
ఇప్పటికే అనేక పన్నులతో సతమతమౌతున్న ప్రజలపై జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంపాక్ట్ ఫీజు భారం మోపింది. నగర, పట్టణ ప్రజలతో పాటు, వివిధ నగరాభివృద్ధి సంస్థల పరిధి లోకి వచ్చే గ్రామాలకు సైతం ఇంపాక్ట్ ఫీజు వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం 60 అడుగులు, 150 అడుగుల కంటే ఎక్కువ వెడల్పున్న మాస్టర్ ప్లాన్ రోడ్లు, జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, రాష్ట్ర రహదారులు, రింగురోడ్లు ఆనుకుని పక్కనే నిర్మించే భవనాలన్నింటితో పాటు, ఇప్పటికే ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్న చోట కూడా ఇంపాక్ట్ ఫీజు అమలు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.
ఇంపాక్ట్ ఫీజు అంటే? నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలో ఇళ్ళు లేదా వ్యాపార వాణిజ్య, భవనాలు నిర్మించుకోవాలంటే ముందుగా ఆయా స్థానిక సంస్థల నుండి బిల్డింగ్ ప్లాన్ తీసుకోవాలి. ఈ ప్లాను కోసం బిల్డింగ్ లైసెన్స్ ఫీజు, బెటర్‌మెంట్ ఫీజు, డెవలప్‌మెంట్ చార్జీలు, డ్రైనేజ్, వాటర్ చార్జీల పేర రుసుములు చెల్లించుకోవాలి. అనుమతులు లేని లేఅవుట్‌లో చేస్తున్న నిర్మాణాలకైతే ఈ చార్జీలకు అదనంగా 14 శాతం ఓపెన్ స్పేస్ సర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంపాక్ట్ ఫీజు దీనికి అదనంగా చెల్లించాలి. ఆ తరువాత బిల్డింగ్ ప్లాన్ మంజూరు చేస్తారు. ఇప్పుడు ఈ రుసుములతో పాటు బిల్డింగ్ ప్లాన్ కోసం అదనంగా ఇంపాక్ట్ ఫీజు కూడా స్థానిక సంస్థలకు చెల్లించుకోవాలి.
ఇంపాక్ట్ ఫీజు మీద ప్రభుత్వ వాదనేమిటంటే ప్రభుత్వం పెద్ద పెద్ద రహదారుల నిర్మాణ ప్రభావం వల్ల రహదారులకు ఇరువైపుల వున్న మరియు దానికి దగ్గరలో వున్న భూములకు పెద్ద ఎత్తున రేట్లు పెరుగుతున్నాయి. ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టే వారు వ్యాపార వాణిజ్యాలు లేదా అద్దెల ద్వారా ఎక్కువ ఆదాయం లేదా లాభాలు పొందుతున్నారు. అలాగే పెద్ద రహదారుల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు కూడా అవుతున్నది. అందువల్ల పెద్ద రహదారుల పక్కన నిర్మించే నిర్మాణాలన్నింటికి ఇంపాక్ట్ ఫీజు పేర అదనపు ఫీజులు స్థానిక సంస్థలకు చెల్లించుకోవాలని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి ప్రత్యేక ఖాతాలో వేసి రహదారుల విస్తరణ, లింక్ రోడ్లు నిర్మాణం, జంక్షన్‌ల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్నది.
ఇంపాక్ట్ ఫీజు భారం ప్రస్తుతం ఏడాదికి రూ. 600 కోట్లు రాష్ట్ర ప్రజలపై పడుతుందని అంచనా. ఉదాహరణకు విశాఖపట్నం-మధురవాడ మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా 2 వేల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి ప్లాన్ కోసం జివిఎంసి ఇప్పటి వరకు సగటున రూ. లక్షా ముప్పై వేలు వసూలు చేస్తోంది. ఇంపాక్ట్ ఫీజు కింద ఇప్పుడు ఎస్.ఎఫ్.టి కి రూ. 75 చొప్పున రూ. లక్షా యాభై వేలు అదనంగా చెల్లించుకోవాలి. ఈ విధంగా ప్రస్తుతం భవన నిర్మాణాల అనుమతులకు చెల్లిస్తున్న ఫీజులపై సగటున రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల అదనపు భారం ప్రజలపై పడనుంది. అలాగే 150 అడుగుల రహదారులకు సంబంధించి రహదారి ఇరువైపుల మాత్రమే కాకుండా రహదారికి 250 మీటర్ల దూరం వరకు ఇంపాక్ట్ ఫీజు చెల్లించుకోవాలి.
ఇంపాక్ట్ ఫీజు స్ధిరంగా ఉండదు. ప్రతి ఏడాది భూములు, రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతుంటారు. దీనితో పాటు ఇంపాక్ట్ ఫీజు కూడా పెరుగుతుంది. ఇంపాక్ట్ ఫీజుతో పాటు బిల్డింగ్ ప్లాన్‌ల కోసం చెల్లించే బిల్డింగ్ లైసెన్స్ ఫీజు, బెటర్‌మెంట్ ఫీజు, డెవలప్‌మెంట్ చార్జీలు, డ్రైనేజీ, వాటర్ చార్జీలు కూడా ప్రతి ఏడాది పెరుగుతాయి. ఇవి ప్రజలకు మోయలేని భారంగా మారనున్నాయి. అలాగే ఈ చర్య భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్‌పై కూడా దుష్ప్రభావం చూపుతుంది. అరవై అడుగుల వెడల్పు రహదారి ఇరువైపుల అనే నిబంధన కూడా శాశ్వతంగా అలానే వుండదు. దీనిని కూడా రహదారి నుండి 250 మీటర్ల దూరం వరకు విస్తరించొచ్చు. ప్రస్తుత 60 అడుగుల నుండి 30 అడుగుల రహదారులకు, రియల్ ఎస్టేట్ల లే అవుట్లకు కూడా ఈ ఫీజును వర్తింపచేయొచ్చు. రహదారులతో సంబంధం లేకుండా కూడా ఇంపాక్ట్ ఫీజును విస్తరించే ప్రమాదం వుంది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలలో ప్రధాన వ్యాపార, వాణిజ్య ప్రాంతాలు, మార్కెట్లు, బస్, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, మధ్య తరగతి కాలనీలు ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ ఫీజును భవిష్యత్తులో అమలు చేయొచ్చు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా వుంటాయి. అలాగే ప్రస్తుతం ఈ ఫీజును నిర్మాణ ప్లాన్ల సందర్భంగానే వసూలు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో నిర్మాణం అనంతరం కూడా ఆస్తి పన్నుతో పాటు ప్రతి ఏడాది ఇంపాక్ట్ ఫీజు కూడా వసూలు చేసే ప్రమాదం వుంది.
ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు. బిల్డింగ్ ప్లాన్లు సందర్భంగా రహదారుల అభివృద్ధి రుసుములతో పాటు వివిధ రకాల చార్జీలు స్థానిక సంస్థలకు చెల్లిస్తున్నారు. భవనాల నిర్మాణం అనంతరం ఆ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, పారిశుధ్యం, విద్యా, వైద్యం, పార్కులు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు, స్టేడియంలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర సదుపాయాల కల్పన కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం తిరిగి భవన నిర్మాణాలపై అదనంగా ఇంపాక్ట్ ఫీజు వేయటం అంటే ప్రజల నుండి అదనంగా ఆదాయాన్ని గుంజటమే.
ఇంపాక్ట్ ఫీజు అనేది ప్రపంచ బ్యాంకు పట్టణ సంస్కరణల్లో ఒకటి. చాలాకాలం నుండి పట్టణ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఫీజును అమలు చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంస్కరణల అమలుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఒక్కొక్కటి అమలుకు ముందుకు తెస్తున్నది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం లోని వైసిపి ప్రభుత్వం మాత్రం బిజెపి కి లొంగిపోయి ఈ సంస్కరణల అమలుకు పూనుకుంది.
ఇటీవల రాష్ట్రంలో అమలులో ఉన్న ఇంటి అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే పద్ధతిని రద్దు చేసి ఆస్తి యొక్క మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే పద్ధతిని అమలు లోకి తెచ్చారు. ఆస్తి విలువ పెరుగుదలతో పాటు ప్రతి ఏడాది ఆస్తిపన్ను పెరిగేలా నిర్ణయాలు చేసి అమలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పద్ధతిని అమలు లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. భవిష్యత్తులో ఆస్తి పన్నును ఆస్తి విలువలో కనీసం ఒక శాతానికి తీసుకెెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
అలాగే మంచి నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రజల దగ్గర నుండి రాబట్టాలని కేంద్ర బిజెపి సర్కారు విధించిన మరో షరతు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదించి అమలుకు పూనుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా చెత్తపై చార్జీలు విధించింది. మురుగు నీటి చార్జీల అమలుకు పూనుకున్నది. అనేక పట్టణాలు, నగరాల్లో నీటి చార్జీలు పెంచింది. ఇప్పుడు కొన్ని నగరాల్లో 24 గంటల మంచినీళ్ల పేర కుళాయిలకు మీటర్లు బిగించి నీటి చార్జీలు పెంచుతున్నది. అలాగే ఈ సేవలను ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పేర 5 నుండి పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం ప్రారంభించారు. ప్రతి పౌర సేవకు అయ్యే ఖర్చును ప్రజల నుండి వసూలు చేయాలనే ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
రెండోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులకు, గ్రాంట్లకు కోత పెడుతున్నారు. ఇటీవల కాలంలో పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్న నిధులు 0.3 శాతం నుండి 0.25 శాతానికి పడిపోయాయి. పట్టణాల అభివృద్ధిపై పెట్టే ఖర్చు కూడా భారీగా తగ్గిపోతున్నది. 1998-99లో జి.డి.పి లో 1.74 శాతం పట్టణ అభివృద్ధి కోసం ఖర్చు చేయగా 2002-2003లో 1.6 శాతానికి, నేడది 1.58 శాతానికి తగ్గిపోయింది. దేశ జి.డి.పి పెరుగుతున్న స్థాయిలో పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కేటాయింపు పెంచాలి. అలాగే పట్టణ అభివృద్ధిపై ఎక్కువగా ఖర్చు చేయాలి. కానీ ఈ ప్రక్రియ నేడు తిరోగమనంలో కొనసాగుతున్నది.
స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను కూడా ఎక్కువ భాగం షరతులకు ముడిపెట్టి ఇస్తున్నారు. ఈ షరతులన్నీ ప్రజలపై భారాలు మోపేవే. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులన్నీ ఈ కోవకు చెందినవే. అలాగే గతంలో ప్రవేశపెట్టిన జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం, నేడు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్, అమృత పథకం, స్మార్ట్ సిటీ ... పథకాల కింద ఇచ్చే నిధులన్నీ పన్ను భారాల షరతులతో కూడినవే.
ప్రపంచ బ్యాంక్, ఎడిబి, డి.ఎఫ్.ఐ.డి తదితర అంతర్జాతీయ సంస్థల నిధులతో దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో అనేక నగరాలు, పట్టణాల్లో అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా పట్టణ సంస్కరణల అమలుకు ముడి పెట్టి అమలు చేస్తున్నవే. రెండో వైపు పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా కౌన్సిళ్లకు ఎటువంటి అధికారం, హక్కు లేకుండా వీటిని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను భారాలన్నింటినీ తప్పనిసరిగా అమలు చేసే ఏజెన్సీలుగా మార్చేశారు. అందుకు అనుగుణంగా చట్టాలన్నింటిని కూడా మార్చేస్తున్నారు. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న పన్నులను సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధి లోకి గుంజుకుంటూ ప్రజలపై పన్ను భారాలు మోపుతున్నాయి. భవిష్యత్తులో అనేక రూపాల్లో ఈ భారాలు ఇంకా పెరుగుతాయి. నగర, పట్టణ నిర్వహణకు అయ్యే పూర్తి ఖర్చును ప్రజల నుండే వసూలు చేస్తాయి. కనుక ఈ పట్టణ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం తప్ప వేరే మార్గం లేదు.
వ్యాసకర్త డా|| బి. గంగారావు, సెల్ : 9490098792