
ఇటీవలి కాలంలో, ఓ ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీకి చెందిన ఐ.టి సెల్, సుప్రీం కోర్టుకు చెందిన న్యాయమూర్తిపై క్రూరమైన దాడి చేసింది. ఈ దాడి...బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై...న్యాయపరమైన ఘాటైన విమర్శలను, అధిక సంఖ్యాకులు వ్యతిరేకించారనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. కానీ అన్ని మత సమాజాలలోని అధిక సంఖ్యాకులు...ఆ స్థాయిగల వ్యక్తి ద్వేషపూరితమైన దౌర్జన్య బృందాలకు వ్యతిరేకంగా, వాస్తవాలకు అనుగుణంగా...నిలబడడాన్ని గర్వకారణంగా భావిస్తున్నారు.
ముఖ్యంగా, ప్రభుత్వం అన్ని స్థాయిల్లో, న్యాయ వ్యవస్థలో జోక్యం (స్వతంత్ర ఆలోచనలు గల న్యాయమూర్తులను బదిలీలు చేయడం, వేరే వారితో భర్తీ చేయడం లాంటి) చేసుకుంటున్న ఈ సమయంలో... ఈ న్యాయాధిపతుల పూర్తి సమర్థనీయమైన, ఘాటైన వ్యాఖ్యలు దేశంలో, న్యాయ వ్యవస్థలో నూతన గాలులు వీస్తున్నాయని తెలియజేసాయి. వారి ఈ వ్యాఖ్యలు కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క మితిమీరిన జోక్యాన్ని నిలువరించడానికి, న్యాయమూర్తులలో విశ్వాసాన్ని ఇనుమడింప జేయడానికి ఉపకరించాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
స్వాతీ అగర్వాల్, తన 'ఐయామ్ ట్రోల్' అనే పుస్తకంలో, ఇంటర్నెట్ ట్రోల్స్‌ను, అంటే...ఇంటర్నెట్ ద్వారా కొందరు వ్యక్తులు ఉద్వేగపూరితమైన సమాచారంతో ప్రేరేపించే విధానాన్ని, ఇలాంటి నెట్ అభివృద్ధిని 2000 సంవత్సర ప్రారంభంలోనే గుర్తించారు. ప్రభుత్వంలోని రాజకీయ నాయకుల అండతో, అది నేడు మరింత అభివృద్ధి అయింది. మితవాద ప్రచార వెబ్‌సైట్లు నిరంతరం విద్వేష ట్వీట్లు చేస్తూ, పాత్రికేయులపై అభాండాలు వేస్తూ, వార్తలను చక్కర్లు కొట్టిస్తూ ఉంటాయి. సమన్వయంతో కూడిన యాష్ ట్యాగ్ ప్రచారాల ద్వారా, పేరు లేని ట్విట్టర్ ద్వారా తిరిగి దానినే ట్వీట్ చేస్తూ, నిరంతరాయంగా ప్రచారం ప్రారంభమవుతుంది. హింసాత్మకమైన గోవధను, ఊహాజనితమైన 'జిహాద్' లాంటి సందర్భాలను ఆమె ఉదహరించారు. మరికొందరైతే, లైంగిక దాడికి, వేధింపులకు గురైన మహిళలను అవహేళన చేస్తారు. ఒక సహాయక వెబ్‌సైట్ ('అయామ్ ట్రోల్డ్-హెల్ప్')ను ప్రారంభించిన తమ సొంత పార్టీ నాయకురాలు మేనకా గాంధీని కూడా వారు విడిచిపెట్టలేదు.
ఈగ్రూపు ద్వారా ట్విట్టర్ నిర్వహించే వారు, ప్రముఖ మహిళా పాత్రికేయులను నిందించడంలో నిరంతరం నిమగమవుతున్నారు. కొందరు, ఒక నటి ఆమ్ ఆద్మీ పార్టీలో భాగస్వామి అయ్యారని, ఆమె ఫోటోషాప్డ్ చిత్రాన్ని విడుదల చేశారు. వీరి నెట్‌వర్క్ లోని కొందరు, విచారణలో ఉన్న వ్యక్తులను, అనుమానితులను, తగిన విచారణ లేకుండానే, నిర్బంధించడంలో, ప్రభుత్వం వెనుకాడకూడదని, అవసరమయితే, వారిని అమానుషంగా చంపివేయాలని సూచిస్తుంటారు. మరొక తీవ్రమైన విషయమేమంటే, కాంగ్రెసు అధికార ప్రతినిధిపై నిర్భయ లాంటి అత్యాచారం చేస్తామని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
తమ నెట్‌వర్క్ ద్వారా, మహ్మద్ జుబేర్‌పై (వాస్తవాలను వెలికితీసే వెబ్‌సైట్ సహ సంపాదకులు) దాడి చేయడంకోసం 757 ట్విట్టర్ అకౌంట్లను, వెబ్‌సైట్లను ఉపయోగించారు. ఈ నెట్‌వర్క్‌ను అజ్ఞాతంగా నిర్వహించే వారి రికవరీ ఇమెయిల్ ఐడి, అధికారంలో ఉన్న యువజన నాయకునిదే. ఈ అకౌంట్లు, సబ్ అకౌంట్లు బహుళ లక్షణాలను ప్రదర్శించాయి. రోబోట్ లాంటి అసమంజసమైన ప్రవర్తనతో, గంట గంటకు, రోజంతా 5 వందలకు పైగా పోస్టులు పెట్టారు. మహ్మద్ జుబేర్‌ను అరెస్టు చేసిన విషయంలో ప్రజలను పక్కదారి పట్టించే ఉద్దేశంతో ఈ పోస్టింగ్‌లను సృష్టించారు.
ఇలాంటి లక్ష్యాలతో టెక్‌ఫాగ్ (ఆన్‌లైన్ ఆపరేషన్ ద్వారా అధునాతనమైన యాప్‌లను వినియోగించి, ప్రధాన సామాజిక మాధ్యమాలను తమ గుప్పిట్లో పెట్టుకొని, రహస్య సమాచార వేదికలను తమ ఆధీనంలో ఉంచుకునే పద్ధతి) ద్వారా ఎనిమిది లక్షలకు పైగా అసంబద్ధమైన, శత్రుపూరితమైన సమాధానాలను, ట్వీట్లను పంపారు. వాటిలో 5 లక్షల వరకు ప్రమాదకరమైనవిగా గుర్తించారు. టెక్‌ఫాగ్‌ను నిర్వహించేవారు రాజకీయంగా పొత్తు పెట్టుకున్నవారు. అందువల్ల భారతదేశంలోని ఉన్నత రాజకీయ వర్గం నిశ్శబ్దంగా ఉన్నదని ''ద వైర్'' వ్యాఖ్యానించింది. వీరి ద్వారా విస్తరించిన ఒకానొక హ్యాష్‌ట్యాగ్ ఎనిమిది కోట్ల మంది వినియోగదారులకు సమాచారాన్ని అందించగలిగింది. పూర్తి నిరాధారమైన, సమర్థవంతమైన ప్రచార యంత్రాంగం ద్వారా, నకిలీ వీడియోలను సృష్టిస్తారు. అదేవిధంగా సామాజిక లింకు ద్వారా తుఫానులను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారని న్యూస్ లాండ్రీ (భారతీయ వార్తా వెబ్‌సైట్) తెలియజేసింది.
ఆన్‌లైన్ ద్వారా చేసే దూషణలు తరచుగా, హింసకు దారి తీస్తున్నాయి. ప్రముఖ న్యాయవాది విషయంలో, కొందరు వ్యక్తులు కార్యాలయం లోనికి చొచ్చుకుపోయి, హింసకు పాల్పడ్డారు. శ్రీమతి చతుర్వేది అభిప్రాయంలో ఇది ఆశ్చర్యకరమైనదేమీ కాదు. ఎందువల్లనంటే అధికారంలో ఉన్న పార్టీ ఆఫీస్ బేరర్లు, ఇలాంటి ట్వీట్లకు బహిరంగంగా మద్దతునిచ్చారు. వీరి ఐటీ సెల్ అనేకమంది వాలంటీర్లను, చెల్లింపు కార్మికులను అధిక సంఖ్యలో ప్రవేశపెడుతూ, తన కార్యాచరణను విస్తరించింది. అధికారంలో ఉన్న పార్టీ ఏకకాలంలో ట్వీట్లు చేయటానికి, అలజడులు సృష్టించటానికి ఎవరికీ తెలియని వేల అకౌంట్లను సృష్టించిందని శ్రీమతి చతుర్వేది తెలియజేశారు. ఆ పార్టీకే చెందిన ఐటీ సెల్‌చే నిర్మించబడిన, క్లిష్టమైన పనులను నిర్వహించగలిగే యంత్రాంగం ద్వారా, ఒకే విధమైన సమాచారాలను, ఏకకాలంలో ప్రచారం చేయగలుగుతాయి. కాబట్టి అవి వాస్తవమైన వినియోగదారుల లాగానే కనిపిస్తాయి. ప్రధాన స్రవంతిలోని, కేంద్రీకరించిన ఏ పాత్రికేయులపై నిరంతరం వారు దాడి చేయవలసిన అవసరం ఉన్నదో, వారి జాబితాలను ఈ వాలంటీర్లకు, ఉద్యోగులకు సమకూర్చుతారు. భారతదేశం లోనే అత్యంత ప్రముఖమైన, గౌరవ నీయురాలైన ఒకానొక మహిళా పాత్రికేయురాలిపై, అసభ్యకరమైన, రోత పుట్టించే భాషతో, అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ వాలంటీర్లు, ఉద్యోగులు వాస్తవికమైన వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ద్వారా, వినియోగదారుని వాస్తవ చిరునామాలు తెలియకుండా, ప్రైవేటు నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తారు.
మనం తిరిగి సుప్రీంకోర్టులో నూపుర్‌శర్మ ఘటనను పరిశీలించినట్టయితే, ఇది చాలా ప్రాధాన్యత కలిగిన, సత్వరమే చర్య తీసుకోవలసిన అంశంగానూ, దేశం మొత్తం న్యాయ వ్యవస్థ వెనుక నిలబడిందనీ సుప్రీంకోర్టుకు అర్థమైంది. ద్వేషపూరిత ప్రచారాలు, ఒక రాజకీయ పార్టీ ఫాక్టరీలో సృష్టించబడుతున్నాయని, అది మిలియన్ల కొద్దీ ద్వేషపూరిత ప్రసంగాలను సృష్టిస్తుందని, ఒక స్వతంత్రమైన, ప్రత్యేకమైన పోలీసు బృందంచే విచారణ నిర్వహించాలని ఆదేశించింది. న్యాయపరమైన చర్యలు తప్పకుండా కొనసాగాలి. ఉద్దేశపూర్వకంగా, విద్వేష ఉత్పత్తి కేంద్రాలను సృష్టించే యంత్రాంగాన్ని కఠినంగా అణిచివేయాలి. ఇది మన ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైనదిదేకాక, ప్రాణాధారమైనది. అదేవిధంగా, న్యాయ వ్యవస్థ బెదిరింపులకు గురికాకుండా కూడా ఉపకరిస్తుంది.
/ వ్యాసకర్త భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది /
('ద హిందూ' సౌజన్యంతో)
కోలిన్ గోన్‌సాల్వ్స్