May 03,2023 07:38

      మత విద్వేష రాజకీయమే ఎజెండాగా కర్ణాటకలో బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఉచితాలను రేవడి కల్చర్‌గా, రాష్ట్ర ప్రభుత్వాలకు గుదిబండగా ప్రధాని అభివర్ణించి రెండు రోజులు తిరక్కుండానే...ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, రోజూ అరలీటరు పాలు ఉచితం అంటూ మేనిఫెస్టోలో ఊదరగొట్టడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.
        దక్షిణాదిన బిజెపి పాలనకు ముఖద్వారంగా భావించే కర్ణాటకలో అడ్డగోలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, రాజీనామా చేయించి, అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ మతతత్వ విషం చిమ్మేందుకు, కార్పొరేట్లకు సాగిలపడేందుకు సకల ప్రయత్నాలు చేసింది. ముస్లిములలో వెనుకబడిన పేదలకిచ్చే నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు లింగాయతులు, ఒక్కలిగల్లో పేదలకు 2 శాతం చొప్పున కేటాయిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మే 9 వరకూ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థినులు పాఠశాలల్లోకి రాకుండా అడ్డుకోవడం, లవ్‌ జీహాద్‌ పేరిట విషం చిమ్మటం, ఆలయాల వద్ద ముస్లిములు వ్యాపారం చేయకూడదని, హలాల్‌ చేసిన మాంసం కొనుగోలు చేయొద్దని, టిప్పు సుల్తాన్‌ వ్యతిరేకత... ఇలా ఎన్నో మత విద్వేష చర్యలకు పూనుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌లకు దోచిపెట్టే విధానాలతో.. విపరీతమైన భారాలు మోస్తున్న కష్టజీవుల కడుపు మంటలే ప్రధాన ఎజెండాగా ముందుకొచ్చాయని... ఇటీవల జరిగిన ప్రీ పోల్‌ సర్వేలు చెబుతున్నాయి. బిజెపికి ఓటమి తప్పదని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ మరింతగా విద్వేష విషాన్ని దట్టించేందుకు ఎన్‌ఆర్‌సి, ఉమ్మడి పౌర స్మృతిని పార్టీ ఎన్నికల ఎజెండాగా ముందుకు తెచ్చింది. ఎన్‌ఆర్‌సిని కర్ణాటకలో అమలు చేస్తామని, అనధికారికంగా ఉంటున్న వారినందరినీ తరిమేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించారు. కర్ణాటక స్టేట్‌ వింగ్‌ ఎగైనస్ట్‌ రెలిజియస్‌ ఫండమెంటలిజం అండ్‌ టెర్రర్‌ (కె-స్విఫ్ట్‌) పేరుతో మైనారిటీలపై విరుచుకుపడేందుకు కొత్తగా మరో గూండాల దళాన్ని ఏర్పాటు చేస్తామని నిస్సిగ్గుగా ఎజెండాలో పెట్టేశారు! రోజుకు అరలీటరు పాలు, ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని హామీలు గుప్పించారు. రేవడి కల్చర్‌ అంటూ తిట్టిపోసే ఆ పార్టీ నేతలు ఈ హామీలను ఎలా సమర్థించుకుంటారు? హామీలను జుమ్లాలుగా అభివర్ణించిన ఆ పార్టీ నేతలు ఈ హామీలైనా అమలు చేస్తారా? అన్న ప్రతిపక్ష పార్టీల ప్రశ్నలకు ఏమని సమాధానం చెబుతారు? డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వముంటే అభివృద్ధి జరుగుతుందంటూ చేసే ప్రచారం బసవరాజు బొమ్మరు పాలనలో ఒట్టిదేనని తేలిపోయింది. మరోవైపు చాప కింద నీరులా కార్పొరేట్లిచ్చిన కాసులను బూత్‌ స్థాయి వరకూ పంపిణీ చేసి, ఎలాగైనా గట్టెక్కాలని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
           800 ఏళ్ల క్రితమే దళితులు, మహిళలను సైతం భాగస్వాములను చేసి అనుభవ మండపం పేరుతో అనధికార పార్లమెంటును నడిపిన, కులాంతర వివాహం చేసిన, 'దేహమే దేవాలయం..' అంటూ శ్రమ విలువను చాటిచెప్పిన బసవన్న అడుగుజాడలు కన్నడ నాట ఇప్పటికీ ఉన్నాయి. బసవన్న సంస్కరణ వాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రఖ్యాత రచయిత కల్బుర్గిని 2017లో మతోన్మాదులు పొట్టనబెట్టుకున్నా... ఆయన రచించిన 'మార్గ' ఇప్పటికీ బసవన్న అభ్యుదయ మార్గాన్ని చూపుతూనే ఉంది. ఇతర పార్టీల కంటే బిజెపి అధ్వాన పాలన చేసిందని ఈసడిస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. 'నందిని'ని కబళించే అమూల్‌ పడగ నీడపై భగ్గుమంటున్న రైతులు, నిరుద్యోగంతో తల్లడిల్లుతున్న యువత, గ్యాస్‌ బండ నుంచి...అన్నింటా భారాలతో నలిగిపోతున్న పేద ప్రజలు, కష్టజీవులు.. మతతత్వ పార్టీకి బుద్ధి చెప్పేందుకు అన్ని శక్తులూ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 'మనుషులంతా ఒక్కటే.. కులాలు, ఉపకులాలు లేవు.. ఆహారం, ఇల్లు, బట్ట, జ్ఞానం, వైద్యం.. ఇవి ప్రతి మనిషి కనీస అవసరాలు' అన్న బసవన్న మాటలు కన్నడ నాట ప్రతిధ్వనించేలా ఓటరు తీర్పునివ్వాలి. కార్పొరేట్‌ - మతతత్వ కూటమి పాలనకు అది చెంపపెట్టు కావాలి.