Jun 18,2022 06:47

ఆపదలో ఆత్మబంధువుగా వ్యవహరించే ఆరోగ్యశ్రీ పథకంలో నగదు బదిలీ ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ తలంపు ఆస్పత్రుల్లో రోగుల తక్షణ చికిత్సలకు ఆటంకం కావొచ్చు. పేదలు రూపాయి చెల్లించకుండా కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌ పొందాలన్న ఆరోగ్యశ్రీ ప్రకటిత లక్ష్యానికి అనర్ధం. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డుపై చికిత్సలకు అయ్యే సొమ్ము ఆస్పత్రుల యాజమాన్యాల బ్యాంక్‌ ఖాతాలకు సర్కారు జమ చేసింది. ఇక నుండి రోగి అకౌంట్‌లో వేసే పద్ధతి తీసుకురావాలని సోమవారంనాటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. రోగి ఖాతా నుండి ఆటో డెబిట్‌ పద్ధతిలో ఆస్పత్రులకు వెళ్లాలన్నారు. అమల్లో ఉన్న విధానాన్ని ప్రభుత్వం మార్చాలనుకుంటే కొత్త పద్ధతిలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలపై కూలంకుషంగా అధ్యయనం చేశాక ముందడుగు వేయాలి. ఇప్పుడున్న పద్ధతిని ఎందుకు మార్చాలనుకున్నారో సర్కారు వద్ద హేతుబద్ధ కారణాలేవీ కనిపించట్లేదు. కేవలం పొరపాట్లు సరి అవుతాయని మాత్రమే అంటున్నారు. ఏదైనా పద్ధతిలో చేసే మార్పు ఇప్పుడున్న దానికంటే మెరుగైనదై ఉండాలి. కానీ ఆటో డెబిట్‌ పద్ధతి లబ్ధిదారుల వడపోతలకు, లబ్ధిలో జాప్యానికి దారి తీస్తోందన్నది అనుభవం. ఆరోగ్యశ్రీలో అదే జరిగితే పేషెంట్ల ట్రీట్‌మెంట్‌కు భరోసా ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.
కార్పొరేట్‌, ప్రైవేటు వైద్యమంటే భయపడుతున్న క్రమంలో దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు ఆ ఆస్పత్రుల్లో చికిత్సల లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2007లో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్‌ స్కీం ప్రారంభమైంది. విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అప్పట్లో కుటుంబానికి రూ.రెండు లక్షల పరిమితి విధించగా, ఎ.పి.లో వైసిపి వచ్చాక పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం 2,446 ప్రొసీజర్స్‌ను స్కీంలో చేర్చారు. మరికొన్నింటిని చేరుస్తామనీ చెబుతున్నారు. సర్కారు ప్రచారం చేసుకున్న స్థాయిలో పథకం నడక లేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ చాలా చాలా పరిమితం. ఖర్చు పరిమితి రూ.5 లక్షలంటున్నా ఫలాన చికిత్సకు ఫలాన మొత్తం అని సర్కారుకు, ఆస్పత్రులకు మధ్య కుదిరే ఒప్పందాల్లో పేర్కొనే ప్యాకేజీలు ఒక పట్టాన తేలవు. చాలా చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు. రూ.వెయ్యి ఖర్చయ్యే ప్రతి ట్రీట్‌మెంట్‌ ఆరోగ్యశ్రీ లోకి వస్తుందన్న ప్రభుత్వ హామీ ఎక్కడా అమలు కావట్లేదు. సర్కారు నుండి బిల్లులు ఆలస్యం కావడంతో పలు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవల నుండి తప్పుకుంటున్నాయి. ముందు డబ్బు కడితేనే ట్రీట్‌మెంట్‌ చేస్తున్నాయి. ఒక వేళ చేర్చుకున్నా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డులు ఎక్కడో మూలన పడేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులు, సాధారణ రోగులకు మధ్య సదుపాయాల్లో వివక్ష కొనసాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే డిబిటి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో?
డిబిటి అమలైన పథకాల్లో లబ్ధిదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యా దీవెన) ఉదాహరణ. విద్యా సంస్థలకు కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లకు ఫీజులు జమ చేయడం వలన అటు పిల్లలు ఇటు పేరెంట్స్‌ పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వ నిధులు ఆలస్యమైతే విద్యార్ధులను సంస్థలు పరీక్షలు రాయనీయట్లేదు. హాల్‌టిక్కెట్లు ఆపేస్తున్నాయి. మార్కుల మెమోలు తొక్కిపెడుతున్నాయి. ముందే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీలోనూ డిబిటి అని, బ్యాంక్‌, రోగి, ఆస్పత్రి మధ్య అంగీకార పత్రాలన్న నిబంధన పెడితే రోగుల అత్యవసర చికిత్సల పరిస్థితేంటో ఊహించడానికే భయమేస్తోంది. పేదల ఆరోగ్యానికి కాస్తంత భరోసా కల్పించే ఆరోగ్యశ్రీలో డిబిటిపై ప్రభుత్వం పునరాలోచించాలి. కార్పొరేట్లకు లాభం చేకూర్చే ఆరోగ్యశ్రీ తరహా ఇన్సూరెన్స్‌ పథకాల ప్రయోజనాలు తాత్కాలికం. కోవిడ్‌ సమయంలో ఇన్సూరెన్స్‌ వైద్యం వైఫల్యాలు ప్రపంచాన్ని కళ్లు తెరిపించాయి. ఆ వెలుగులో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టపర్చాలి. ఉచిత సార్వజనీన వైద్యానికి ప్రభుత్వం పూచీ పడాలి. అప్పుడే ప్రజల ఆరోగ్యానికి నిజమైన భరోసా.