ఆకాకర మామూలు కాకరకాయలా చేదు ఉండదు. దాంతో పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. సీజనల్‌గా దొరికే ఈ ఆకాకర చాలా ఖరీదు కూడా. అదే పల్లెల్లో అయితే కంపల మీద దొరుకుతాయి. దీని దుంప తెచ్చి, ఇళ్లల్లో కూడా నాటుకోవచ్చు. దీన్ని ఆకాకర, అడవి కాకర, బోడకాకర ఇలా పలుపేర్లతో పిలుస్తారు. ఆకాకరను రకరకాలుగా చేసుకుని తినొచ్చు. వేపుడు, కూర, పులుసు, నిల్వపచ్చడి.. అయితే అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
వేపుడు..
కావలసిన పదార్థాలు : ఆకాకరకాయలు- 1/2 కేజీ, ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి- 4, ఉప్పు, కారం- తగినంత, పసుపు- 1/4 స్పూను, తాలింపు దినుసులు- స్పూను, ఎండుమిర్చి- 2, కరివేపాకు- 2 రెబ్బలు, నూనె- 4 స్పూన్లు
పొడి కోసం : దోరగా వేయించిన పల్లీలు- 4స్పూన్లు, ధనియాలు - స్పూన్, నువ్వులు - 2 స్పూన్లు, వేయించిన శనగపప్పు - స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 6 (అన్నింటిని కలిపి పొడ చేసుకోవాలి).
తయారీ: బాండీలో నూనె వేడి చేసి, తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసి, వేపాలి. అవి దోరగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి, రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఆకాకరకాయ ముక్కలు వేసి, మూతపెట్టాలి. ముక్కలు మగ్గేంతవరకూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మగ్గాక కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కూరంతా ఒకసారి తిప్పాలి. చివరిగా తయారుచేసుకున్న పొడి చల్లి, కలిపి, నిమిషంపాటు ఉంచి దింపేయాలి.
కూర..
కావలసిన పదార్థాలు: ఆకాకరకాయలు - 1/2 కేజీ, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-4, టమాటాలు- 3, ఉప్పు, కారం - తగినంత, పసుపు- 1/4 స్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, తాలింపు దినుసులు- కొద్దిగా, ఎండుమిర్చి- 2, కరివేపాకు- 2 రెబ్బలు, నూనె - తగినంత
తయారీ: బాండీలో నూనె వేడిచేసి, తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసి, వేపాలి. అవి దోరగా వేగాక ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఆకాకరకాయ ముక్కలు వేసి మూతపెట్టాలి. ముక్కలు మగ్గేంతవరకూ మధ్యలో కలుపుతూ ఉండాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, రెండు నిమిషాలు వేపాలి. పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు వేసి, అవి మెత్తగా ఉడికించాలి. చివరిగా కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కూరంతా ఒకసారి తిప్పి, మూతపెట్టాలి. అలా నిమిషం పాటు ఉంచి, స్టౌ ఆఫ్ చేయాలి.
నిల్వ పచ్చడి
కావలసిన పదార్ధాలు: ఆకాకరకాయలు - 1/4కేజి, పచ్చడికారం - 5 స్పూన్లు, ఉప్పు - 4 స్పూన్, ఆవపిండి - స్పూన్, మెంతిపిండి - 1/4 స్పూన్, తాలింపు వేయడానికి నూనె - 1/4 కేజీ, కరివేపాకు - 4 రెమ్మలు, ఎండుమిర్చి - 4, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు - స్పూన్ చొప్పున, వెల్లుల్లి రెబ్బలు - 15, పసుపు - 1/4 స్పూన్, నిమ్మరసం -1/4 కప్పు.
తయారీ: కాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. పూర్తిగా కాయలు ఆరిపోయాక నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం మంటపై ముక్కలు మగ్గేవరకూ నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఆ ముక్కలను ఒక పెద్ద బేసిన్‌లోకి తీసుకుని, అదే నూనెలో తాలింపు పెట్టుకోవాలి. తరువాత ముక్కలకు కారం, ఉప్పు, ఆవపిండి, మెంతి పిండి, వెల్లుల్లి, నిమ్మరసం అన్నీ వేసి, బాగా కలిసేలా కలపాలి. ఈ పచ్చడి నెలరోజులు నిలువ ఉంటుంది.
పులుసు..
కావలసిన పదార్థాలు: ఆకాకరకాయలు - 1/2 కేజి, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, టమాటాలు - 2, ఉప్పు, కారం - తగినంత, పసుపు - 1/4 స్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, తాలింపు దినుసులు - కొద్దిగా, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, నూనె - 2 స్పూన్లు, నిమ్మకాయ సైజంత చింతపండుతో తీసిన పులుసు.
తయారీ: బాండీలో నూనె వేడిచేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసి, వేపాలి. అవి దోరగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తర్వాత కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు వేసి, రెండు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఆకాకరకాయ ముక్కలు వేసి, కలిపి మూతపెట్టాలి. ముక్కలు మగ్గేంతవరకూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మగ్గాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి , రెండు నిమిషాలు వేపాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి, మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు కారం వేసి మరోసారి కలిపి, చింతపండు పులుసు పోయాలి. బాగా కలిపి, ఐదారు నిమిషాలు ఉడికించి, దించేయాలి.