ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఫలం నేరేడు.. సహజసిద్ధంగా దొరికే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. తీపి, వగరు, పులుపు రుచులతో నోట్లో వేసుకోగానే పుల్లపుల్లగా.. తీయతీయగా.. కాసింత వగరుగా ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. వేసవి చివరల్లో, తొలకరిలోనూ విరివిగా దొరుకుతుంది. చూడగానే నోరూరించే ఈ నేరేడు పండు పలు రుగ్మతలను నివారిస్తుంది. మధుమేహం తగ్గుముఖం పడుతుంది. అతిమూత్ర వ్యాధి నివారణతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంతటి ప్రయోజనాలున్న నేరేడును ఫలాలుగానేకాదు.. ప్రత్యేక వంటకాలూ చేసుకోవచ్చు.. అవేంటో చూద్దాం..!
జామూన్ ఫుడ్డింగ్
కావాల్సిన పదార్థాలు : నేరేడు పండు గుజ్జు-250 గ్రాములు, పాలు-1/2 లీటర్లు, చిక్కగా మరిగించిన పాలు-1/2 కప్పు, పంచదార-6 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్-2 టీస్పూన్లు, అగార్ పొడి-10 గ్రాములు, విప్పింగ్ క్రీం -కప్పు.
తయారీ విధానం : నేరేడు పండ్లను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
పావు కప్పు నీటిలో ఈ ముక్కలు వేసి మరిగించాలి.
దీన్ని మ్యాషర్‌తో మెత్తగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి.
మరో గిన్నెలో పాలు వేడిచేసి, పంచదార వేసి కరిగించాలి.
దీనిలో చిక్కగా మరిగించుకున్న పాలను కలుపుకోవాలి.
సన్నని సెగమీద కార్న్‌ఫ్లోర్ పేస్ట్‌ని, అగార్ పొడిని వేసి తిప్పుతూ కలపాలి.
స్టౌ కట్టేసి జామూన్ సిరప్ వేసి కలుపుకోవాలి.
దీన్ని ఫుడ్డింగ్ మౌల్డ్‌లో పోసి 15 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
దీనిపై విప్పింగ్ క్రీమ్‌లో రెండు టీస్పూన్ల జామూన్ సిరప్ వేసి కలుపుకోవాలి.
దీన్ని చెర్రీస్‌తో కలిపి డెకరేట్ చేసుకోవాలి.
ఫిజ్
కావాల్సిన పదార్థాలు : నేరేడు పళ్లు- 12, నిమ్మకాయ-ఒకటి, సోడా-200 మిల్లీ లీటర్లు, యాపిల్ జూస్-500 మి.లీ, ఐస్‌క్యూబ్స్-ఆరు, పుదీనా-కొద్దిగా.
తయారీ విధానం : ముందుగా నిమ్మకాయ, సోడా, యాపిల్ జూస్‌ని కాక్‌టెయిల్ షేకర్‌లో వేసి కలుపుకోవాలి.
ఇందులో నేరేడు పళ్ల జ్యూస్‌ను కలిపి, మరోసారి షేక్ చేయాలి.
దీన్ని గాజు గ్లాసుల్లోకి పోసుకోవాలి.
ఇందులో రెండు మూడు నేరేపండు ముక్కలు వేసుకోవాలి.
గ్లాసులో మిగిలిన భాగాన్ని సోడా, ఐస్‌క్యూబ్స్‌తో నింపి, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి.
రైతా
కావాల్సిన పదార్థాలు : పెరుగు- కప్పు, నేరేడు పండ్లు- అరకప్పు (విత్తనం తీసినవి), ఉప్పు- తగినంత, జీలకర్ర- అర టేబుల్‌స్పూను, కొత్తిమీర- టేబుల్‌స్పూను.
తయారీ విధానం : ముందుగా పెరుగును బౌల్‌లోకి తీసుకోవాలి.
నేరేడు పండ్లలోని విత్తనాలను తొలగించాలి. తర్వాత నేరేడు పండ్లను ముక్కలుగా చేసుకోవాలి.
వాటిని పెరుగులో కలుపుకోవాలి.
అందులోనే ఉప్పు, జీలకర్ర, కొత్తిమీరను వేయాలి.
వాటన్నింటినీ స్పూనుతో బాగా కలపాలి. అంతే రైతా రెడీ.
కొంత సమయం ఫ్రిజ్‌లో పెట్టి, సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది.
ఇది కిచిడీకి మంచి కాంబినేషన్.
పచ్చడి
కావాల్సిన పదార్థాలు : నేరేడు పండ్లు - పది,
కారం - పావు టీస్పూను, ఇంగువ - చిటికెడు,
ఉప్పు - సరిపడా, నూనె, ఆవాలు - ఒక్కో స్పూను, మెంతులు, చక్కెర - ఒక్కో పావు టీస్పూను, పసుపు - చిటికెడు, కరివేపాకు - గుప్పెడు.
తయారీ విధానం :
ముందుగా నేరేడు పండ్లలోని విత్తనాలను తొలగించి, ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేడిచేయాలి. అందులో ఆవాలు, మెంతులు వేసి వేగించాలి.
అవి వేగిన తర్వాత ఇంగువ, కరివేపాకు వేయాలి.
అందులోనే నేరేడు ముక్కలు, పసుపు, ఉప్పు వేయాలి.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
అందులో కారం, చక్కెర వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పాన్‌పై మూతపెట్టి, మూడు నిమిషాలు అలాగే ఉంచాలి.
తర్వాత దీన్ని బౌల్‌లోకి తీసి సర్వ్ చేసుకోవాలి.
స్లష్
కావాల్సిన పదార్థాలు : నేరేడు పండ్లు- 10 లేదా 12 (విత్తనం తీసినవి), నింబూ పానీ ఐస్‌క్యూబ్స్- 8 లేదా 10 (నిమ్మకాయ, నీళ్లు, ఉప్పు, చక్కెరను కలిపి ఐస్ ట్రేలో పెట్టి, డీఫ్రిజ్‌లో ఉంచాలి. కొంత సమయం తర్వాత తయారయ్యేవే నింబూ పానీ ఐస్‌క్యూబ్స్)
తయారుచేసే విధానం :
ముందుగా నేరేడు పండ్లలోని విత్తనాలను తొలగించాలి. తర్వాత నేరేడు పండ్లను ముక్కలుగా తరుక్కోవాలి.
డీ ఫ్రిజ్‌లో ఉన్న నింబూ పానీ ఐస్‌క్యూబ్స్‌ను బౌల్‌లోకి తీసుకోవాలి.
నేరేడు ముక్కలను మిక్సీలో వేసుకోవాలి.
అందులోనే నింబూ పానీ ఐస్‌క్యూబ్స్‌ను వేసి, చేతితో అటూఇటూ బాగా తిప్పి, మిక్సీ పట్టాలి.
మరలా ఒకసారి మిక్సీజార్‌లో చేతితో అటూఇటూ తిప్పి, మరోసారి మిక్సీ పట్టాలి.
దానిని ఒక గాజు గ్లాసులోకి తీసుకుని, పైన పుదీనాతో గార్నిష్ చేయాలి.
దీనిలో కొంచెం ఐస్ వేసుకుని డ్రింక్‌లాగా తాగవచ్చు. లేదా స్పూన్‌తో తినవచ్చు.