
ప్రజల మధ్య ఐక్యత చాటి చెప్పాల్సిన పండగలు మత ఉద్రిక్తతలకు వేదికలు కావడం కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చాకే చూస్తున్నాం. శ్రీరామనవమి ఉత్సవాలు కుల, మతాలకతీతంగా ఊరూ వాడా జరుపుకోవడం ఆనవాయితీ. దేశంలో తామే రామభక్తులమని స్వీయ పేటెంట్ బోర్డులు తగిలించున్న ఆర్‌ఎస్‌ఎస్, అనుబంధ ముఠాలు చివరికి నవమిని సైతం వదలకున్నాయి. గత కొన్నేళ్లకుమల్లేనే ఈ తడవా పరివార్ గ్రూపులు పలు రాష్ట్రాల్లో రెచ్చిపోయాయి. శ్రీరామనవమి ఊరేగింపుల్లో చేరిపోయి విచక్షణారహిత దాడులకు, విధ్వంసాలకు, గృహ, దుకాణాల, వాహనాల దహనాలకు పాల్పడ్డాయి. పోలీస్ వాహనాలపైనా, పోలీసులపైనా గెరిల్లా తరహా దాడులకు తెగబడ్డాయి. ఈ మారు రంజాన్ మాసం, నవమి ఒకే సమయంలో రావడంతో సంఘ పరివారం పథకాలు రచించి మరీ మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని స్వైర విహారం చేసినట్లు సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. ముస్లింల ప్రార్ధనా స్థలాల వద్ద ర్యాలీలు నిర్వహించి వారిని కించపరిచేలా వ్యవహరించాయి మూకలు. డిజె సౌండ్స్‌తో హల్‌చల్ చేసి రెచ్చగొట్టాయి. ఇటువంటి ఉన్మాద చర్యలకు కేంద్ర బిజెపి సర్కారు, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు దన్నుగా నిలవడం దారుణం.
బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నవమి ప్రదర్శనలు హింసాత్మకమయ్యాయి. బీహార్ నలంద, రోV్‌ాతగ్ జిల్లాల్లో ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్, ఇతర సంస్థల శ్రేణుల అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఘర్షణల్లో ఒకరు చనిపోయినట్లు నితీష్ ప్రభుత్వం ప్రకటించింది. ఎంతో మంది గాయాలపాలయ్యారు. పలు చోట్ల 144 సెక్షన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. బెంగాల్‌లో హౌరా జిల్లా సంఫ్‌ు పరివారం రాళ్లదాడులు, దహనాలతో రణరంగంగా మారింది. త్రిశూలాలు, కత్తులు చేతబూని ముస్లిం మసీదులు, కాలనీలు, ఇళ్లు, దుకాణాల ఎదుట వీరంగం వేశారు. పోలీసులను సైతం దాడులతో నిలువరించారు. నవమి, మరుసటి రోజు హింసాకాండ కొనసాగింది. ఆదివారంనాడు పక్కనున్న హుగ్లికి అల్లర్లు పాకాయి. దాడులకు తెగబడింది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లేనని మమత ప్రభుత్వం పేర్కొంది. బిజెపి దన్నుతో పరివారం రెచ్చిపోయి మత విధ్వంసాలకు పాల్పడి ప్రజల్లో అశాంతి, అభద్రత కల్గిస్తున్నాయి. మతోన్మాద ముఠాల ధ్వంస రచనను నిఘా వ్యవస్థలతో పసిగట్టి ప్రజలకు, మైనార్టీలకు భద్రత కల్పించే విషయంలో, అరాచక శక్తులను కఠినంగా శిక్షించడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైనట్లు బెంగాల్ సర్కారు భావించాలి.
ఢిల్లీలో నిరుడు ఏప్రిల్‌లో జహంగిర్‌పురిలో జరిగిన మత ఘర్షణలు దేశాన్నే కుదిపేశాయి. అలాంటి సున్నిత ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకపోయినా పరివార్ గ్రూపులు శ్రీరామనవమి ర్యాలీ నిర్వహించారు. ఉన్మాద ప్రసంగాలు చేశారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో నవమి ఉత్సవాల సందర్భంగా రెండు ప్రదేశాల్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఉత్తరప్రదేశ్ మధురలో జామా మసీదు పైకప్పు నుంచి కాషాయ జెండాలను ఊపిన వీడియో వైరల్ కావడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఢిల్లీలో శాంతి, భద్రతలు కేంద్ర బిజెపి చేతుల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అదికారంలో ఉంది. సదరు రాష్ట్రాల్లో 'నవమి' హింసకు బిజెపి మద్దతు, ప్రోత్సాహం ఉండి తీరుతుంది. హైదరాబాద్‌లో సావర్కర్ ఫోటోతో శోభాయాత్ర చేశారు. శ్రీరామనవమికి సీతారామలక్ష్మణులు లేదా హనుమంతుడి బొమ్మలు పెడతారు తప్ప సావర్కర్ ఫోటోను పెట్టరు. అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ బ్రిటిష్ వారిని క్షమాపణ కోరుకొని బయట పడిన వ్యక్తిని హీరోగా చెయ్యాలన్న దుర్బుద్ధి ఇందులో దాగుంది. ప్రజల మధ్య మత విద్వేషాల నిప్పు రాజేసి చలి కాచుకునేందుకు సంఫ్‌ు పరివారం, బిజెపి కాచుక్కూర్చుకున్నాయి. ఇవి ఏ చిన్న సందర్భాన్నీ వదిలిపెట్టవు. అది వాటి సహజసిద్ధ నైజం. ప్రజల మధ్య శాంతి సామరస్యాలను దెబ్బ తీస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలను ప్రజలందరూ ఏకోన్ముఖంగా తిప్పికొడితేనే దేశానికి మనుగడ.