
కటిక నేలనే పట్టు పరుపుగా చేసుకుని ఆకాశం నీడలో ప్లాట్ ఫారంల మీద, కట్టేసిన షాపుల ముందు, ఫ్లై ఓవర్ల కింద, దేవాలయాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంగణాలలో పడుకుని ఉండే వారినే మనం నిరాశ్రయులుగా పరిగ ణిస్తాం. నిరాశ్రయులకు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన గృహ వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని నిరాశ్రయుల జీవన స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి వేసిన కమిటీ ప్రపంచ దేశాలకు సూచించింది. అక్టోబర్ 10వ తేదీని అంతర్జాతీయ నిరాశ్రయ దినోత్సవంగా జరపాలని యుఎన్‌ఓ ప్రపంచ దేశాలను కోరింది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 177 కోట్ల మంది నిరాశ్రయులున్నారు.
భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం నిరాశ్రయులు 20 లక్షల మంది వున్నారు. కానీ కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో వివిధ కారణాలవల్ల కోట్ల మంది నిరాశ్రయులు ఉన్నట్టు అనధికార అంచనా. వీరిలో వలస కూలీలు, మానసిక వైకల్యం కలవారు, వికలాంగులు, వయో వృద్ధులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురైనవారు ఉన్నారు. వీధిబాలలు, భిక్షాటన చేసుకునేవారు, పట్టణీకరణ మోజులో గ్రామాల నుండి ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చిన వారు కూడా నిరాశ్రయులు గానే జీవిస్తున్నారు.
నిరాశ్రయుల కోసం వసతి గృహాలు నిర్మించాలని 2013లో సర్వోన్నత న్యాయస్థానం భారత ప్రభుత్వం ద్వారా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిరాశ్రయుల ప్రస్తుత పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సంవత్సరం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి కైలాస్ గంభీర్ నేతృత్వంలోని కమిటీ పలు రాష్ట్రాలలో పర్యటించి నిరాశ్రయుల స్థితిగతులపై సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పి ంచింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని అన్ని ప్రధాన నగరాలలోనూ నిరాశ్రయుల కోసం వసతి కేంద్రాలు ఏర్పాటు చేసి వారి వసతి, భోజనం, సంరక్షణ బాధ్యతలు చూడాలని సుప్రీంకోర్టు చెప్పింది. మన రాష్ట్రంలోని 42 మున్సిపాలిటీల పరిధిలో 89 నిరాశ్రయ కేంద్రాలు నడుస్తున్నాయి. మిగిలిన మున్సిపాలిటీలలో కూడా నిరాశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పరిష్కారాలు...జనాభా ప్రాతిపదికన ప్రతీ లక్ష మంది జనాభా ఉన్నచోట ఒక నైట్ షెల్టర్ ప్రారంభించాలి. నిరాశ్రయ కేంద్రం కోసం శాశ్వత భవనాలు నిర్మించాలి. వారి జీవనోపాధి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ప్రారంభించాలి. మహిళలకు, వికలాంగులకు, మానసిక సమస్యలున్న వారికి, యాచకులకు వేర్వేరుగా నైట్ షెల్టర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీరికి తప్పనిసరిగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. పట్టణ జీవనోపాధుల పథకం ద్వారా రుణాలు ఇచ్చి, వ్యాపారాలు ప్రారంభింపచేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఏర్పాటు చేయాలి.
- డా. గుబ్బల రాంబాబు,
ఉభయ గోదావరి జిల్లాల జీవిత బీమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,
సెల్ : 9849847489