
'అందరికి ఆరోగ్యం' దిశగా మనం అడుగులు వేయాలంటే ప్రపంచ దేశాలన్నీ ప్రాథమిక ఆరోగ్యంపైన దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ నొక్కి చెబుతోంది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంటే ప్రజలందరికీ (కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా) సమానమైన, నాణ్యమైన కనీస ఆరోగ్యసేవలు, ఇంటికి దగ్గరగా, అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడమే. ప్రాథమికంగా అందించే వైద్య సేవలు సాంస్కృతికంగా ప్రజలకు ఆమోదయోగ్యంగానూ ఉండాలి. ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న వివిధ రంగాలని సమన్వయపరచి, ఒకే వేదిక పైకి తీసుకురావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గనిర్దేశం చేస్తోంది. ఈ నెల 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో దీనిపై ఈ ప్రత్యేక కథనం..
ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో వ్యక్తులుగా మనం ఏంటో మర్చిపోతున్నాం. మన అభిరుచులు, రుచులు, కళలు, ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవన్నీ మరచిపోయి టీవీ షోలు, సినిమాలు, ఓటీటీలు, సామాజిక మాధ్యమాలే జీవితంగా బతుకుతున్నాం. కార్పొరేట్ ప్రపంచం మనకి ఎటువంటి జీవితం చూపిస్తుందో అలాంటి జీవితాన్నే మనం అలవాటు చేసుకుంటున్నాం. చివరికి వాళ్లు ఆడించే మర బొమ్మలుగా మనం తయారవుతున్నాం. మనిషిగా మనకి ఉండాల్సిన కనీస మానవ విలువలు కూడా లేకుండా ఒక కలల ప్రపంచంలో కొట్టుకుపోతున్నాం. ఆరోగ్యంగా ఉండటం అంటే మనకి ఏ రోగం లేకుండా ఉండటం మాత్రమే కాదు. ఆరోగ్యం అంటే ఒక సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక జీవనశైలి. ఆరోగ్యం అంటే మనం సామాజిక ఉత్పత్తిలో పాల్గొనగలగడం.. మనల్ని మనం మానసికంగా, సాంస్కృతికంగా అత్యుత్తమ మనుషులుగా తీర్చిదిద్దుకోగలగడం.. సాటి మనుషులకి, ప్రాణులకి ఉపయోగపడగలగడం. ఇలాంటి ఆరోగ్యం మనం సంపాదించాలంటే మన దినచర్యతోనే అది మొదలు కావాలి. రోజువారీ జీవితంలో మనకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి. తినే ఆహారం గురించి శాస్త్రీయమైన అవగాహనను పెంపొందించుకోవాలి. జీవనశైలిలో వ్యాయామం తప్పనిసరి భాగం కావాలి. కోతుల నుండి మనుషులుగా రూపాంతరం చెందిన మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక శ్రమతో పాటు శారీరక శ్రమ కూడా అవసరమని గుర్తించాలి. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, డిప్రెషన్ వంటి వ్యాధులు శారీరక శ్రమ లేకుండా కేవలం ఒకే దగ్గర నిశ్చలంగా కూర్చొని ఉండటం వల్ల, మానసిక ఆందోళన (స్ట్రెస్), నిద్రలేమి, పొగ, మద్యం తాగడం, ఉప్పు ఎక్కువగా (రోజుకి 5గ్రా మించి) తినడం వల్ల వస్తున్నాయి. ఈ వ్యాధులన్నిటికీ ప్రధానకారణం మన చుట్టూ ఉన్న వ్యవస్థలోని లోపం అయితే.. ఆరోగ్య సమస్యల పట్ల నిపుణుల నుండి (శాస్త్రీయ వెబ్‌సైట్ల నుండి) సమాచారం తెలుసుకోకపోవడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించకపోవడం మన వ్యక్తిగత లోపం. మన ఆరోగ్యం పట్ల మనం బాధ్యతగా ఉండటం.. అశాస్త్రీయమైన విషయాలను వ్యతిరేకించడం.. వాటి పట్ల మన చుట్టాలకు, స్నేహితులకు సరైన అవగాహన కల్పించడం.. వంటివి మన కనీస బాధ్యతలుగా నిర్వర్తించాలి.

- 75 వసంతాల ప్రస్థానం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లో ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి.. ప్రపంచ ప్రజలను వ్యాధుల బారినుండి సురక్షితంగా ఉంచడానికి.. బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఐక్యరాజ్య సమితి స్థాపించిన సంస్థ. ప్రపంచంలో ఎవరు ఏ మూల ఉన్నా కూడా వారికి అత్యున్నత ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. కరోనా వంటి అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో అన్ని దేశాలకీ దిశా నిర్దేశం చేసి సమన్వయపరచడం.. శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలను ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన పెంచడం.. దీని ప్రధాన లక్ష్యాలు. ప్రస్తుతం ప్రపంచంలోని 194 దేశాలతో ఇది పనిచేస్తుంది. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ 75వ వార్షికోత్సవం జరుపుకుంటుంది.
- ఈ ఏడాది థీమ్.. అందరికీ ఆరోగ్యం
ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినం నిర్వహిస్తూ ఒక ప్రత్యేకమైన నేపథ్యాన్ని ఎంచుకుని, ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ ఏడాది 'అందరికీ ఆరోగ్యం' అనే నినాదాన్ని మన ముందుకు తెచ్చింది.

- గణాంకాలు ఏం చెబుతున్నాయి?
మన దేశంలోని దక్షిణ రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, మహారాష్ట్రలో ఆరోగ్య సూచీలు ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి ప్రజల్లో చైతన్యం, విద్యా విధానాలు, వారికి అందుబాటులో ఉండే వనరులు కొంత కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఎన్.ఎఫ్.హెచ్, ఎస్-వి లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 69% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పైపు నీటి సరఫరా సదుపాయం కేవలం 22% ఇళ్లకి మాత్రమే ఉంది. ఇంకా సురక్షితం కాని పొయ్యిమీద (కట్టెలు/బొగ్గు/పిడకలు ఉపయోగించి) వంట చేసుకునే ఇళ్లు 16% ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 22% ఇళ్ళల్లోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోనే మలమూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళల ఆరోగ్యం విషయానికొస్తే 30% మంది మహిళలకి 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఈ వయసులో ప్రత్యుత్పత్తి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకుండానే గర్భం దాలుస్తున్నారు. దీనివల్ల నవజాత శిశు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మహిళల్లో 15% మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే, 36% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. గణనీయంగా ప్రతీ ఐదుగురిలో ముగ్గురు మహిళలకు, ప్రతీ ఐదుగురిలో ముగ్గురు పిల్లలకు రక్తహీనత లోపం ఉంది. వెయ్యిలో ముప్పై మంది పిల్లలు ఏడాదన్నా నిండకుండానే మరణిస్తున్నారు. రెండు సంవత్సరాల లోపు ఉన్న 25% పిల్లలకి టీకాలు సరిగ్గా అందడం లేదు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 30% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పురుషుల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరికి, మహిళల్లో ప్రతీ పది మందిలో ఒకరికి అధిక రక్తపోటు ఉంది. ప్రతీ పదిమందిలో ఒక్కరికి మధుమేహం ఉంది. ప్రతీ ఐదుగురు పురుషుల్లో ఒకరు పొగ తాగడం / పొగాకు తినడం చేస్తారని, ప్రతీ ముగ్గురిలో ఒకరికి మందు తాగే అలవాటు ఉందని లెక్కలు చెబుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవలను పటిష్టం చేస్తేనే ఈ ఆరోగ్య సూచికలు మెరుగుపడే వీలు ఉంటుంది.

- కరోనా నేర్పించిన పాఠాలు..
కరోనా మనకి నేర్పించిన పాఠాల్లో ముఖ్యమైనది ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని బలోపేతం చేయడం. కరోనా లాంటి మహమ్మారి వచ్చినపుడు ఏ ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలూ అందించలేని సేవలు ప్రభుత్వ సంస్థలు అందించాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు సమాజానికి పట్టు కొమ్మల్లాంటివి. మన దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు అతి తక్కువ ఆర్థిక వనరులతో పనిచేస్తున్నాయి. ఇంత పెద్ద దేశం కరోనా సమయంలో కేవలం రెండే సంస్థలపైన (ఢిల్లీలోని ఐసిఎంఆర్, పూణేలోని వైరాలజీ ల్యాబ్) ఆధారపడాల్సి వచ్చింది. ఆ రెండు సంస్థలు తప్ప ఏ ప్రభుత్వరంగ సంస్థ కూడా శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం అందించే స్థాయిలో పని చేయలేకపోయాయి. దేశ ప్రజలందరికీ అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన కరోనా టీకాలు, మందులు కూడా ప్రయివేటు సంస్థల దగ్గర కొనుక్కోవాల్సిన దారుణమైన దుస్థితి. దీనికి కారణం అన్నిరకాల ఆరోగ్య సంస్థల్ని, ల్యాబ్‌లని వంతుల వారీగా నిర్వీర్యం చేసిన మన ప్రభుత్వాలే. కరోనా మహమ్మారి గురించి వచ్చిన వదంతులూ, అబద్ధపు ప్రచారాలూ, అశాస్త్రీయ వైద్య విధానాలూ, మూఢనమ్మకాలూ, నాటు వైద్యాలు, ప్రజల ప్రాణాలతో చెలగాటాలూ - ఇవేవీ తిప్పి కొట్టడానికి ఏ ప్రభుత్వ సంస్థ కూడా ముందుకు రాలేకపోయింది. ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలని మరింత బలపరిచేలా తప్పట్లు, తాళాలు వాయించి, కరోనాని పారద్రోలాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు.. ప్రపంచం అంతా మనల్ని చూసి నవ్వేలా చేసింది. ప్రయివేటు ప్రసార మాధ్యమాల్లో విచ్చల విడిగా ఏ నియంత్రణా లేకుండా సాగిన అసత్యపు ప్రచారాలూ, అసలు వైద్యంతో సంబంధంలేని వ్యక్తులతో ఇప్పించిన ఉపన్యాసాలు, డిబేట్లు మనం సమాజ పరంగా ఎంత వెనుకబడిపోయామో కళ్లకు కట్టినట్టు చూపించింది. అన్ని రకాల వనరులు సమృద్ధిగా ఉన్న మన దేశంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే కరోనా మహమ్మారిని ఆపడం, దాని ఫలితంగా మరణించిన వారి సంఖ్యను భారీగా తగ్గించే అవకాశం ఉండేది. ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రభుత్వం ఇన్ఫెక్షియస్ డీసీజెస్ (అంటురోగాల) విభాగాన్ని, పబ్లిక్ హెల్త్ (ప్రజారోగ్యం) విభాగాన్ని, కమ్యూనిటిక్ అండ్ ఫామిలీ మెడిసిన్ (కుటుంబ మరియు సామాజిక వైద్య) విభాగాన్ని బలోపేతం చేసే చర్యలు తీసుకోకపోతే మున్ముందు చాలా నష్టపోక తప్పదు.

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం..
గిరిజన ప్రాంతాల్లో నిత్యం ప్రజలు రవాణా సౌకర్యాలు లేక, సమయానికి ఆస్పత్రులకు చేరుకోలేక ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో ఓ గర్భిణీ ప్రసవం అనంతరం ఎలా మూడు కి.మీ మేర నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందో చూశాము. సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్ల నిత్యం ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లనీ చూస్తున్నాం. 'అందరికీ ఆరోగ్యం' అంటే ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలకి (స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలివాళ్లు, సామాజికంగా అణగారిన కులాలు, వర్గాలు మొదలైనవారికి) అన్ని రకాల అత్యవసర/ నిత్యావసర ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చేయడం. అయితే భారత దేశ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం గత కొన్ని దశాబ్దాలుగా మన జీడీపీలో రెండు శాతం కూడా ఖర్చు పెట్టట్లేదనేది ఆ ప్రభుత్వ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. అయితే మనతో పోటీ పడుతూ ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు (బ్రిక్స్ దేశాలు) ఆరోగ్యంపై మన కంటే చాలా ఎక్కువ (కనిష్టం ఐదు శాతం నుండి గరిష్టం 9.6 శాతం వరకు) ఖర్చు చేస్తున్నాయి. మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా తమ దేశ జీడీపీలో మూడు శాతం వరకూ కేటాయిస్తోంది. ప్రపంచ అగ్రగాములైన అమెరికా 17 శాతం, జపాన్, యుకెలు 10 శాతం వరకూ కేటాయిస్తుంటే, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం మాత్రం కేవలం రెండు శాతం దగ్గరే తచ్చాడుతున్నాం. ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎంతో కాలంగా ప్రజారోగ్యానికి కనీసం ఐదు శాతం కేటాయించమని డిమాండు చేస్తున్నాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా అది తీరని కలగానే మిగిలిపోతోంది.

- ఎన్నిపేర్లు మార్చినా ఉపయోగమేంటి..?
'పేదలకి మెరుగైన వైద్యం' అనే నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆకర్షణీయమైన 'ఆరోగ్యశ్రీ' పథకానికి ఎన్నిపేర్లు మార్చినా అది కార్పొరేట్ ఆస్పత్రుల సొమ్ము పెంచడానికీ, ప్రజలను అసలు సమస్యల నుండి పక్కదారి పట్టించడానికీ ఉపయోగపడుతుందే తప్ప, వారికి జరిగే మేలు చాలా స్వల్పం. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు కేటాయించాయి. కానీ 95% రోగాలు, సాధారణ ప్రజారోగ్య సమస్యలు (టీబీ, హెచఐవీ మలేరియా, డెంగ్యూ, అతిసార వ్యాధి, కాలేయ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి) ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావు. ప్రజలకి ప్రధాన ఖర్చులైన నిత్యం అవసరమయ్యే మందులు, అవుట్ పేషెంట్ సేవలు వంటివి ఇందులో చేర్చలేదు. రోగం ముదిరాక వచ్చే సమస్యలూ, చాలా అరుదుగా, లక్షల మందిలో ఒకరికి వచ్చే సమస్యలు మాత్రమే దీని పరిధిలోకి వస్తాయి. రోగం సోకే ముందే తీసుకోవాల్సిన నివారణా చర్యలు, చిన్న పిల్లల్లో, పెద్ద వాళ్లల్లో రోగాలను నివారించడానికి తీసుకునే టీకాలు, రోగం ముదరకుండా వాడాల్సిన మందులు, అంటే ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించిన ఏ అంశం కూడా ఇందులో చేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్, పీఎంజేఏవై పథకాలు ఆరోగ్యశ్రీ కంటే కొంచెం మెరుగ్గా కనబడినా ఈ పథకాలేవీ కూడా సామాన్య రోగాలని మొదటి, రెండో దశలో చికిత్స చేయడానికి ఉపయోగపడవు. ఈ పథకాలన్నీ ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులకు డబ్బులు ధార పొయ్యడానికే. అంతేతప్ప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నాణ్యత పెంచడానికి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించడానికి ఏమాత్రం ఇవి సహాయపడవు. తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి ఉపయోగపడవు. ప్రజలకు దగ్గరగా, అందుబాటులో ఉండే ఆరోగ్య ఉపకేంద్రాలు (సబ్-సెంటర్లు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు) ఆరోగ్య సిబ్బందిని పెంచడం.. మౌలిక సదుపాయాలు కల్పించడం.. వాటిని 24 గంటలూ సేవలు అందించే కేంద్రాలుగా మార్చడం.. వంటి కనీస చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్య పరంగా సమాజంలో పునాదులు లేని అద్దాల మేడలను నిర్మించిన వారిమే అవుతాం.

- సోషలిస్టు సమాజం ఆవశ్యకత..
ప్రస్తుత పెట్టుబడిదారీ రాజ్యంలో ప్రజారోగ్యం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే ఒక సరుకుగా మారింది. కరోనా విజృభించిన సమయంలో జనాల ప్రాణాలు కూడా సరుకుగా మారడం చూశాం. మనం ఆక్సిజన్ కోసం పడిన ఇబ్బందులు, కొందరి ప్రాణాలు నిలబెట్టడానికి మరికొందరి ప్రాణాలను ఫణంగా పెట్టడం వంటి ఘోరాలను కూడా చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన 'ఆరోగ్య హక్కు' చట్టం హర్షించదగ్గదే అయినా ఇలాంటి సంస్కరణలు చర్యల దగ్గరే ఆగిపోతే.. మనిషి నిజంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం ఎప్పటికీ సాధ్యం కాదు. మనిషి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే ముందు ఆరోగ్యవంతమైన జీవితం గడపగలగాలి. తమ లాభాల వేటలో చుట్టూ ఉండే గాలి, నీరు, నేలను కాలుష్యవంతం చేసే ఫ్యాక్టరీలు, ఇండిస్టీలు ఉన్నంత కాలం.. ప్రజలను ఉద్యోగం పేరుతో, పోటీ పేరుతో ఎంతో ఆందోళనకు గురిచేసే కార్పొరేట్ సంస్థలు ఉన్నంత కాలం.. అసలు కనీస ఆహరం, నివాసం, పని, ఆరోగ్య సేవలు కల్పించలేని ప్రభుత్వాలు మనల్ని ఏలుతున్నంత కాలం.. మనకి సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం సాధ్యపడదు. అందుకే 'అందరికీ ఆరోగ్యం' అనే నినాదం నినాదంగా ఉండిపోకుండా.. అది నిజం కావాలంటే మనం సోషలిస్టు సమాజం వైపు అడుగులు వేయాల్సిందే.

- రాజస్థాన్ తరహా చట్టం అవసరం..
ఆరోగ్య హక్కు అనేది ప్రతి మనిషికీ ఉండే ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ప్రతి ఒక్కరూ ఏ రకమైన ఆర్థిక ఇబ్బందీ లేకుండా ఆరోగ్య సేవలను ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందే అవకాశం ఉండాలి. ప్రపంచంలోని 30% ప్రజలకి ప్రస్తుతం అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి సంవత్సరం అనారోగ్యంపై చేసే ఖర్చులతో 20 లక్షల మంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ ప్రభుత్వం దేశంలో మొట్ట మొదటిసారిగా 'ఆరోగ్య హక్కు' చట్టం తేవడం హర్షణీయం. ఈ చట్టం కింద వ్యక్తికి ఉండే రకరకాల ఆరోగ్య హక్కులను పేర్కొన్నారు. అందులో ముఖ్యమైనవి, వ్యాధి గురించి మొత్తం అవసరమైన సమాచారాన్ని ఆస్పత్రి వర్గాల నుండి తెలుసుకునే హక్కు.. అత్యవసర (ఎమర్జెన్సీ) సేవలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ముందుగా నిర్ణయించబడ్డ కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో ముందస్తు డబ్బులు చెల్లించకుండా వినియోగించుకునే హక్కు.. సంక్లిష్టమైన రోగాలకు అధిక ప్రమాణాలతో కూడుకున్న చికిత్స తీసుకోడానికి తృతీయ వైద్య సేవలందించే ఆస్పత్రులకు ఉచిత రవాణా హక్కు.. పేషెంట్ మరణించినపుడు వారు ఆస్పత్రి ఖర్చులు చెల్లించారా, లేదా అనే దానితో సంబంధం లేకుండా మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకువెళ్లే హక్కు.. మొదలైనవి. వీటన్నిటితో పాటు పేషెంట్ల బాధ్యతలు, ఆరోగ్య సేవలు అందించే వారి హక్కులు, బాధ్యతలు కూడా ఇందులో చేర్చారు. ఈ హక్కులకు సంబంధించిన వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ఈ చట్టం తమ వృత్తిని సరిగ్గా నిర్వర్తించడానికి వీలు లేకుండా చేస్తుందని పలు ప్రయివేటు డాక్టర్లు, కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అమలు ఎలా సాగుతుందో, దీనివల్ల వచ్చే ఆచరణాత్మక ఇబ్బందులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

- జనరిక్ మందుల ఆవశ్యకత..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నాణ్యమైన మందుల తయారీకి బాధ్యత వహించి, అవి అందరికీ అందుబాటు ధరలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రులు, డాక్టర్లు, ఆర్‌ఎంపీలు ఏర్పాటు చేసుకున్న నెక్సస్లని నిర్వీర్యం చేసి, కేవలం జనరిక్ పేర్లతో మాత్రమే మందులను విక్రయించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలి. అనవసరమైన, అధిక ఖరీదు ఉన్న మందులు రాయకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలి.
డాక్టర్ దేశం పిఆర్
ఎంబీబీఎస్, ఎండి ప్రజారోగ్య నిపుణులు 9490057793