Oct 13,2023 07:10

సర్వేలో పాల్గొన్న కుటుంబాలు తమ ఆదాయంలో వైద్యం, విద్య కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు మరింత ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. వైద్య ఖర్చుల కోసం సంవత్సరంలో సగటున నెలకు రూ.5 వేల లోపు ఖర్చు పెడుతున్నవారు 19 శాతం మంది ఉండగా, 5-10 వేల లోపు ఖర్చు చేసిన వారు 41 శాతం మంది ఉన్నారు. 30-50 వేల వరకు ఖర్చు చేసినవారు 14 శాతం మంది ఉన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం మొత్తం హెల్త్‌ కేర్‌లో ప్రజలు పెట్టే ఖర్చు ('ఔటాఫ్‌ పాకెట్‌') వాటా 73 శాతం ఉందని 2019లో నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ అంచనా వేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం వైద్యం మీద దేశ స్థూల జాతీయాదాయంలో కేవలం 1.1 శాతం మాత్రమే ఖర్చు పెడుతుంది.

         వైద్యం అత్యంత ఖరీదైన సరుకుగా మారింది. దేశంలో ప్రతి సంవత్సరం 29 లక్షల కోట్ల రూపాయల వైద్య వ్యాపారం జరుగుతోంది. మన రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఈ పథకం ద్వారా మూడు వేలకు పైగా ఉచిత వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు తాము పొందుతున్న ఆదాయంలో సుమారు 35 నుండి 41 శాతం వైద్యం కోసం ఖర్చు చేస్తున్నట్లు వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి. విద్యా, వైద్య రంగాల నుండి ప్రభుత్వం తప్పుకోవడం పెరిగేకొద్దీ ప్రజలపై భారాలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయలు దోచి పెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు విద్యా వైద్యం ప్రైవేటీకరణకే తోడ్పడు తున్నాయి. అనంతపురం జిల్లాలో విద్యా, వైద్యం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చుల గురించి 16 మండలాలు, మూడు పట్టణాల్లో వందలాది కుటుంబాల దగ్గర ప్రజారోగ్య వేదిక కార్యకర్తలు గత నెలలో సర్వే చేశారు. ప్రభుత్వ విద్యా వైద్య రంగాలను కాపాడుకోవలసిన అవసరాన్ని ఈ సర్వే బట్టబయలు చేసింది.
 

                                                              పెరుగుతున్న ఖర్చులు

సర్వేలో పాల్గొన్న కుటుంబాలు తమ ఆదా యంలో వైద్యం, విద్య కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు మరింత ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. వైద్య ఖర్చుల కోసం సంవత్సరంలో సగటున నెలకు రూ.5 వేల లోపు ఖర్చు పెడుతున్నవారు 19 శాతం మంది ఉండగా, 5-10 వేల లోపు ఖర్చు చేసిన వారు 41 శాతం మంది ఉన్నారు. 30-50 వేల వరకు ఖర్చు చేసినవారు 14 శాతం మంది ఉన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం మొత్తం హెల్త్‌ కేర్‌లో ప్రజలు పెట్టే ఖర్చు ('ఔటాఫ్‌ పాకెట్‌') వాటా 73 శాతం ఉందని 2019లో నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ అంచనా వేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం వైద్యం మీద దేశ స్థూల జాతీయాదాయంలో కేవలం 1.1 శాతం మాత్రమే ఖర్చు పెడుతుంది. ఈ పరిస్థితి అసమానతలను మరింతగా పెంచుతుంది. విద్య కోసం సగటున నెలకు 5 వేల వరకు ఖర్చు చేసినవారు 55 శాతం, 20-30 వేల లోపు 15 శాతం మంది ఖర్చు చేశారు. ప్రాథమిక విద్య, ఇంటర్‌, ఆపై చదువులు పూర్తిగా ప్రైవేట్‌పరం కావడంతో విద్య కోసం చేసే ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ప్రాథమిక విద్య కోసం ప్రైవేట్‌ విద్యాలయాల్లో చేరిన పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లల్లో సెకండరీ విద్యకు వచ్చే నాటికి 57 శాతం మంది డ్రాపౌట్‌ అయ్యారు.
          పేద, దిగువ మధ్యతరగతి వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రుల పైనే ఆధార పడుతున్నారు. ఈ ఆసుపత్రులను ప్రభుత్వాలు తమ విధానాల ద్వారా ఎంత బలహీనం చేసినప్పటికీ పేద, దిగువ మధ్యతరగతి వారు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల మీదే ఆధారపడతున్నారు. విద్య కోసం ఖర్చు పెరిగే కొద్దీ పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడడం పెరుగుతుంది. సర్వేలో పాల్గొన్నవారు తెలిపిన వివరాల ప్రకారం సంవత్సరంలో వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినవారు 50.9 శాతం మంది, అర్బన్‌/రూరల్‌ హెల్త్‌ సెంటర్లకు వెళ్లినవారు 35.8 శాతం మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,255 రకాల వ్యాధులకు వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న స్థితిలో కూడా ఈ పరిస్థితి ఉందనే విషయాన్ని గమనించాలి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజువారీ పేషెంట్లు వేల సంఖ్యలో వస్తున్నారు. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో రోజుకు సగటున 1500-1700 మంది వైద్య సేవలు పొందుతున్నారు. అలాగే ఇన్‌పేషెంట్లు కూడా పడకలకు రెండింతలుగా ఆడ్మిట్‌ అవుతున్నారు. అన్నీ ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అందుతుంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు వస్తున్నారో ప్రభుత్వాలు ఆలోచించడంలేదు. పేదలు వైద్యం కోసం అప్పుల మీద ఆధారపడడం పెరుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందడానికి అనుమతి వచ్చే లోపుగానే వివిధ రకాల పరీక్షల పేరుతో ప్రైవేట్‌ ఆసుపత్రులు వేల రూపాయలు రోగుల నుండి లాగేస్తున్నారు. వైద్యం కోసం సంవత్సర కాలంలో 5-10 వేల లోపు అప్పులు చేసిన వారు 53 శాతం, 10-20 వేల వరకు అప్పులు చేసిన వారు 11 శాతం కాగా 50 నుండి లక్ష రూపాయల వరకు చేసిన వారు 15 శాతం మంది ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. తమ ఆదాయం కంటే ఖర్చులు పెరగడం వల్ల పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు తమకున్న చిన్న ఇల్లు, కొద్దిపాటి భూమి, ఇతర ఆస్తులను కోల్పోయి మరింతగా పేదరికంలోకి దిగజారుతున్నారు. మందుల మీద చేసే ఖర్చుల వల్ల దేశంలో 3.4 కోట్ల మంది ప్రజలు దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని అంచనాలు ఉన్నాయి.
 

                                                             ప్రజారోగ్యం రాజ్యాంగ హక్కు

రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్‌ లోని ఆదేశిక సూత్రాల్లో ప్రజారోగ్యం గురించి చెప్పబడింది. 'పోషకాహార విని యోగాన్ని, తన ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, ప్రజారోగ్య అభివృద్ధి రాజ్యం యొక్క ప్రాథమిక విధి' అని రాజ్యాంగ నిపుణులు పేర్కొన్నారు. అందులో భాగంగా 1949లో భోర్‌ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ మూడు ముఖ్యమైన సిఫార్సులు చేసింది. ఒకటి-ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంటే ప్రజారోగ్యం మరియు వ్యాధుల్ని నిరోధించడం, రెండు-జిల్లా ఆసుపత్రుల్లో వైద్య సంరక్షణ, మూడు-నగరాల్లో అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రుల ఏర్పాటు. 1952 నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు తాలుకా, జిల్లా, ప్రాంతీయ స్థాయి ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని, వసతులనూ పెంచారు. 1999 నాటికి దేశంలో 25 వేలు, 2001 నాటికి మన రాష్ట్రంలో 1345 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి. 2001 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 40 బోధన స్థాయి, 21 జిల్లా మరియు 4 టి.బి ఆసుపత్రులు, 49 ఏరియా, 72 కమ్యూనిటీ ఆసుపత్రులు, 24 జిల్లా టి.బీ కేంద్రాలు ఏర్పడ్డాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అంటే ప్రజల మానసిక, శారీరక శ్రమలను కాపాడుకోవడమే. శ్రమజీవులు ఆరోగ్యంగా ఉండడం అంటే...ఆరోగ్యం శ్రమను అమ్ముకునే వారికే కాదు, కొనేవారికి కూడా అంతే అవసరం. అందుకని ప్రభుత్వాలే ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతను స్వీకరించాయి. వైద్య రంగంలో ప్రైవేట్‌ వైద్యం చాలా కాలం నుండి ఉన్నప్పటికీ అది చాలా తక్కువ మోతాదులో పట్టణాలు లేదా మహానగరాల్లో ఉండేది. ప్రైవేటీకరణ విధానాలే పాలకుల విధానాలుగా ఎప్పుడైతే మారాయో అప్పటి నుండి ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం పెరిగి వైద్యం పెద్ద వ్యాపారంగా మారింది. ఆ తర్వాత ఈ రంగంలోకి తిమింగలాల లాంటి పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు చొరబడ్డాయి. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తి నీరుగారిపోయింది.
 

                                                            కార్పొరేట్‌ సేవలో ఆరోగ్యశ్రీ పథకం

1987లో మద్రాసు అపోలో హాస్పటల్‌తో మొదలైన ఈ వ్యాపారం 1989 నుండి వేగంగా విస్తరించింది. ఈ ఆసుపత్రుల నిర్మాణానికి బ్యాంకు రుణాలు, నిర్వహణ కోసం విద్యుత్‌ రాయితీలు, నీటి వాడకంపై సబ్సిడీలు, యంత్రాల దిగుమతులకు ప్రత్యేక రాయితీలు కల్పించి వీటిని ప్రభుత్వాలు పెంచి పోషించాయి. ఇవి బతికి బట్టకట్టి బలపడాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను చంపేయాలి. అందుకోసం సిబ్బందిని నియమించక పోవడం, మందులు, పరికరాలు అందించక పోవడం, నిధులు కోత కోయడం ఒక విధానంగా ప్రభుత్వాలు అమలు చేశాయి. ఇన్ని చేసినా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం కొనసాగింది. కారణం అక్కడ ఉచితంగా వైద్యం అందడమే కాక నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉండడం. ప్రైవేట్‌ రంగం పట్ల వున్న భయం. ఈ భయాన్ని పోగొట్టేందుకు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉన్నత వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పొందడానికి విధానాలను మార్చారు.
           2007 ఏప్రిల్‌ 1న రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరుతో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఒక పథకాన్ని ప్రారంభించారు. 2014లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకానికి డాక్టర్‌ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.ఆర్‌ ఆరోగ్యశ్రీగా మరలా మార్చారు. పేర్లు మారినా విధానం ఒక్కటే. అది ప్రైవేట్‌ ఆసుపత్రులకు ప్రభుత్వ సొమ్ము అప్పగించి వాటిని బలోపేతం చేయడం. మొత్తం 3,256 సేవలను ఈ పథకం ద్వారా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం పొందడానికి అవకాశం కల్పించారు. ఈ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పొందవచ్చు కాని ఆచరణలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోగులను తరమడానికే ఈ విధానాలు తోడ్పడ్డాయి. అందుకనే జిల్లా, తాలుకా కేంద్రాల్లో పెద్ద పెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రులో అన్ని రకాల హంగు ఆర్భాటాలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే అవకాశాన్ని పొందుతున్నారు.
        2022-23 (22 డిసెంబర్‌ నాటికి) రాష్ట్రంలో 1,41,54,228 ఆరోగ్యశ్రీ కార్డులను ప్రజలకు అందించారు. ఇప్పటి వరకు 16,47,782 మంది ఈ పథకం కింద వైద్య సేవలు పొందారు. ఇందులో అత్యధిక భాగం ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకున్నారు. ఇందుకు గాను రూ. 4,999.66 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఇది కాకుండా మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ సదుపాయాన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులకు అనుమతించారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులు నిధులు, సిబ్బంది, వైద్య పరికరాలు లేక ఈసురోమంటుంటే స్టార్‌ హోటళ్లను తలపించే కార్పొరేట్‌ ఆసుపత్రులకు సిరుల పంట పండిస్తున్నారు. ఈ మంగళవారం విడుదల చేసిన ధనవంతుల జాబితాలో మన రాష్ట్రంలోని టాప్‌ 19 మంది ధనవంతుల్లో పది మంది వైద్య రంగానికి చెందినవారే కావడం ఆశ్చర్యమేమీ కాదు. వీరి సంపద విలువ రూ.1,51,800 కోట్లు.
         వైద్య కళాశాలలో సీట్ల భర్తీ నుండే వైద్యాన్ని మరింత వ్యాపారం చేసే ప్రక్రియను కేంద్రం, రాష్ట్రం కలగలిసి అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ వైద్య రంగాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని కరోనా మహమ్మారి కళ్లకు కట్టినట్లు చూపిన తర్వాత కూడా ప్రైవేట్‌ సేవలో మునిగిపోతున్న పాలకుల కళ్ళను ప్రజా ఉద్యమాల ద్వారానే తెరిపించగలం.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
వి. రాంభూపాల్‌

Health-burdening-people