Nov 23,2022 07:17

        బ్యాంకులకు కార్పొరేట్లు టోపీ వేస్తున్నారని మరోసారి నిర్ధారణ అయింది. ఆర్‌టిఐ పిటిషన్‌కు సమాధానంగా ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయలకుపైగా రుణాలు మాఫీ చేసినట్లు సాక్షాత్తు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే ప్రకటించింది. మట్టిని దైవంగా.. పైరును ప్రాణంగా భావించి స్వేదంతో నేలను తడిపే రైతు, కౌలు రైతు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలందవు. ఎవరికైనా అందినా లక్ష లోపు తీసుకున్న వారే ఎక్కువ. మద్దతు ధర రాక, అతివృష్టి అనావృష్టి, అనారోగ్యం తదితర కారణాల వల్ల ఎవరైనా సకాలంలో కట్టలేక పోతే.. సర్కారు వారి పాట అంటూ ఊరంతా ముందుగా దండోరా వేసి మరీ వారికున్న కొద్దిపాటి పొలాన్నో, ఇంటినో వేలం వేస్తారు. ఈ తతంగంతో మనస్తాపానికి గురై పరువు పోయిందని ఊపిరి తీసుకున్న వారు, ఉన్న ఊరిని వదిలి వలస పక్షుల్లా ఎగిరిపోయి అవస్థలు పడుతున్న అన్నదాతలెంతమందో! కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణాలు తీసుకున్న కార్పొరేట్లలో ఎగ్గొట్టిన వారే ఎక్కువని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఐదేళ్లలోనే పది లక్షల తొమ్మిది వేల 510 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. తీసుకున్న రుణానికి సంబంధించి 90 రోజులకుపైగా వాయిదా లేదా వడ్డీ చెల్లించకపోయిన వాటిని నాన్‌ పెర్ఫార్మెన్స్‌ అసెట్స్‌ (ఎన్‌పిఎ) అంటారు. ఈ జాబితాలోకి వచ్చిన మొత్తాల్లో 13 శాతమే అంటే లక్షా 32వేల 36 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. గత పదేళ్లలో రూ.13 లక్షల 22 వేల 309 కోట్లు మాఫీ అయితే, అందులో యుపిఎ పాలనలో 2012 నుంచి 2014 ఆర్థిక సంవత్సరం వరకూ మాఫీ అయినవి 75,227 కోట్లు. మిగతా రూ.12,47,08 కోట్ల రుణాలు మాఫీ చేసింది కాషాయ పార్టీ ఏలుబడి లోనే. ఇలా మాఫీ చేసిన కార్పొరేట్ల పేర్లు వెల్లడించడానికి కూడా సర్కారు అంగీకరించకపోవడం గమనార్హం. కరోనా విరుచుకుపడిన 2019లో కష్టజీవులను ఆదుకోవడానికి చేతులు రాని మోడీ సర్కారు కార్పొరేట్‌ టాక్స్‌ను 10 శాతం తగ్గించింది. అందువల్ల కార్పొరేట్లకు ఏడాదికి తగ్గిన పన్నులు లక్షా 84 వేల కోట్లు. 2019-20లో పెట్రో ధరల పెరుగుదల ద్వారా రూ.2 లక్షల 40 వేల కోట్ల పన్నులు అదనంగా వసూలు చేశారు. ఇటీవల కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ సమావేశంలో మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదని కార్పొరేట్లను నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. సంపద సృష్టికర్తలుగా చెబుతున్న కార్పొరేట్లు ఉపాధి కల్పనకు పెట్టుబడులు పెట్టలేదని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్‌రాక్‌ నివేదిక ప్రకారం కోటి రూపాయలకుపైగా విలువైన కార్లు, విల్లాల కొనుగోళ్లు, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజరుమాల్యా, నీరవ్‌మోడీ తదితరుల చరిత్ర జగమెరిగినదే !
          ఏడాదికి రెండున్నర లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంది. వీరిని మోడీ సర్కారు ఊరించి ఉసూరుమనిపిస్తోంది. ట్యాక్స్‌ కట్టకపోయినా రిటర్న్స్‌ సమర్పించాలంటూ వీరిని ట్యాక్స్‌ నెట్‌లోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. వారి ఆదాయ పరిమితి పెంచితే వస్తువులు, సేవల వినియోగానికి ఖర్చు చేస్తారు. అందువల్ల సరుకుల అమ్మకాలు పెరుగుతాయి. సంక్షోభ సమయంలో ఈ కొనుగోళ్లు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. మరోవైపు దేశం కోసం శ్రమించే రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. 2019లో అట్టహాసంగా ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పి.ఎం కిసాన్‌) కింద కేంద్రం సహాయం అందించే రైతుల్లో ఎనిమిది కోట్ల మంది అంటే మూడింట రెండొంతుల మందికి మొండిచేయి చూపారు. 2019 ఫిబ్రవరిలో తొలి విడతకూ, 2022 మే-జూన్‌లో 11వ విడతకూ మధ్య లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల నుంచి 3.87 కోట్లకు తగ్గింది. చేసిన అప్పు ఎలాగైనా తీర్చాలనేది సామాన్యుడు, రైతన్న తపన కాగా, ఎగ్గొట్టే అన్ని అవకాశాలు కార్పొరేట్లకు ఇస్తోంది కాషాయ ప్రభుత్వమే. సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగేలా ఆర్థిక విధానాలు మారితేనే దేశానికి రక్ష.