
ఒకరోజు గురువుగారు తన శిష్యునితో కలిసి అడవిలోకి వెళ్లారు. నడుస్తూ, నడుస్తూ ఒకచోట ఆగి గురువు దగ్గరలో ఉన్న నాలుగు మొక్కలను చూశారు. అందులో ఒకటి ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండోది కొంచెం పెద్దది, మూడోది దాని కన్నా ఇంకొంచెం పెద్దది. నాలుగోది చాలా పెద్ద చెట్టు. గురువు తన శిష్యుని పిలిచి మొదటి మొక్కను తుంచేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను తుంచేశాడు. ఇక రెండో మొక్కను లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దాన్ని కూడా లాగేశాడు. మూడోదాన్ని కూడా లాగేయమన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టంతో దాన్ని పీకేశాడు. ఇక ఎదిగిన చెట్టును చూపించి దాన్నీ లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా, బలంగా ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు. గురువుగారు 'చూడు నాయనా..! మన అలవాట్ల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. చెడు అలవాట్లను మొదట్లోనో తుంచేయకపోతే వాటికి బానిసై వాటి నుంచి వదిలిపెట్టడం చాలా కష్టం అవుతుంది. మొక్కై వంగనిది మ్రానై వంగునా అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది అని వివరించారు.
నీతి : మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్నగా ఉన్నపుడే మార్చుకోవాలి.
కె.జోషిత
9వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రఘుమండ, విజయనగరం జిల్లా