
ఎన్నో సంవత్సరాలుగా అనేక అంశాలపై అనేక దినోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ఆరోగ్య రంగంలోనూ అలాంటి దినోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. '2000 సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్యం' అనే అంశంపై 1978 నుంచి కార్యక్రమాలు చేస్తున్నా 2022 సంవత్సరం వచ్చినా కొందరికే ఆరోగ్యం అందుతున్న దుస్థితిలో ఉన్నాం. ఇదే పద్ధతిలో 2017 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన 'యూనివర్సల్ హెల్త్ కవరేజ్' దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ వైద్య ఆవశ్యకత, ప్రైవేటు వైద్యం దోపిడీ ఏమిటో అందరికీ అవగతమైంది. ఈ పరిస్థితుల్లో ఈ దినోత్సవం ఎలా జరుగుతుంది? దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మనదేశానికి యూనివర్సల్ హెల్త్ కవరేజీ ఉందా? 'యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే' అసలు ఎందుకు జరుపుకుంటారు? అనే విషయాలపై కొద్దిగా లోతుల్లోకి వెళ్లి వివరించేదే ఈ ప్రత్యేక కథనం..
ఉచిత ప్రభుత్వ వైద్యం అందక, ఖరీదైన ప్రైవేటు వైద్యాన్ని కొనుక్కోలేక సాధారణ ప్రజలతో పాటు, మధ్యతరగతి ప్రజలు కూడా అల్లాడుతున్నారు. అసలే ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. ఆపై అందరికీ అందుబాటులో లేని వైద్యం. ఈ నేపథ్యంలో ఆర్థికంగా, మానసికంగా ప్రజలు చితికిపోయి, అనేక బాధలు అనుభవిస్తున్నారు. కరోనా వేళ ప్రభుత్వ వైద్యం యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకొని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితులు. అయినప్పటికీ నేటికీ కార్పొరేట్ వైద్యమే వైద్యరంగంలో కోరలు చాచుకుని దోచుకుంటోంది. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజలందరికీ ఆరోగ్యం అందించాల్సి ఉంది.
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ?
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ అవసరమైన అన్ని ఆరోగ్య సేవలు, ఎల్లవేళలా అందుబాటులో ఉండడం. వైద్యం అందుబాటులో ఉండటం మాత్రమే కాదు నివారణ. పునరావాసం, ఉపశమన సంరక్షణ వరకు అవసరమైన పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను కలిగి ఉండడం. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి బలమైన ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి చేయడం గురించి అవగాహన పెంచడమే ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ప్రస్తుతం ప్రతి దేశానికి యూనివర్సల్ హెల్త్ కవరేజీ లేదు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన ఆరోగ్య సేవలను పొందగలరు. ఇలాంటి సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వాలను ప్రోత్సహిస్తూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కార్యక్రమాన్ని చేయాలని 2012 డిసెంబర్ 12న ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది.

ఈ కార్యక్రమం అవసరం
ప్రపంచ బ్యాంకు, WHO నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో కనీసం సగం మంది అవసరమైన ఆరోగ్య సేవలను పొందలేకున్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం అయ్యే ఖర్చులను తమ సొంత జేబుల నుండి చెల్లించుకోలేక పెద్ద ఎత్తున అనేక కుటుంబాలు పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. ప్రస్తుతం 800 మిలియన్ల మంది ప్రజలు తమ కుటుంబ బడ్జెట్‌లో కనీసం 10 శాతాన్ని కుటుంబసభ్యుల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు దాదాపు 100 మిలియన్ల మందిని అత్యంత పేదరికంలోకి నెడుతున్నాయి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఏర్పడితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.
అందరికీ ఆరోగ్యం అందాలంటే ప్రభుత్వాలు ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం తమ బాధ్యతగా భావించాలి. అందుకు ఈ కింద సూచించిన కార్యక్రమాలను చేయాలి.
1. ఆరోగ్యహక్కు చట్టాన్ని రూపొందించాలి.
2 ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు పెంచాలి.
3. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి.
4. పి.పి.పి.లను హేతుబద్ధం చెయ్యాలి.
5. కార్పొరేట్ ఆసుపత్రులను నియంత్రించి, రోగుల హక్కులకు రక్షణ కల్పించాలి.
6. ఔషధ రంగంలో జరుగుతున్న దోపిడీిని అరికట్టాలి.
7. జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలి.
8. మద్యాన్ని నిషేధించాలి.
9. మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీని ఎత్తి వేయాలి.
10. గిరిజన, కొండ ప్రాంతాల ప్రజల ప్రాణాలను కాపాడాలి.
11. వ్యాధి నివారణ, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
12.. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.

థీమ్ 2022
'మనకు కావలసిన ప్రపంచాన్ని నిర్మించండి! అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తు!!' ఈ ఏడాది థీమ్‌గా ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరిరక్షణ అనేది అత్యంత కీలకమైనది. అప్పుడే మనకు కావాల్సిన ప్రపంచాన్ని నిర్మించగలం. అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వగలం. ప్రతి ఏడాది డిసెంబర్ 12న, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అనేది ''అందరికీ ఆరోగ్యం'' దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయడానికి సూచించింది. మనం కోరుకునే ప్రపంచంలో, ప్రతిచోటా ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అవసరమైనప్పుడు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలి. ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడానికి మనకు ఈక్విటీ, నమ్మకం, ఆరోగ్యకరమైన వాతావరణం, పెట్టుబడులు, జవాబుదారీతనం అవసరమని నొక్కి చెబుతోంది.

ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి..
ఆరోగ్య ప్రణాళికల రూపకల్పనలో, వ్యవస్థల నిర్వహణలో, పర్యవేక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. గ్రామ ఆరోగ్య పోషకాహార, పారిశుధ్య కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ కమిటీలను క్రియాశీలంగా పనిచేయించాలి. ఆసుపత్రి అభివృద్ధికమిటీలు జిల్లా ఆరోగ్యం సమాఖ్యలను ప్రజాస్వామిక స్పూర్తితో నిర్వహించాలి. నేడు ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య వ్యవస్థలలో నెలకొన్న ఎన్నో సమస్యలకు ప్రజల భాగస్వామ్యం అద్భుతమైన పరిష్కారాలను చూపగలదు.
ఆరోగ్య రంగంలో ఇటువంటి మార్పులు తీసుకొచ్చి, పటిష్టంగా అమలు చేసినప్పుడు మాత్రమే 2030 నాటికి సార్వత్రిక ఆరోగ్య రక్షణ ప్రజలందరికీ అందించగలం. ఈ యునైటెడ్ హెల్త్ కవరేజ్ ఉద్దేశాన్ని నెరవేర్చగలం. ఏ దేశాభివృద్ధి అయినా అక్కడి ప్రజల ఆరోగ్య పరిరక్షణ మీద ఆధారపడి ఉంటుందన్నది ప్రభుత్వాలు గమనంలో ఉంచుకోవాలి.

ఆరోగ్యహక్కు చట్టాన్ని రూపొందించాలి..
ఆరోగ్య సేవలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదు. ఆరోగ్య సేవలను పొందే హక్కును ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాలి. ఆరోగ్యాన్ని ప్రాథమిక మానవహక్కుగా అన్ని దేశాలు, అన్ని రంగాలు సమర్థించాలి. అప్పుడే మనందరం కోరుకునే ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించడానికి బలమైన పునాది వేయగలం.
ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు పెంచాలి..
జాతీయ ఆరోగ్య విధానం 2017లో ప్రకటించినట్లుగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు చేసే వ్యయాన్ని స్థూల జాతీయ ఉత్పత్తిలో 3 నుంచి 5 శాతానికి పెంచాలి. అంకెల గారడీలు, కంటి తుడుపు పెంపుదలలు చేసి, మేమే ప్రజలను ఉద్దరిస్తామనే ప్రస్తుత ధోరణిని నేతలు విడనాడాలి. తగిన రీతిలో బడ్జెట్ కేటాయింపులు పెంచకుండా కంటితుడుపు కార్యక్రమాల వలన ప్రజారోగ్యం బాగుపడదన్నది జగమెరిగిన సత్యం.

ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలి..
మారుమూల గ్రామాల నుంచి రాజధాని వరకు, ప్రాథమిక స్థాయి నుంచి తృతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చెయ్యడానికి తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలి. భారత ప్రజారోగ్య ప్రమాణాల మేరకు అన్ని అసుపత్రులలో వైద్యులను, సిబ్బందిని నియమించాలి. వైద్య పరికరాలను, వసతులను సమకూర్చాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో లభించే వైద్యసేవలను గణనీయంగా పెంచాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెఫరల్ సెంటర్‌లైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లకు వైద్యానికి వెళ్లడానికి ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ కాన్పులు జరిగే వసతి లేకపోవడం. చిన్న ఆపరేషన్ కూడా చేసే పరిస్థితి లేదు. ఇన్ పేషెంట్లుగా చేరిన రోగులను చూసుకునేందుకు తగినంత మంది సిబ్బంది లేరు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన సిబ్బందిని, పరికరాలను, మందులను ఏర్పాటు చేయగలిగితే చాలామంది సాధారణ ప్రజానీకానికి మెరుగైన వైద్యం జరిగే వీలుంటుంది.

పి.పి.పి.లను హేతుబద్ధం చెయ్యాలి..
ప్రస్తుతం మనకు కావలసింది ఇన్స్యూరెన్సు ప్యాకేజీలు కాదు, సార్వత్రిక ఆరోగ్యరక్షణ కావాలి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పి.పి.పి.) పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్య రంగంలో విచ్చలవిడిగా ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ పి.పి.పి.లు వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరచకపోగా, ప్రజారోగ్యానికి కేటాయించే కొద్దిపాటి నిధులను కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే ఉపయోగపడ్డాయని అనేక అధ్యయనాలు స్పష్టంగా వెల్లడించాయి. ఆసుపత్రులలో అందుబాటులో లేని నూతన సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర చికిత్సలు అందించటానికి మాత్రమే ఈ పి.పి.పి.లను పరిమితం చేయాలి. కార్పొరేట్ల చేతిలో వున్న 104, 108 సేవలను, అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రభుత్వమే నడపాలి. మన పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలు ప్రజలందరికీ అన్ని రకాల వైద్యసేవలను ఉచితంగా అందించే 'సార్వత్రిక ఆరోగ్య రక్షణ' వ్యవస్థ దిశగా పయనిస్తుంటే మన దేశంలో మాత్రం కొన్ని ఎంపిక చేసిన చికిత్సలను కొద్దిమందికి మాత్రమే అందించే 'ఆరోగ్యశ్రీ ఇన్స్యూరెన్సు' పథకాలను అమలుచేస్తూ అదే మహా ఘనకార్యమన్నట్లు ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో కూడా ఎల్లవేళలా అన్ని రకాల వైద్య సేవలను అందించగలిగే 'సార్వత్రిక ఆరోగ్య రక్షణ' వ్యవస్థను రూపొందించాలి.

కార్పొరేట్ ఆసుపత్రులను నియంత్రించాలి..
దీనిద్వారా రోగుల హక్కులకు రక్షణ కల్పించాలి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ రోజురోజుకూ పెరిగిపోతుంది. మధ్యతరగతి వారు కూడా ఈ దోపిడీని తట్టుకోగలిగే పరిస్థితి లేదు. కార్పొరేట్ ఆసుపత్రులపై తగిన నియంత్రణను అమలుచేయాలి. అదే సమయంలో చిన్న, మధ్యస్థాయి ప్రైవేట్ ఆసుపత్రులకు రక్షణ కల్పించడానికి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి తగిన సవరణలు చేయాలి. ఫీజులు, వైద్య పరీక్షల పేరుతో దోపిడీకి గురికాకుండా చూడాలి. నాణ్యమైన వైద్యసేవలు పొందేలా రోగుల హక్కులకు రక్షణ కల్పించడానికి నిబంధనలను రూపొందించాలి.

ఔషధ రంగంలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి..
వైద్యానికి జరుగుతున్న ఖర్చులలో ప్రధానంగా మందులు ఖర్చు ఎక్కువగా ఉంది. అత్యవసర, నిత్యావసర మందులు ప్రజలకు అందుబాటు ధరలలో లభించేలా చర్యలు తీసుకోవాలి. వాటి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఔషధ నియంత్రణ విభాగాన్ని బలోపేతం చెయ్యాలి. అవకతవకలకు పాల్పడే ఔషధ తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తయారీ వ్యయం ఆధారంగా ఔషధాల ధరలను నిర్ణయించాలి. ప్రభుత్వరంగ ఔషధ, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులందరికీ అన్ని మందులను ఉచితంగా అందించాలి.

జనరిక్ మందుల షాపుల ఏర్పాటు ..
ప్రజల ప్రయోజనార్థం ప్రతి మండల కేంద్రంలో జనరిక్ మందుల షాపులు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలి. ఇవి పేద, మధ్యతరగతి ప్రజల వైద్యఖర్చులు తగ్గించుకునేందుకు ఎంతో ఉపకరిస్తాయి. వైద్యులందరూ జనరిక్ మందులనే సూచించాలనే నిబంధనను కట్టుదిట్టంగా అమలు జరపాలి.

మద్యాన్ని నిషేధించాలి..
ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. ప్రజారోగ్యం మీద, కుటుంబాల మీద, యువత భవిష్యత్తు మీద శాంతి భద్రతల మీద మద్యపానం యొక్క తీవ్రమైన ప్రభావాన్ని ప్రభుత్వం గుర్తించాలి. మద్యాన్ని సేవించి, వాహనాలు నడుపుతున్నందున ప్రతిరోజూ వేలాది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మద్య నియంత్రణను పటిష్టంగా అమలుచేయాలి.

మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీ ఎత్తి వేయాలి..
ప్రస్తుతం రోగులకయ్యే ఖర్చులో అత్యధికభాగం మందుల కొనుగోలుకే అవుతుంది. దీని వలన కోట్ల మంది రోగులు పేదరికంలోకి నెట్టబడుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇక నిరుపేదలకైతే కొనే పరిస్థితిలేక మరణాలకు చేరువవుతున్న దుస్థితి. కావునా ప్రజల ప్రాణాలు కాపాడే మందులు, వైద్య పరికరాలపై ప్రస్తుతం విధిస్తున్న 12 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించాలి. మందులను, వైద్య పరికరాలను ప్రభుత్వాలే పూర్తిస్థాయిలో ఉచితంగా ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చెయ్యాలి.

గిరిజన, కొండ ప్రాంతాల ప్రజల ప్రాణాల్ని కాపాడాలి..
కిడ్నీ వ్యాధులు, మలేరియా, పైలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు గిరిజన, కొండ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి.

వ్యాధి నివారణ, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి..
దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే జ్వరాలు, ఇతర జబ్బుల నుంచి ప్రజలను కాపాడాలి. 'దోమలపై దండయాత్ర' వంటి ప్రచార ఆర్భాటాలకు పరిమితం కాకుండా, చిత్తశుద్ధితో కార్యాచరణ చేపట్టాలి. రక్తహీనత, తదితర పోషకాహార లోపాల నుంచి మహిళలను, చిన్న పిల్లలను కాపాడాలి. దీనికోసం అంగన్వాడీ కేంద్రాలను, మధ్యాహ్న భోజన పథకాలను బలోపేతం చెయ్యాలి. మాతా శిశ మరణాలను అరికట్టాలి.
డాక్టర్ ఎం.వి. రమణయ్య
అధ్యక్షులు
ప్రజారోగ్య వేదిక
ఆంధ్రప్రదేశ్ కమిటీ
9490300431