ప్రజాశక్తి-కాకినాడ : ఫోర్టిఫైడ్ బియ్యం (పోషకాహార బియ్యం)తో ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. శనివారం స్థానిక మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో పౌర సరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఫోర్టిఫైడ్ బియ్యంతో వంటల పోటీలను ఎంపీ వంగా గీత, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ కతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ ఆర్‌డీవో ఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వంటల పోటీలను ప్రారంభించారు. అనంతరం 30 మహిళా బందాలు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉపయోగించి తయారుచేసిన వివిధ రకాల వంటలను పరిశీలించి, రుచి చూశారు. పోషకాహార బియ్యాన్ని ఉపయోగించి ఫోర్టిఫైడ్ రైస్ పకోడీ, ఫోర్టిఫైడ్ రైస్ నూక బిర్యానీ, లడ్డూలు, గారెలు, సూప్, కిచిడీ, వడియాలు తదితరాలను తయారుచేసిన మహిళలను అభినందించారు.
- విజేతలకు బహుమతుల ప్రదానం...
ఫోర్టిఫైడ్ బియ్యంతో తయారు చేసిన వంటకాల పోటీల్లో విజేతలకు శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కతికా శుక్లా, ఎమ్మెల్సీ కె.పద్మశ్రీ, జేసీ ఎస్.ఇలక్కియ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ జి. నాగమణిలతో కలిసి నగదు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి (రూ. 10 వేలు) పెదపూడికి చెందిన కె.శ్రావణి, బి.రమ్య తయారు చేసిన గంజి సూప్ కి లభించింది. ద్వితీయ బహుమతి (రూ. 5 వేలు) జగ్గంపేటకు చెందిన వై.నాగమణి, వై.వరలక్ష్మి తయారు చేసిన స్నాక్ ఐటమ్ కి, తతీయ బహుమతి (రూ. 3 వేలు) తాళ్ళరేవుకు చెందిన బి.శ్రీ మహాలక్ష్మి, బి.మేఘనశ్రీ తయారు చేసిన ఇడియప్పంకు లభించింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ వంటల పోటీల్లో పాల్గొన్న 30 బందాలకు రూ.500 చొప్పున మొత్తం రూ.15 వేలు ప్రోత్సాహకంగా అందజేశారు.










