- తుగ్గలి సర్పంచ్‌ను సన్మానించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.
ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : మండల కేంద్రమైన తుగ్గలి సర్పంచ్ రామాంజనేయులును టిడిపి రాష్ట్ర నాయకులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మంగళవారం మండల కేంద్రమైన తుగ్గలిలో సర్పంచ్ రామాంజినేయులు ఇంటికి వచ్చి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీకి నిధులు ఇవ్వకపోవడంతో తుగ్గలి సర్పంచు రామాంజనేయులు వారి కుటుంబ సభ్యులు ఎద్దుల బండిమీద చెత్తచెదారాన్ని తీసుకోని పోయి బయట పారవేయడంతో తాను కలత చెందడం జరిగిందన్నారు. అందుకే తాడిపత్రి నుండి వచ్చి సర్పంచ్‌కు అభినందనలు తెలిపి వారి దంపతులకు వస్త్రాలను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం సర్పంచ్లు దీన పరిస్థితుల్లో ఉన్నారన్నారు. అందుకే ప్రజల కూడా కాలవలో ఉన్న చెత్త, చెదారం పారవేయకుండా ఇంటి దగ్గరే ఒక బుట్ట పెట్టుకొని చెత్తాచెదారాన్ని ఆ బుట్టలో వేసి బయట పారవేయాలని ఆయన గ్రామ ప్రజలను సూచించారు. అలా చేయకపోతే సర్పంచులు ఇలా చేయవలసిన పరిస్థితి వస్తుందని ఆయన తమ ఆవేదనను వెలబుచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పత్తికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్ పాల్గొన్నారు. అనంతరం జేసి ప్రభాకర్ రెడ్డి తుగ్గలి నాగేంద్ర ఇంటికి వెళ్లి తేనేటి విందును స్వీకరించారు.










