
ఇదివరకు, ప్రాథమిక విద్యాస్థాయిలో ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు బోధిస్తే సరిపోయేది. విలీనాలతో ఒక్కొక్క తరగతిలో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయింది. కానీ ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం పెరగలేదు. ప్రభుత్వం రూపొందించిన 'హేతుబద్ధమైన' విద్యావిధానం అమలు ఈ రకంగా ఉంది మరి! పైగా ఈ విలీనాల వలన విద్యార్థుల ఇంటికి బడికి మధ్య దూరం పెరిగింది. దానివలన పిల్లలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నది. చిన్న చిన్న గ్రామాలలో సరైన రవాణా సౌకర్యాలు ఉండవు. ఈ ప్రాంతాల పిల్లలందరూ రైతు కుటుంబాల నుండి వచ్చిన పేదవారు కావడం వలన వారి దగ్గర రవాణా చార్జీలు పెట్టుకోడానికి డబ్బులు కూడా ఉండవు. విధాన రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వం ఇటువంటి సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకోలేదు.
హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టార్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బదిలీ, విలీన విధానాల కారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత మరింత తీవ్రమైంది. సిర్సా జిల్లా లోని షాపురియా గ్రామంలో సమిత ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈమధ్యే ఆమెను ఫతేహాబాద్ లోని బాలియాలాకి బదిలీ చేశారు. బాలియాలా ఆమె ఇంటి నుండి 127 కిలోమీటర్ల దూరంలో వుంది. ఆమెకు మానసిక వైకల్యంగల పాప ఉంది. ఇప్పుడామె ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటూ పాపను చూసుకోవడమా లేక పాపను వదిలేసి ఉద్యోగానికి వెళ్లడమా అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
'నూతన బదిలీ విధానం-2016'ను ఈ ఆగస్టు నెల నుండి దూకుడుగా అమలు చేస్తున్నందున 40 శాతం మంది ఉపాధ్యాయులు (అందులోనూ ఎక్కువ శాతం మహిళలు) సమిత మాదిరిగా సందిగ్ధంలో పడవలసి వస్తున్నది.
ఈ కొత్త విధానంలోని నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన పాఠశాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకుని, అక్కడకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఒకవేళ అక్కడ ఖాళీ లేకపోతే...ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీలున్న ఇతర ఏ పాఠశాలకైనా బదిలీ చేసి పంపవచ్చు.
అంతకంటే ఘోరం ఏమంటే...ప్రభుత్వం పాఠశాలలను విలీనం చేసి, కొత్త క్లస్టర్ విధానాన్ని రూపొందించింది. దీనివలన సమర్ధత పెరుగుతుందని, హేతుబద్దత గల నూతన విద్యావిధానం అమలుచేయవచ్చని భావిస్తున్నది. ఉదాహరణకు 7 కి.మీ పరిధి లోని ఒక సీనియర్ సెకండరీ పాఠశాలను 'క్లస్టర్' స్కూల్‌గా రూపొందించవచ్చు. అంటే ఆ ప్రాంతానికి అదొక్కటే పాఠశాలగా ఉంటుంది.
ఈ విధానంలో... 6 నుండి 8 తరగతుల్లో 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు...9 నుండి 12 తరగతుల్లో 25 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు...3 కి.మీ పరిధిలోని సమీప మధ్య, ఉన్నత లేదా ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో విలీనం చేయబడతాయి.
ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న బడులన్నీ ఒకే స్కూల్ యూనిట్‌గా పరిగణించబడతాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలన్నీ (ఆడపిల్లల పాఠశాల అయినా, మగపిల్లల పాఠశాలలైనా, ఏవైనా) కలిపి ఒకే పాఠశాలగా మార్చి, మిగిలిన ఉపాధ్యాయులను, హెడ్ మాస్టర్లను ఇతర పాఠశాలలకు ప్రభుత్వం బదిలీలు చేస్తున్నది (జీతాలు, ఇతర సౌకర్యాలు మాత్రం తగ్గించడం లేదన్నది వేరే విషయం).
ఉదాహరణకు, ఈ విధానంలో ఒక గ్రామ పరిధిలోని 288 పాఠశాలలు (ఇందులో 183 మాధ్యమిక పాఠశాలలు, అందులో 149 బాలికల పాఠశాలలు) విలీనం చేయబడ్డాయి. ఇంకొన్ని విలీనానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదంతా ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తరగతులు విలీనం చేయడం వలన ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆ కారణంతో వారు బదిలీ చేయబడుతున్నారు. వాస్తవానికి ఈ బదిలీలతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రతరం అవుతున్నది. దాంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల సెగ
పాఠశాలల విద్యావిధానం బీటలు వారడానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోరుబాట పడుతున్నారు. సెప్టెంబర్ 16న జింద్ లో ఉన్న ఖరక్‌భురా గ్రామం లోని మాధ్యమ, హైస్కూళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ మాధ్యమ పాఠశాలలో కేవలం ఒక హెడ్ మాస్టర్, ఒక సంస్కృతం బోధించే ఉపాధ్యాయుడు ఉన్నారు. హైస్కూల్‌లో వివిధ పాఠ్యాంశాలు బోధించడానికి ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. నాలుగు రోజుల తరువాత రోV్‌ాతక్ జిల్లా లోని బహు అక్బర్‌పూర్ గ్రామంలో ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు, పాఠశాల తలుపులకు తాళాలు వేసి, ఢిల్లీ-హిసార్ జాతీయ రహదారిని దిగ్బంధించారు.
సెప్టెంబర్ 1వ తేదీన ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్ ఉపాధ్యాయులను బదిలీ చేయడం, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించకపోవడం వాళ్ళ ఆగ్రహానికి కారణం అయింది. సఫిదాన్ జిల్లా లోని మాలిక్‌పూర్ గ్రామంలో ఒక్క ప్రధానోపాధ్యాయుడే 160 మంది పిల్లలకు పాఠాలు చెప్పాల్సి వస్తున్నది. అక్కడ చదువుతున్నదంతా పేద కుటుంబాల నుండి వచ్చిన పిల్లలే. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పానిపట్ జిల్లా లోని చిచ్‌దానలో 180 పిల్లలకు ఇద్దరే ఉపాధ్యాయులు బోధించవలసి వస్తున్నది. ఆ ఇద్దరూ 6 నుండి 10వ తరగతి వరకు పాఠాలు చెప్పాల్సి ఉంది. ఆగస్టు నెలలో అయిదుగురు ఉపాధ్యాయులు బదిలీ అవగా వారి స్థానాలలో ఎవరినీ భర్తీ చేయలేదు. హిసార్ లోని ఫరీద్‌పూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే వంద మంది విద్యార్థులు, ఒకవైపు పరీక్షలకు చదువుకుంటూనే మరోవైపు ధర్నాకు దిగారు. బదిలీ చేయబడిన ఆరుగురు ఉపాధ్యాయులను వెనక్కు పిలివాలన్నదే వారి డిమాండ్.
తీవ్రమైన ఉపాధ్యాయుల కొరత
ప్రభుత్వం తన నూతన విద్యావిధానాన్ని (బదిలీలను, విలీనాలు) సమర్ధించుకుంటున్నది. ఉపాధ్యాయులేమో తాము బదిలీలకు వ్యతిరేకం కాదని, కేవలం విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి సక్రమంగా లేకపోవడానికి మాత్రమే వ్యతిరేకమని చెప్తున్నారు. రాష్ట్రంలో 38,957 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి ఖాళీలు ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయని 'అధ్యాపక్ శిక్షక్ సంఫ్‌ు' వంటి ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
'నిజానికి ఈ బదిలీలు అన్నీ మూసివేతలే' అంటున్నారు విద్యావేత్త సత్యపాల్ శివచ్. ఈ బదిలీలు, విలీనాలతో చాలా బడులు పని చేయలేని స్థితికి నెట్టబడి పేరుకి మాత్రమే మిగిలాయి. సైన్స్, లెక్కల ఉపాధ్యాయులు లేనందువలన ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడిని ఆ పాఠాలు బోధించమంటున్నారని సత్యపాల్ కుమార్తె అంటున్నారు.
విద్యాశాఖ గణాంకాల ప్రకారమే 14,503 పాఠశాలలలో 4,801 పాఠశాలలను మూసివేశారు. లేదా విలీనం చేశారు. భర్తీ చేయవలసిన ఉపాధ్యాయ ఖాళీలు విపరీతంగా ఉన్నాయి. మొత్తం 1,30,054 ఉపాధ్యాయు పోస్టులు ఉండగా అందులో 38,957 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను బోర్డు ద్వారా పూరించడానికి బదులుగా...కౌశల్ రోజ్‌గార్ నిగమ్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికి 12,500 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించబడ్డారు. నిజానికి వాళ్ళను నియమించేటప్పుడు బదిలీలు చేయడం అన్నది నియామకాల నిబంధనలలో లేదు. కానీ ఈ మధ్య సెప్టెంబర్ 28న కాంట్రాక్టు పద్ధతిలో నియమించబడిన ఉపాధ్యాయులు కూడా బదిలీల్లో తమ మొదటి ప్రాధ్యాన్యతను తెలియచేయాలని సర్క్యులర్ జారీ చేయబడింది. కాంట్రాక్టు టీచర్లలో రేగిన అశాంతిని గమనించి...వారిని తమ నివాసానికి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో నియమిస్తామని కట్టార్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నెరవేరుతుందని ఆశించలేము.
తరగతి గదులను కుదించడం
హర్యానాలో పాఠశాలల విలీనాల ప్రక్రియ ద్వారా 38,957 ఉపాధ్యాయ ఖాళీలను 26,000కి కుదించినట్టు అక్కడి విద్యాశాఖ ప్రకటించింది. ఒక ఉపాధ్యాయుడు నాలుగు సబ్జెక్టులు బోధించవచ్చని చెప్పి ముఖ్యమంత్రి రికార్డులకెక్కారు. నుV్‌ాలో ఉన్న ఘఘాస్,నగీమ లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల లోని ప్రాథమిక పాఠశాల విభాగంలో 320 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో అయితే ఫరవాలేదు. ఆరవ తరగతి నుండి పన్నెండో తరగతి వరకు ప్రతి సబ్జెక్టుకి తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయురాలు ఉండాలి. అలా లేకపోవడం వలన ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇదివరకు, ప్రాథమిక విద్యాస్థాయిలో ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు బోధిస్తే సరిపోయేది. విలీనాలతో ఒక్కొక్క తరగతిలో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయింది. కానీ ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం పెరగలేదు. ప్రభుత్వం రూపొందించిన 'హేతుబద్ధమైన' విద్యావిధానం అమలు ఈ రకంగా ఉంది మరి!
పైగా ఈ విలీనాల వలన విద్యార్థుల ఇంటికి బడికి మధ్య దూరం పెరిగింది. దానివలన పిల్లలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నది. చిన్న చిన్న గ్రామాలలో సరైన రవాణా సౌకర్యాలు ఉండవు. ఈ ప్రాంతాల పిల్లలందరూ రైతు కుటుంబాల నుండి వచ్చిన పేదవారు కావడం వలన వారి దగ్గర రవాణా చార్జీలు పెట్టుకోడానికి డబ్బులు కూడా ఉండవు. విధాన రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వం ఇటువంటి సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకోలేదు.
ప్రైవేటీకరణను ప్రోత్సహించడమే పరమావధి
ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ పోతున్నది. అంటే, ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తున్నదన్నమాట. దాదాపు 1000 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను నమూనా సంస్కృత పాఠశాలలుగా మార్చేసింది. వాటిని కేంద్ర సెకండరీ విద్యా బోర్డుకు అనుబంధం చేసింది. వాటిలో, ప్రాథమిక పాఠశాలల నుంచి అన్ని స్థాయిల్లోను ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది.
ఈ ఏడాది జులైలో మరో పథకాన్ని ప్రవేశ పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పద్ధతిలో, లక్షా ఎనిమిది వేల కన్నా తక్కువ వార్షిక ఆదాయంగల వారికి, 'సమాన విద్యావకాశాలు కల్పించే పథకం' కింద...ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు పాఠశాలలకు మారిపోయే వారికి...ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. ఒకవైపు నమూనా ప్రభుత్వ సంస్కృత పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఫీజు వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తుండడం విడ్డూరంగా ఉందని మాజీ స్కూల్ ప్రిన్సిపల్ జె.సింగ్ అంటున్నారు.
అంతేకాదు, ప్రభుత్వం ఆరవ తరగతి ఆపై చదువుతున్న విద్యార్థులకు...తమ తండ్రులు చేస్తున్న వృత్తికి సంబంధించిన కిట్లను సరఫరా చేస్తుండడం మరో వివాదాంశంగా మారింది. 14 ఏళ్ల వయసు వరకు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు వారి తండ్రుల వృత్తికి సంబంధించిన కిట్లను అందిస్తుండడం ఏవిధంగా సమర్ధనీయం? 2019లో బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి...జననాయక్ జనతా పార్టీ మద్దతు ఉపయోగపడింది. ఆ పార్టీలో ఉన్న వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ తరగతుల మద్దతు లేకుండా బిజెపి కి 40 సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదు. కానీ పాఠశాలల హేతుబద్దీకరించే విధానం వలన నష్టపోతున్నది ఈ తరగతుల వారే. బిజెపి, ఆర్.ఎస్.ఎస్ లతో సైద్ధాంతికంగా ఏకీభవించే వారు కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన బదిలీ, విలీనాల పట్ల అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. అయితే ప్రభుత్వం దీనిని పట్టించుకునే స్థితిలో లేదు.
/'ఫ్రంట్‌లైన్' సౌజన్యంతో/
టి.కె. రాజాలక్ష్మి