిందర్‌ నైన్‌ అనే రైతు.
         నర్వానాకు చెందిన దిల్‌బాఫ్‌ు మోర్‌ (55) అనే రైతు తన 14 ఎకరాల పొలంలో పశువులు పొలంలోకి జొరబడకుండా రాత్రుళ్లు నిద్ర లేకుండా అదే పనిగా కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు. అయినా అతని ప్రయత్నం విఫలమైంది. మందలకొలది పశువులు అమాంతం పంటపొలంలోకి దిగాయి. వాటిని తరిమేందుకు పొరుగువారిని పిలిచినా ఫలితం లేకుండా పోయింది. చూస్తుండగానే నాలుగెకరాల పంట ధ్వంసమైంది. వందలాది రైతులందరిదీ ఇదే పరిస్థితి. అందుకే వారంతా ఫిబ్రవరి 8న సమావేశమై ఈ సమస్యను పరిష్కరించమని జిల్లా అధికారులను హెచ్చరించాలనుకున్నారు. 'వారం రోజుల వ్యవధిలో సమస్యను పరిష్కరించకపోతే ఈ పశువులన్నీ అధికారుల ఇళ్లల్లో ఉంటాయ'న్న హెచ్చరికలు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. 'ఇది పాలకవర్గం వైఫల్యం. రైతులమైనందుకు మేము శిక్షించబడుతున్నాం. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో జీవించలేకపోతున్నాం' అంటూ కోపంతో ఊగిపోతున్నాడు మోర్‌.
      అంతేకాదు, గతేడాది చివర్లో గుజరాత్‌లో వీధి పశువుల సమస్యను పట్టించుకోని పాలక ప్రభుత్వంపై నిరసనతో మల్దారీ సంఘాలు ఆందోళనకు దిగాయి.
'ఓ ఆవు తల్లి.. ఆవు తల్లి..
బిజెపిని నమ్మకు..
త్వరలో దాన్ని ఇంటికి పంపిస్తాం..
బిజెపి ఆవును ప్రేమించడం లేదు..
పశుపోషకులను వ్యతిరేకిస్తుంది..' అంటూ అక్కడి గోడలపై నినాదాలు ప్రత్యక్షమయ్యాయి.
            ఉత్తర భారతంలో విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగే ఆవుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. రద్దీగా ఉండే వీధులు, ప్రధాన రహదారులపై అవి బీభత్సం సృష్టిస్తున్నాయి. ట్రాఫిక్‌ అంతరాయం కలిగి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 2018 నుంచి 2022 మధ్య కాలంలో వీధుల్లో తిరిగే పశువుల వల్ల 900 మంది పౌరులు చనిపోయారని ఓ నివేదిక స్పష్టం చేస్తోంది.
        హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో వేలాది మంది రైతులు వందలాది ఎకరాల పంటను నష్టపోవడం అక్కడ సర్వసాధారణం. అయినా ఏనాడూ ఇంతలా ఎదురు తిరగలేదు. పంట నష్టానికి పరిహారం అందకపోయినా ఏరోజూ పశువులను భారం అనుకోని రైతన్నలు ఈ రోజు వాటిని భరించడం కష్టంగా ఉందంటున్నారు. ఆవు పేరుతో మతఘర్షణలు రెచ్చగొట్టి మారణహోమం సృష్టిస్తున్న పాలకుల విధానాలు వారిని అంతలా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రాంతాలు వేరైనా ఇప్పుడా రైతులందరికీ దేశ నలుమూలల నుంచి మద్దతు రావాలి. పశువులను రక్షించే నెపంతో సాధారణ పౌరుల హక్కులను భక్షిస్తున్న పాలకుల కుయుక్తులకు చరమగీతం పాడాలి.

/ ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ /