
హైదరాబాద్ జీవితమంటే గుండెను మెలిపెట్టే 'మెలాం కలి' లాంటిది. ఆ 'మెలాం కలి'ని బతుకంతా మోస్తూ.. అనుభవిస్తూ.. వస్తున్న ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్ సంవత్సరన్నర పాటు హైదరాబాద్ నుండే వెలువడే ''దక్కన్ ల్యాండ్'' మాసపత్రికకు సీరియల్‌గా రాసిిన తన బాల్యకాలపు అనుభవాల పుష్పాలను, కథానికా మాలికగా కూర్చి 'అన్వీక్షికి' పబ్లిషర్స్ ప్రై.లి.వారి సౌజన్యంతో ఇటీవలే వెలువరించిన సరికొత్త కథా సంపుటి ఈ ''చార్ మినార్'' కథలు.
ఇందులో మొత్తం 16 కథలున్నాయి. ఈ పదహారు కథల రుచి మొత్తంగా చెప్పాలంటే ''ఉగాది పచ్చడి'' అంత విభిన్నంగా వుంటుంది. దేని రుచి దానిదే. ఎవరి అనుభూతి వారిదే. ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వీకరించాల్సిందే. ఆ రుచిని మనసారా ఆస్వాదించాల్సిందే.
కథల్లో భాష ఎలా వుందంటే! తెలంగాణ తెలుగు, ఉర్దూ కలగలిసి, సామెతల్తో, షాయిరీలతో పుల్లారెడ్డి స్వీట్ షాప్‌ల అద్దాల్లో నుండి అందంగా కనిపిస్తూ ఊరించే బొబ్బట్లంత పసందుగా ఉంటుంది. అంతేనా అంటే కాదు, ఇంకా వుంది. మా చిన్ననాట మా సొంత పొలంలో సేంద్రియ ఎరువులు మాత్రమే వేసుకుని పండించుకున్న పాలసన్నాల వడ్లను రోట దంచుకుని కలిపెట్టి, కట్టెల పొయ్యి మీద మట్టికుండలో వండుకు తిన్న పాలసన్నాల బియ్యపు అన్నమంత మధురంగా వుంటాయీ కథలు.
కథల ఆరంభం, ముగింపుల్లో జానపద శైలీ ఛాయలు తొంగి చూస్తుంటాయి. అదే పాఠకుల్లో చదవాలన్న ఆసక్తిని పెంచుతుంది. ఈ విషయంలో లోకేశ్వర్ పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారని చెప్పవచ్చు. సంపుటిలోని 16 కథల్లో ఒకటి రెండు కథల్ని పరామర్శిస్తే... మొదటి కథ 'నిర్జనారణ్యంలో నామకరణం' వ్యక్తిగత జీవితాల్లో ప్రతి అంశం విలక్షణంగానే ఉంటుంది. దానికి కాలంతో పనిలేదు. అటువంటి వాటిలో ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలకు అందమైన పేర్లు పెట్టాలని ఎంతగా వెంపర్లాడుతారో! ఆడుతున్నారో!! అందరికీ అనుభవైక వేద్యమే. మన రచయిత, కథకు నాయకుడూ అయిన లోకేశ్వర్‌కి ఆ పేరును ఖాయం చేయడానికి వారి తల్లిగారికి 60, 70 ఏండ్ల కిందనే ఏడాది కాలం పట్టిందంటే, అందమైన పేర్ల అన్వేషణ ఎంత నిత్య నూతనంగా, ఎంత విభిన్నంగా కొనసాగుతూ వస్తుందో చెప్పకనే చెప్పారు రచయిత.
మరో నిజమైన 'మెలాం కలి' కథ 'జాఫర్ మామూ'. కథల కార్యస్థలమైన శాలిబండ, రూపులాల్ బజార్లో.. కులాలకు, మతాలకు, వేషభాషలకు అతీతంగా కదంబ మాలగా కలిసి బతుకుతున్న పాఠశాల చప్రాసి జాఫర్ మామూ ఛిద్రజీవిత బతుకు చిత్రం. స్వార్ధ రాజకీయ రాక్షస క్రీడకు బలై, సర్వం కోల్పోయి.. ఒక ముస్లింగా ఈ దేశంలో ఇక జీవించలేనన్న ఆలోచనతో ఓ అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా దేశమే విడిచిపెట్టి వెళ్లిపోయిన విధం.. పాఠకుల కళ్లల్లో ఆర్ధ్రతను, మెదళ్లలో ఆలోచనల ప్రకంపనలనూ కలిగించే గొప్పకథ. పాఠకుల మనసుల్లో చాలాకాలం పాటు నిలిచిపోయే కథ. సంపుటంలో ఇంకా ''చాచా నెహ్రూకు ప్రేమలేఖ'', ''పాతబాకీ'' లాంటి కట్టి పడేసే కథల్తోపాటు 'మృత్యువుతో ముఖాముఖం' గల్పికలాంటి చిత్రమైన కథ కూడా పాఠకులను అలరిస్తాయి.
చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోయే 'సిల్క్ రూట్' లో ఒంటరిగా పయనించి, ఆ బాటలో ఎదురయ్యే చారిత్రక అవశేషాలను, వ్యక్తిగత, సామాజిక జీవిత విశేషాలనూ పరికించి, పరిశోధించి చూసి.. వాటి నేపథ్యంతో ''సిల్క్ రూట్‌లో సాహస యాత్ర'' పేరుతో కలకాలం నిలిచిపోయే యాత్రా కథన గ్రంథాన్ని, హైదరాబాద్ చారిత్రక ఘటనల కూర్పుతో పాటు తన నిజజీవిత గమనాన్ని 'సలామ్ హైదరాబాద్', 'కల్లోల కలల కాలం' వంటి బతుకు పుస్తకా లను వెలువరించిన లోకేశ్వర్ కలం.. మరిన్ని మంచి రచన లను అందిస్తుందన్న పాఠకుల నమ్మకాన్ని కథకుడు వమ్ము చేయరన్న భరోసా ఇచ్చిన ఈ ''చార్‌మినార్'' కథల సంపుటి.. రచయిత అక్షర కిరీటంలో మరో కలికితురాయిలాంటిది.
ప్రచురణ : అన్వీక్షికి
పేజీలు : 131
ధర : రు.150 లు
లభ్యం : అన్ని ప్రధాన పుస్తకాల షాపుల్లోనూ..
- శీరంశెట్టి కాంతారావు,
98498 90322