Dec 05,2022 10:54

2014 ఎన్నికలకు ముందు బిజెపి, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలకు, ఆ తరువాత పాలన సాగుతున్న తీరుకు పొంతన లేని పరిస్థితి నెలకొంది. మోసపుమాటలతో, ఎన్నికల టక్కుటమారాలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ తరువాత విద్వేషాన్ని వెదజల్లడం, మెజార్టీ ప్రజల మెదళ్లలో విషాన్ని నింపడమే అజెండాగా మార్చుకుంది. ప్రజలను చీల్చి అధికారంలో కొనసాగే గుజరాత్‌ వ్యూహాన్నే దేశమంతా అమలు చేస్తోంది. అందుకే నరేంద్ర మోడీ పాలన అనగానే గుర్తొచ్చే నోట్లరద్దు, కరోనా లాక్‌డౌన్‌, వ్యవసాయ చట్టాలు (ఇవి కూడా ప్రజావ్యతిరేక చర్యలే)ను మినహాయిస్తే మిగిలినవన్నీ విద్వేషపు ఆనవాళ్లే! 2014లో అధికారంలోకి రాగానే ఒక పథకం ప్రకారం దేశ వ్యాప్తంగా మేథావులు, రచయితలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై దాడులు ప్రారంభమయ్యాయి. అర్బన్‌ నక్సలైట్లని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీనే ముద్ర వేయడంతో నిర్బంధం పరాకాష్టకు చేరుకుంది. మహారాష్ట్రలో గోవింద పన్సారే. కర్నాటకలో ఎంఎం కుల్బర్గీ, గౌరీ లంకేష్‌, ఉత్తర ప్రదేశ్‌లో జోగేంద్ర సింగ్‌ ఇలా ఎందరో సంఫ్‌ు పరివార్‌ గూండాల దాడిలో ప్రాణాలు విడిచారు. ఈ దాడులను అదుపుచేసి హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించింది. ఇక 2018 జనవరి ఒకటిన జరిగిన బీమా కోర్గావ్‌ కేసులో దేశ వ్యాప్తంగా పలువురు మేథావులను, రచయితలను ప్రభుత్వమే అరెస్ట్‌ చేసి, జైళ్లలో నిర్బంధించింది. వీరిలో అత్యధికులు మైనార్టీలకు, దళితులకు అండగా నిల్చిన వారే కావడం గమనార్హం.
 

                                                                 గో గూండాల హింసా రాజ్యం ...

బిజెపి అధికారంలోకి రాగానే గో రక్షణ పేరుతో సంఫ్‌ు పరివార్‌ గూండాలు చెలరేగిపోయారు. దేశవ్యాప్తంగా మైనార్టీలను, దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఇళ్లలోకి చొరబడి ఏం వండుతున్నారో కూడా తనిఖీలు చేసిన సంఘటనలు ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం 2015 నుండి 2021 వరకు దేశ వ్యాప్తంగా 53 మంది గో గూండాల దాడిలో మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. రాయటర్స్‌ నివేదిక ప్రకారం 2015 నుండి 2017 జూన్‌ వరకు దేశ వ్యాప్తంగా 22 దాడులు, సంఘటనలు చోటుచేసుకోగా 28 మంది మరణించారు. అదే సంవత్సరం మరో ఇద్దరు మరణించగా,2018లో ఏడుగురు, 2019లో ఆరుగురు, 2021లో నలుగురు మృతి చెందినట్లు సమాచారం.
 

                                                                    నిలువెల్లా విద్వేషమే...

ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా విద్వేష వ్యాఖ్యలు చేయడం సంఘపరివార్‌ వ్యూహంలో ఒక భాగం. రాజకీయ నాయకుల నుండి సన్యాసులు, మఠాధిపతులు, ప్రవచనకర్తలు ఈ వ్యూహంలో భాగస్వాములు అవుతున్నారు. మతం, కులం, లింగం ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ప్రజల్లో మత భావనను సజీవంగా ఉంచడం వీరి వ్యూహం. విద్వేష వ్యాఖ్యలకు సంబంధించిన కేసులు కూడా ప్రతి ఏడూ పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైం బ్యూరో లెక్కల ప్రకారం 2015లో 378 విద్వేష వ్యాఖ్యలు కేసులు నమోదుకాగా, 2016లో 447, 2017లో 934, 2018లో 1,076, 2019లో 1,055, 2020లో 1,804 కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. 2021లో దాదాపుగా 2వేలు కేసులు నమోదైనట్టు సమాచారం.
 

                                                                ప్రజలను చీల్చడమే వారి లక్ష్యం...

ఇచ్చిన హామీలను అమలు చేయడం, అభివృద్ధి పనులు చేయడం వంటివి అధికారంలో కొనసాగడానికి సాధారణంగా రాజకీయ పార్టీలు చేస్తాయి. కానీ, బిజెపి రూటే వేరు. అధికారంలో కొనసాగడానికి ప్రజలను చీల్చే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా, దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్నా పట్టించుకోని విధంగా ప్రజల మెదళ్లలో విషాన్ని నింపుతోంది. ఇప్పటికే సిఎఎ, ఎన్‌ఆర్‌సి, హిజాబ్‌ వంటి అంశాలతో ప్రజలను చీల్చిన ఆ పార్టీ 2024 ఎన్నికలకు సైతం అదే వ్యూహంతో సిద్ధమౌతోంది. దీనిలో భాగంగానే అయోధ్యలో రామాలయాన్ని 2023లో పూర్తి చేస్తామని ప్రకటించింది. కాశీలో జ్ఞానవాపి మసీదు అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. అవసరమైతే మరో ఒకటి, రెండు దేవాలయాలను వివాదంలోకి లాగుతుంది. అప్రమత్తంగా ఉండాల్సింది.. ఆలోచించాల్సింది ప్రజలే !

44

- వి రాజగోపాల్‌