గడ్డాలు, టోపీలు ఉన్నవారిని కనిపిస్తే కొడతాం : జార్ఖండ్ బిజెపి ఎమ్మెల్యే విద్వేషపూరిత వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : గడ్డం, టోపీ పెట్టుకున్నవారు, గొడ్డు మాంసం తిన్నవారు హిందూ మత స్థలాల దగ్గర కనిపిస్తే దాడులు చేస్తామని జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గం వారిని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుష్వాహా శశి భూషణ్ మెహతా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇది వివాదంగా మారింది.
వార్తా కథనాల ప్రకారం.. విజయ దశమి నాడు జరిగిన కార్యక్రమంలో పలమావు జిల్లాలోని పంకి నియోజకవర్గ ఎమ్మెల్యే మెహతా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ముస్లింల పేర్లను స్పష్టంగా చెప్పనప్పటికీ ''ఈ వ్యక్తులు'' మొదట హిందూ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారనీ, ఆపై వాటికి అంతరాయం కలిగిస్తారని అన్నారు. అయితే, ఆయన చేసిన ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో మెహతాపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవటం గమనార్హం. ''మేము వీడియోను పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయనందున ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు'' అని పలామావు పోలీసు సూపరింటెండెంట్ రీష్మా రమేసన్ అన్నారు. వీడియోను పరిశీలించిన తర్వాతే మేము చర్య తీసుకుంటామని తెలిపారు. కాగా, జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు రెండూ మెహతా ప్రకటనలను ఖండించాయి.