
అందమైన మాటలతో, అందరూ నిజమేనేమో అనుకునేలా విద్వేషపు విషాన్ని కుమ్మరించి, సమాజాన్ని నిలువునా చీల్చడంలో అందె వేసిన మోడీ సర్కారు మతోన్మాద ఎజెండాను మరింతగా రుద్దేందుకు సిద్ధమవుతున్నట్టుంది. అందుకోసమే వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను మళ్లీ తెరపైకి తెస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ బెంగాల్‌లో సిఎఎ అమలు చేస్తామని తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. సిఎఎ ప్రక్రియ మళ్లీ మొదలైందని ఆ రాష్ట్రానికే చెందిన బిజెపి నాయకుడు సువేందు అధికారి అంతకుముందే పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చింది. జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన ఈ నిర్ణయాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావిస్తూ, ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారనే విమర్శలు వస్తుండగానే సిఎఎకు తొలిమెట్టుగా భావించే జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) అంశాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ మళ్లీ ముందుకు తెచ్చింది. జనన మరణాలు, వలసల కారణంగా మార్పులను చేర్చడానికి మళ్లీ తాజా పర్చాలని 2021-22 వార్షిక నివేదికలో పేర్కొంది. 2015లో ఎన్‌పిఆర్ వివరాలను సవరించినప్పటికీ అది చాలదని, మరిన్ని కొత్త విషయాలను చేర్చాలని పేర్కొంది. సిఎఎ నిబంధనలు ఇప్పటివరకూ తయారు చేయలేదని కేంద్రమే సుప్రీంకోర్టుకు తెలిపింది. పాలల్లో విషపు చుక్క.. ప్రజాస్వామ్యంలో మత రాజకీయపు ముక్క... అన్నట్లు దేశవ్యాప్తంగా ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి భయాందోళనల మంటలు రేకెత్తించి, ఆ మారణహోమాన్ని ఓట్ల రూపంలో మరోసారి మలచుకోవాలని పాలక బిజెపి భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి చేసినప్పుడు పౌరుల రిజిస్టర్ నుంచి మినహాయించబడిన ముస్లిమేతరులు ప్రయోజనం పొందుతారని, మినహాయించబడిన ముస్లిములు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందనే భయాలున్నాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య దేశవ్యాప్తంగా సిఎఎపై వెల్లువెత్తిన నిరసనలు, అల్లర్లలో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్ భారత పర్యటన సమయంలోనే 2020 ఫిబ్రవరి ఢిల్లీ అల్లర్లలో మతోన్మాదుల దుశ్చర్యలు, విద్వేష పూరిత వీరంగాలు యావద్భారత దేశాన్ని కలవరపాటుకు గురిచేశాయి. 2021 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ముస్లిమేతర మతాలకు చెందిన 1,414 మందికి పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారని కేంద్ర నివేదిక పేర్కొంది. 2,439 మందికి లాంగ్ టర్మ్ వీసాలు కూడా మంజూరు చేశారు. మరోవైపు సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను వ్యతిరేకించిన వారిని ఉగ్రవాదులుగా, అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. ఇందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం యుఎపిఎను సాధనంగా చేసుకుంటున్నారు. 2015 నుంచి 2020 వరకూ ఈ చట్టం కింద అరెస్టు చేసిన వారిలో మూడు శాతం కంటే తక్కువమందిపైనే నేరారోపణలు రుజువయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా విశ్లేషించింది. మూడింట రెండొంతుల కేసులలో నిందితులకు ఎటువంటి ఉగ్రవాద చర్యతో సంబంధం లేదు. ఈ కఠిన చట్టం కింద 5,924 కేసులు నమోదు చేసి, 8,371 మందిని ఐదేళ్లలో అరెస్టు చేశారు. వారిలో 235 మందికే శిక్షలు పడ్డాయి. ఈ గణాంకాలను బట్టి ఈ కేసులలో డొల్లతనాన్ని, ప్రత్యర్థులను, తన చర్యలను వ్యతిరేకించే వారిని ఎంత దారుణంగా వేధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వందమంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న భారత న్యాయవ్యవస్థ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. ఎన్‌ఆర్‌సి, సిఎఎను తిరిగి తీసుకొచ్చేందుకు మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ప్రజల మధ్య విద్వేష విషాన్ని చిమ్మడానికే! ఇటువంటి వాటిని దేశ ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానం అని చాటిచెప్పాలి. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అంటూ విద్వేష కుట్రల్ని వమ్ముచేయాలి.