Sep 28,2022 16:38

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీరు ఆహారంలో రైస్‌, గోధుమల్నే తీసుకుంటున్నారా? అయితే అనారోగ్యం మీ దరిచేరుతున్నట్లేనని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ రైస్‌నే తిన్నా.. లేక చపాతీ, పుల్కా వంటివి గోధుమపిండితో చేసే పదార్థాలని తింటూ.. చిరుధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా బియ్యాన్ని వినియోగించడం వల్ల బ్లడ్‌ షుగర్‌, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అసలు చిరుధాన్యాల్ని తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

గుండెకు మేలు చేస్తాయి
చిరుధాన్యాల్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. 'ముఖ్యంగా చిరుధాన్యాల్లో విటమిన్‌ బి3 ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ అధికస్థాయిలో లేకపోతే.. గుండె జబ్బులు రావు. అందుకే చిరుధాన్యాల్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది' అని డైటీషియన్‌ డాక్టర్‌ స్వాతి సంధన్‌ చెబుతున్నారు. అలాగే మిల్లెట్స్‌... అజీర్ణం కాని కార్బోహైడ్రేట్లు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. మధుమేహస్తులు గనుక వీటిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయని, ఇన్సులిన్‌ తీసుకునే స్థాయివరకు వెళ్లకుండా ఉండొచ్చని స్వాతి సంధన్‌ సూచించారు.

heart


బరువును నియంత్రిస్తాయి
బరువు తగ్గాలనుకునేవాళ్లకి చిరుధాన్యాలు బెస్ట్‌ ఆప్షన్‌. ఉదయం టిఫిన్లలో రాగి ఊతప్పం, సాయంత్రం వేళ స్నాక్స్‌లో రాగి బిస్కెట్లు తీసుకుంటే బరువును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇక అలాగే మధ్యాహ్నం రైస్‌కి బదులు జొన్నలతో చేసే కిచిడి తీసుకుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చంటున్నారు. ఇక రాగి జావ, లేక గంజి, కార్న్‌ఫ్లేక్స్‌ తీసుకుంటే శరీరంలో కొవ్వు స్థాయి తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చని డాక్టర్‌ అగర్వాలా చెప్పారు.

waitloss


చిరుధాన్యాల్లో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ ఎ, సి, మెగ్నీషియం, విటమిన్‌ బి, కాల్షియం వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటితో ఇష్టంగా తినేలా పదార్థాలను తయారుచేసుకుని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురికారని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరూ ప్రతిరోజూ ఆహారంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తే అనారోగ్యాలకు గురికారు.