Jun 11,2023 14:20

అనగనగా సిరిపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో బడి, గుడి, తోటలు, పంట పొలాలు ఉన్నాయి. ఆ ఊరు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ బడిలో రామం అనే ఉపాధ్యాయుడు ఉన్నారు. అతనికి సీత అనే భార్య లవ, కుశ అనే పేర్లు గల ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. లవ 9వ తరగతి, కుశ 10వ తరగతి చదువుతున్నారు. భార్యభర్తలు ఇద్దరూ పిల్లలని రోజూ తోటకి తీసుకు వెళ్లేవారు. ఆ తోటలో పక్షులు కిలకిలరావాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఆ తోటలో రామచిలుకలు అటూ ఇటూ ఎగురుతూ ఉంటే మనసుకి ఆనందంగా ఉంటుంది. లవ అనే వాడు బాగా చదివేవాడు. కుశ కి చదువు అంటే బద్ధకం ఆ కారణంగా 10వ తరగతిలో ఉత్తీర్ణుడు కాలేదు. వీడికి బద్ధకం పోవాలంటే ఒక గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు ఉపాధ్యాయుడైన తండ్రి. వీళ్లు రోజూ తోటకి వెళ్తుంటారు. ఒక రోజు తోట నుండి ఒక రామచిలుకను ఇంటికి తెచ్చారు. దానికి ఒక పంజరం ఏర్పాటు చేసి, దానికి గింజలు, పళ్ళు ఆహారంగా పెడుతున్నారు. ఆ చిలుకని చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ చిలుకకి ఇక్కడ బాగా నచ్చింది ఎందుకంటే కావలసినంత తిండి దొరుకుతుంది. అదే తోటలో అయితే తిండి కోసం వెతుక్కోవాలి. ఇక్కడే బాగుంది అనుకుంది. ఎగరడం, అటు ఇటు తిరగడం మానేసింది. ఆ చిలుకకి అలా బద్ధకం చాలా ఎక్కువ అయింది. దాని పంజరం తలుపులు తీసినా ఎగరడం లేదు. అప్పుడు రామం ఆ చిలుకకు రెండు రోజులు ఆహారం పెట్టలేదు. దానికి ఆకలిగా ఉండీ, అటుగా రామచిలుకలు గుంపు రావడం చూసింది. ఒక్కసారిగా బద్ధకం వీడి, పంజరం నుండి ఆహారం కోసం ఎగిరిపోయింది. ఉపాధ్యాయుడు తన అబ్బాయి అయినా కుశకి ఈ చిలుక ఉదాహరణగా బోధించాడు. అప్పటి నుంచి కుశ మంచిగా చదువుకుని, 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు.
 

బల్ల కృష్ణవేణి