
స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. సమాజ వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది...అంతెందుకు నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతాను అంటారు. అలాగే స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అన్నారో సినీకవి. నిజమే స్నేహానికన్నా లోకంలో ఎవరూ ఎక్కువ కాదు. స్నేహితుడు అండగా ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే ధైర్యం ఉండటం ఖాయమే. చివరివరకూ తోడుండేది కూడా స్నేహితుడే. ఎవరికీ చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితుడితో చెప్పుకునే పరిష్కరించుకుంటాం. అంతటి స్థాయి స్నేహితుడిది. ఆ హితుడే స్నేహితుడు. అందుకే మనకు ఏ కష్టం వచ్చినా మొదట చెప్పుకునేది కూడా స్నేహితుడికే. ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ కథనం..
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారైన ఉంటారేమే గానీ స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని, ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. అయితే ఇలాంటి స్నేహితుల కోసం ఓ రోజు ఉంది. అదే స్నేహితుల దినోత్సవం. ఇంతటి గొప్ప స్నేహితుల దినోత్సవాన్ని మన దేశంలో ఏటా ఆగస్టు మొదటి ఆదివారం రోజున 'ఫ్రెండ్‌షిప్ డే'ను నిర్వహించుకుంటారు.

ఏ దేశంలో ఎప్పుడు?
ఇక వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే సంస్థ 1958లో పరాగ్వేలో జులై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. 2011లో ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జులై 20వ తేదీన నిర్వహిస్తారు. అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్థాన్‌లో మాత్రం జులై 30న చేసుకుంటారు. అమెరికా ప్రపంచ ఫ్రెండ్‌షిప్ డే మసాచుసెట్స్, ఓహియో, అప్పుడప్పుడు న్యూ హాంపైర్ష్ యొక్క పాకెట్స్ యునైటెడ్ స్టేట్స్‌లో జూన్ 30న జరుపుకుంటారు. బ్రెజిల్‌లో స్నేహితుల దినోత్సవాన్ని ఏప్రిల్ 18న జరుపుకుంటారు.

తెలుగులో సినిమాలు..
స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, స్నేహితుడా, స్నేహితులు, నీ స్నేహం..ఓ మై ఫ్రెండ్, ఫ్రెండ్‌షిప్, స్నేహమంటే ఇదేరా.. వంటి టైటిల్స్‌తోనూ.. కథల పరంగా.. ఆర్య-2, వసంతం, ఊపిరి, ఆర్‌ఆర్‌ఆర్, డార్లింగ్, మహర్షి, హ్యాపీ డేస్, నవ వసంతం వంటి చిత్రాల్లో స్నేహం గురించి తెలియజెప్పాయి. ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అయితే అన్నింటి సారాంశం ఒక్కటే.. ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది...

ఎంతో ఉత్సాహంగా..
స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితుడి మీద ప్రేమను వ్యక్తపరుస్తూ.. కేక్‌లు కట్ చేస్తూ వేడుకలు చేసుకుంటుంటారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఫ్రెండ్ షిప్ బాండ్లు కట్టుకుంటుంటారు. స్నేహితుల హితం కోసమే స్నేహితుల దినోత్సవం అనేది అందరికి తెలిసిందే. అయితే.. జాతి, కులం, మతం, లింగ, ప్రాంతం తేడాలు లేకుండా ప్రపంచదేశాల మధ్య స్నేహభావం పెంపొందాలనే ఉద్దేశంతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ సమావేశం నిర్వహించి, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. దేశాల మధ్య సుహృద్భావం, స్నేహం కలగాలని భావించింది. దేశాల మధ్య వైషమ్యాలు ఉండకూడదని సూచించింది. అన్ని దేశాలు సోదరభావంతో మెలిగి, ప్రపంచ శాంతికి బాటలు వేయాలని సంకల్పిస్తోంది.
అలాంటి ఆశయాలకు బాటలు వేసిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మార్క్స్ ఏంగెల్స్, చేగవేరా ఫెడల్ క్యాస్ట్రో.. సమసమాజ నిర్మాణం కోసం ఎనలేని పోరాటం చేసిన చేగువేరా లాంటి తురుపుముక్కను వదులుకోవడానికి ఏ రాజనీతజ్ఞుడూ సిద్ధపడడు. కానీ అది విప్లవ పోరాటం. అక్కడ వ్యక్తిగత స్నేహాలకు తావులేదు. అందుకే దేశాధినేతగా కాకుండా ప్రియమైన స్నేహితుణ్ని పూర్తిగా అర్థంచేసుకున్న వ్యక్తిగా ఫెడల్ క్యాస్ట్రో.. చేగువేరాకు వీడ్కోలు పలికాడు.
కాగా 'ప్రాచీన చరిత్రలో స్నేహం గురించి చెప్పుకోవటానికి అనేక ఉదాహరణలున్నాయి. మానవాళి చరిత్రలో స్నేహానికి దర్పణం పట్టే అన్ని ఉదాహరణలనూ అధిగమించే స్నేహితుల ద్వయం, విప్లవకారుల ద్వయం, మేధావుల జోడి కార్మికవర్గపు శాస్త్రవిజ్ఞానాన్ని సృష్టించారని యూరోపియన్ కార్మికవర్గం చెప్పుకుంటుంది' అని మార్క్స్ ఏంగెల్స్‌ల జోడి గురించి లెనిన్ వ్యాఖ్యానించాడు. అందుకే ఆధునిక కాలంలో సామాజిక తత్వవేత్త, కార్మికలోక ఆధిపత్య కాంక్షాపరులు కారల్ మార్క్స్, ఆయనకూ, ఆయన సిద్ధాంతాలకూ వెన్నుదన్నుగా నిలిచిన ఏంగెల్స్ మైత్రీబంధం కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
- ఉదయ తేజశ్విని