Oct 01,2022 15:39

ఒకరు రక్తదానం చేయడం వల్ల.. ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు. అలాంటి రక్తదానానికి ఓ రోజు ఉంది. అక్టోబర్‌ 1న జాతీయ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాల్ని నిలిపేందుకు.. బ్లడ్‌ బ్యాంకులలో తగినంత రక్త నిల్వలు ఉంచుకునే ప్రయత్నం చేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. అలాగే రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కలిగించడం కూడా ఈ దినోత్సవ ఉద్దేశం. మరి ఏ వయసువారు రక్తదానం చేయవచ్చు? రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

ఎవరు అర్హులు?
18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్నవారు రక్తదానం చేయవచ్చు.
- 45 కిలోల కంటే ఎక్కువ బరువున్న వ్యక్తులు మాత్రమే రక్తం ఇవ్వాలి. బరువు తక్కువ ఉంటే రక్తం ఇవ్వకూడదు.
- 60 నుంచి 100 మధ్య రక్తపోటు, సాధారణ రక్తపోటు శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్‌కు మించని వ్యక్తుల నుండి రక్తం తీయవచ్చు.
- తీవ్రమైన అనారోగ్యాలు లేని వ్యక్తులు రక్తదానం చేయవచ్చు.

రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రక్తంలోని ఐరన్‌స్థాయిలో అదుపులో లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశముందని వైద్యులు సూచిస్తుంటారు. రక్తదానం వల్ల రక్తంలోని ఐరన్‌స్థాయిలో అదుపులో ఉంటాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

2. కాలేయం దెబ్బతినదు
మీ శరీరంలో ఐరన్‌ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలేయ వైఫల్యం చెందడానికి దారితీస్తుంది. అలాగే ప్యాంక్రియాస్‌కు హాని కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల రక్తదానం చేయడం వలన ఐరన్‌స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో ఐరన్‌ సమానస్థాయిలో ఉండడం వల్ల కాలేయం, ప్యాంక్రియాస్‌ దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. రక్తదానం వల్ల.. కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

blood 3



3. కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది
రక్తదానం చేయడం వల్ల.. కొత్త రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. కొత్త రక్తం పుడుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రక్త కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల సంవత్సరంలో ఒక్కసారైనా.. రక్తాన్ని ఇవ్వడం మంచిది.

4. కేలరీలను తగ్గిస్తుంది
అర లీటరు రక్తదానం చేయడం ద్వారా దాదాపు 650 కేలరీలు తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధనలు చెబుతున్నాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు రక్తదానం చేయడం వల్ల త్వరగా బరువును కోల్పోయి సాధారణస్థితికి వస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గించుకోవాలని తరచూ రక్తదానం చేయడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

5. క్యాన్సర్‌ ముప్పు తక్కువ
రక్తదానం చేయడం వల్ల.. పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తులు క్యాన్సర్‌తో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

blood 2


రక్తదానం చేసే ముందు...
రక్తదానం చేసే కొన్ని వారాల ముందు సీఫుడ్‌, మాంసం, బచ్చలికూర, బీన్స్‌, చిలగడదుంపలు వంటివి తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గకుండా ఉంటుంది. అలాగే రక్తదానం చేసే ముందు మీ అనారోగ్య సమస్యల్ని కూడా వైద్యులకు వివరించాలి. మీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వైద్యుల సూచన మేరకు మీ రక్తాన్ని తీసుకుంటారు.

రక్తదానం తర్వాత ఏమి చేయాలి?
మీరు రక్తదానం చేసిన తర్వాత మీ చేతిని పైకి చాచి ఉంచండి. డాక్టర్ల సూచనమేరకే మీరు తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.
- రక్తదానం చేసిన తర్వాత 24 గంటల్లో ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా ఉంటే మంచిది.
- రెండు, మూడు వారాల తర్వాత శరీరంలోని రక్తస్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. అప్పుడు మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.

త్వరగా కోలుకోవడానికి కొన్ని చిట్కాలు
- నీళ్లు ఎక్కువగా తాగాలి.
- కొవ్వు పదార్ధాలను తినొద్దు.
- సౌకర్యవంతమైన బట్టలు ధరించండి.
- ధూమపానం, మద్యం సేవించడం మానుకోండి.
- మీకు మైకము, అసౌకర్యం లేదా నొప్పి అనిపిస్తే, వెంటనే వైద్యుల్ని సంప్రదించండి.
- తల తిరగడం, నొప్పి, తిమ్మిరి లాంటివి ఉంటే వెంటనే రక్తదాన కేంద్రానికి కాల్‌ చేయాలి లేదా ఆసుపత్రికి వెళ్లాలి.