
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఇటీవల జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021లో 1,55,622 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. 2014 తర్వాత ఇదే అత్యధికమని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక విడుదలైన కొద్ది రోజులకే పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆయన సహ ప్రయాణికుడు ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర లోని పాల్ఘార్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద సమయంలో ఆ ఇరువురు సీటు బెల్టులు ధరించలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. విషాదకరమైన, నివారించగలిగినటువంటి ఈ ప్రమాదం, కారు భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని, వాటిని అమలు చేసేలా, అవగాహన పెంచేలా రోడ్డు భద్రతా అధికారులు చూడాల్సిన అవసరాన్ని మరింత పెంచింది. సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగ్ పరికరాలు వంటి తక్కువ ఖర్చుతో ప్రమాదాలను నిరోధించే వ్యవస్థలను ఉపయోగించడం వల్ల కారు ప్రమాదాలు, అందులోని ప్రయాణికుల మరణాలను సమర్ధవంతంగా తగ్గించడానికి దోహదపడుతుందనేది ఈనాడు బాగా అర్ధమైంది. ఐఐటి ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్ 2021 నవంబరులో రూపొందించిన రహదారుల భద్రతా నివేదిక ప్రకారం, ''ఎయిర్ బ్యాగ్‌లను ఉపయోగించడం వల్ల మరణాల రేటు 63 శాతం తగ్గింది. తొడ దగ్గర నుండి భుజం వరకు వేసుకునే సీటు బెల్టు ఉపయోగించడం వల్ల మరణాల రేటు 72 శాతం తగ్గింది.'' అని అధ్యయనాల్లో వెల్లడైంది. ''ఎయిర్ బ్యాగ్‌లను, సీటు బెల్టులను రెండింటినీ ఉపయోగించడం వల్ల 80 శాతానికి పైగా మరణాలు తగ్గాయి.'' అయితే, సీటు బెల్టు ధరించకపోవడం వల్ల సంభవించే మరణాలు పెరుగుతున్నప్పటికీ (2017లో సీటు బెల్టులు ధరించకపోవడం వల్ల 26,896 మంది మరణించినట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.) కాలక్రమేణా సీటు బెల్టు ఉపయోగం గురించిన అవగాహన, దానిని అమలు చేయడం సాపేక్షంగా పెరిగిందనే చెప్పవచ్చు. అయితే, వెనక సీటులో కూర్చున్నవారు బెల్టు ధరించడమనేది దాదాపు అమల్లో లేనట్లే కనిపిస్తోంది. వెనక సీటులో కూర్చుని సీటు బెల్టు ధరించిన వారితో పోలిస్తే ధరించని వారు ఏదైనా ప్రమాదం జరిగినపుడు 8 రెట్లు ఎక్కువగా తీవ్రమైన గాయాల పాలవుతారని అమెరికాలో హైవేల భద్రతకు చెందిన ఇన్సూరెన్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందంటే, ఇది సిగ్గుచేటైన విషయంగా భావించాలి. ఇక హెడ్ రెస్ట్ వంటి వాటిని సక్రమంగా ఉపయోగించడమనే ఇతర అంశాలు కూడా హఠాత్తుగా ప్రమాదాలు జరిగినపుడు సంభవించే తీవ్ర గాయాలను తగ్గించడంలో సాయపడతాయి.
భారతదేశంలోని మొత్తం రహదారుల పొడవులో జాతీయ రహదారుల పొడవు కేవలం 2 శాతం మాత్రమే. అయినప్పటికీ ఆ రహదారులపై సంభవించే మరణాలు మాత్రం 36 శాతంగా వున్నాయి - అన్నది ఐఐటి ఢిల్లీ నివేదిక గుర్తించిన మరో ఆందోళనకర అంశం. సైరస్ మిస్త్రీ మరణించిన ఈ ప్రమాదానికి గల కారణం అధిక వేగంతో డ్రైవింగ్ చేయడంగా వుంది. 2021లో భారతదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 56 శాతం అధిక వేగంతో జరిగినవేనని ఎన్‌సిఆర్‌బి నివేదిక నిర్ధారించింది. అదే సమయంలో, అనేక రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ తప్పును నిర్ధారించేందుకు చాలా సులభతరమైన పద్ధతులను ఉపయోగించడం కూడా వాస్తవమేనని నివేదిక పేర్కొంది. ఎన్‌సిఆర్‌బి గణాంకాలు స్థూలంగా, చాలా తక్కువగా అంచనా వేయబడ్డాయని రహదారుల భద్రతా నివేదిక పేర్కొంది. మరణాలను తగ్గించడానికి గల ఏకైక మార్గం... సాక్ష్యాధారాల ప్రాతిపదికన, భారతదేశానికే నిర్దిష్టమైన, సమర్ధవంతమైన రహదారుల భద్రతా విధానాలను రూపొందించడమొక్కటే...అని ఆ నివేదిక పేర్కొంది. రహదారుల డిజైన్ పేలవంగా వుండడం, రోడ్ల నిర్వహణా తీరు సరిగా లేకపోవడం, రవాణా వ్యవస్థ లోపభూయిష్టంగా వుండడం వంటి పలు సంక్లిష్టమైన కారణాలు కూడా ఇటువంటి ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి వుంది. చివరగా ఒక సూచన ఏమంటే-ఇంటర్‌సిటీ హైవేల మీదున్న మీడియన్లను తొలగించడం, ఉక్కు రెయిలింగ్‌ను లేదా వైర్ రోప్ బారియర్లను ఏర్పాటు చేయడం పరిశీలించదగిన అంశాలుగా వున్నాయి.
/ 'హిందూ' సంపాదకీయం /