Jul 29,2023 09:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇడిపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మహిళల్ని ఢిల్లీలోని ఇడి కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ భార్య రుజిరా బెనర్జీ తరపున టిఎంసి నేత అభిషేక్‌ బెనర్జీ, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లు శుక్రవారం జస్టిస్‌ సంజరు కిషన్‌కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ నిమిత్తం ఎవర్నైనా ఈడి ఢిల్లీకి పిలవచ్చా? అనే అంశాన్ని తేల్చాలని కవిత తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. వారం పది రోజులు ముందుగానే నోటీసులు ఇచ్చి పిలుస్తామని ఇడి తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు తెలిపారు. దీంతో ఆయా పిటిషన్లు మెరిట్స్‌ ఆధారంగా పరిష్కరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ మూడు పిటిషన్లలోనూ ఇడి ఆరు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని వాటిపై రెండు వారాల్లో రిజాయిండర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది.