Sep 13,2022 06:37

ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాన్ని... వైఎస్సార్‌సిపి ప్రభుత్వం నేటికీ అమలు చెయ్యలేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చెయ్యకుండా నామమాత్రంగా వేతనాలను పెంచి చేతులు దులుపుకున్నది. పిఆర్‌సి ప్రకారం క్లాస్‌4 దిగువ స్థాయి క్యాడర్లకు నెలకు రూ.20 వేలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.15 వేలకు జీవోలు ఇచ్చింది. ఆ వేతనాలనూ ఎన్‌హెచ్‌ఎం లో అమలు చెయ్యలేదు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల తల్లిదండ్రులకు వచ్చే వృద్ధాప్య పింఛన్లను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఏ సంక్షేమ పథకాలను కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అమలు చెయ్యడం లేదు.

దేశవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌-ఎన్‌.హెచ్‌.ఎం)లో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్‌.హెచ్‌.ఎం లో 22 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో వీరిది కీలక పాత్ర. కోవిడ్‌ కాలంలో సైతం వీరు ముందుపీఠిన నిల్చి సేవలందించారు. వేలాది మంది కోవిడ్‌ బారిన పడ్డారు. పదుల సంఖ్యలో చనిపోయారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్న వీరికి రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా వేతనాలను చెల్లిస్తున్నది. పి.ఎఫ్‌ మినహా ఎటువంటి సౌకర్యాలను వర్తింపచెయ్యటంలేదు. కనీసం వైద్య, ఆరోగ్య శాఖలో ఇతర కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వర్తింపచేస్తున్న మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ను కూడా అమలు చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. వైద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సేవలు అందించటంలో కీలక పాత్ర పోషించే ఈ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
    జాతీయ ఆరోగ్య మిషన్‌ లోని వివిధ విభాగాలైన పట్టణ ఆరోగ్యం, ఆర్‌ఎన్‌టిసిపి, ఆర్‌బిఎస్‌కె, ఆర్‌బిఎస్‌యు, ఎన్‌ఆర్‌సి, ఎస్‌ఎన్‌సియు, ఎన్‌టిఎల్‌పి, ఆర్‌కెఎస్‌కె, ఎంహెచ్‌పి, ట్రామా, బ్లడ్‌ బ్యాంకులు, ఆయూష్‌, కౌమార దశలో ఆరోగ్యం లలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఎఎన్‌ఎం లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, సైకాలజిస్టులు, న్యూట్రీషియనిస్టులు, ఎక్స్‌రే టెక్నీషియన్లు, దంత వైద్యులు, ఎంఎంఓ, ఎఫ్‌ఎన్‌ఓ, డిఇఓ, ఆఫీసు సిబ్బంది, క్లాస్‌ 4 సిబ్బందికీ, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం, స్టాటెస్టికల్‌ ఆఫీసర్లు, జిల్లా క్యాడర్లు పనిచేస్తున్నారు. ఒకే క్యాడర్‌, ఒకే క్వాలిఫికేషన్‌ ఉన్నప్పటికీ ఒక్కొక్క విభాగంలో ఒక్కో రకంగా వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి వున్నది. ఒకే రకమైన వేతనాలు లేవు. ఫిజియోథెరఫిస్టులు, న్యూట్రిషియనిస్టులు, సైకాలిజిస్టులు, స్టాఫ్‌ నర్సులకు వేర్వేరు వేతనాలు చెల్లిస్తున్నారు. ఆర్‌కెఎస్‌కె కన్సల్టెంట్లకు, ఆర్‌బిఎస్‌కె లోని డిఐఇసి మేనేజర్లకు, అర్బన్‌ హెల్త్‌ లోని అన్ని క్యాడర్లకు ఉత్తర్వుల కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఈ లోపాలను సరిచెయ్యకపోగా అదే విధానాన్ని రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు.
   కోవిడ్‌ కాలంలో సేవలందిస్తూ కోవిడ్‌ సోకి మరణించిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం వర్తింపచెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే రూ.10 నుంచి 25 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని వర్తింపచేస్తూ జీవో ఇచ్చింది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కేవలం రూ. 2 లక్షల బీమా వర్తింపచేస్తూ ఉత్తర్వులు ఇచ్చి చావు లోనూ వివక్ష చూపింది. ఆఖరికి విధి నిర్వహణలో కోవిడ్‌ సోకిన వారికి సెలవులు మంజూరు చెయ్యడంలోనూ వివక్ష చూపింది. రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక కోవిడ్‌ లీవ్‌లను మంజూరు చేస్తూ అవసరమైన సవరణలను చేసింది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల లీవ్‌ల మంజూరులో నోరు మెదపలేదు. చిత్తూరు తదితర జిల్లాలలో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులతో ఏళ్ల తరబడి రాత్రి డ్యూటీలు చేయిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు వర్తించే 5 ప్రత్యేక సెలవులు, వికలాంగులకు అమలు కావాల్సిన ప్రత్యేక సెలవులను కూడా ఎన్‌హెచ్‌ఎం లో అమలు చెయ్యటం లేదు.
మార్గదర్శకాల ప్రకారం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు హెచ్‌.ఆర్‌ పాలసీ అమలు కావాలి. ప్రతీ 3 లేదా 5 సంవత్సరాలకు బేసిక్‌ వేతనాలు పెంచాలి. ప్రతీ సంవత్సరం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి. బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు అమలు కావాలి. పని ప్రదేశాలలో క్వార్టర్‌ సౌకర్యం కల్పించాలి. కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ పరిధి లోని రెగ్యులర్‌ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల లీవ్‌లు, చైల్డ్‌ కేర్‌ లీవ్‌లు, సిక్‌ లీవ్‌లు, పెటర్నటీ లీవ్‌లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వర్తింపచెయ్యాలి. మెడికల్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిడెంట్‌ బీమా, ప్రతీ సంవత్సరం హెల్త్‌ చెకప్‌లు వంటి సౌకర్యాలను వర్తింపచెయ్యాలి. కార్మిక చట్టాలు అమలు చెయ్యాలి. ఫిర్యాదులు పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చెయ్యాలి. రాష్ట్రంలో నేటికీ ఇవేవీ అమలు చెయ్యడం లేదు.
    పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, సౌకర్యాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చెయ్యటం కోసం నిర్ణయాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటికి ఎన్‌హెచ్‌ఎం లో పని చేస్తున్న ఉద్యోగులకు సరైన ఉద్యోగ భద్రత, సౌకర్యాలు ఇవ్వకుండా గత 15 సంవత్సరాలుగా ఆధునిక బానిసలుగా పని చేయించుకుంటున్నది.
కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలను చెల్లిస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాన్ని ... వైఎస్సార్‌సిపి ప్రభుత్వం నేటికీ అమలు చెయ్యలేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చెయ్యకుండా నామమాత్రంగా వేతనాలను పెంచి చేతులు దులుపుకున్నది. పిఆర్‌సి ప్రకారం క్లాస్‌4 దిగువ స్థాయి క్యాడర్లకు నెలకు రూ.20 వేలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.15 వేలకు జీవోలు ఇచ్చింది. ఆ వేతనాలనూ ఎన్‌హెచ్‌ఎం లో అమలు చెయ్యలేదు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల తల్లిదండ్రులకు వచ్చే వృద్ధాప్య పింఛన్లను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఏ సంక్షేమ పథకాలను కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అమలు చెయ్యడం లేదు.
హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చెయ్యాలని, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సంఘటితం అవుతున్నారు. వివిధ రూపాలలో నిరసనలు తెలుపుతున్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, హెచ్‌ఆర్‌ పాలసీ సాధనకై అన్ని క్యాడర్ల ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మరింత ఐక్యంగా ముందుకు సాగాలి. ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి.

/వ్యాసకర్త : ఎన్‌హెచ్‌ఎం ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షులు /
ఎ.వి. నాగేశ్వరరావు

ఎ.వి. నాగేశ్వరరావు