Jul 27,2022 06:56

     రాష్ట్రాలను అప్పుల పాల్జేసిన మోడీ ప్రభుత్వం, తప్పంతా రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నట్లు చిత్రించడం దుర్మార్గం. అన్ని వనరులు ఉన్న కేంద్రం ఎంతైనా అప్పు చేయొచ్చు, వనరులు పరిమితంగా ఉండే రాష్ట్రాలు ప్రజల అవసరాల కోసం అప్పు చేస్తే అది నేరం, ఘోరం అన్నట్లు నానా యాగీ చేస్తోంది. గోడీ మీడియా కూడా అదే పాటపాడుతుంది. గత వారం శ్రీలంకలో పరిస్థితి గురించి వివరించడానికి పిలిచి, రాష్ట్రాల అప్పుల గురించి విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకగా మారుతోందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు పురంధేశ్వరి వ్యాఖ్యానించడం, తాజాగా పార్లమెంటులో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రాల అప్పుల చిట్టాను ఏకరువు పెట్టడం ఇదంతా ఒక పథకం ప్రకారం ఫెడరలిజంపై కేంద్రం చేస్తున్న దాడిలో భాగమే. స్వాతంత్య్రం వచ్చిన ఈ ఏడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదే. పార్లమెంటుకు తాజాగా తెలిపిన లెక్కల ప్రకారమే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో చేసిన వంద లక్షల కోట్ల రూపాయల అప్పుతో దేశ రుణభారం రూ.155 లక్షల కోట్లకు చేరింది. ఇది జిడిపిలో 60 శాతానికి పైగా ఉంది. విదేశీ అప్పు జిడిపిలో 20 శాతం దాకా ఉంది. దీనికి తోడు పడిపోతున్న రూపాయి మారకపు విలువ, అడుగంటుతున్న విదేశీ మారక నిల్వలు, పైపైకి ఎగబాకుతున్న వాణిజ్య లోటు, బుసలు కొడుతున్న ద్రవ్యోల్బణం ఇవన్నీ ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి సంకేతాలు. 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థికమాంద్యం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న సంక్షోభం లాంటిదే ఇప్పుడు తలెత్తుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో శ్రీలంక నుంచి పాఠాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వాలా ?
       ఆర్థిక మాంద్యం ప్రభావం గురించి ప్రముఖ ఆర్థిక వేత్తలు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న మోడీ ప్రభుత్వం రాష్ట్రాల అప్పుల గురించి గుండెలు బాదుకుంటున్నది. ఒక వైపు ద్రవ్య ఫెడరలిజంపై దాడులు తీవ్రతరం చేస్తూ మరో వైపు రాష్ట్రాలు రెవిన్యూ సంక్షోభంలో కూరుకుపోవడానికి తన బాధ్యతేమీ లేదన్నట్లుగా వ్యవహరించడం మోడీ ప్రభుత్వ కపటవైఖరిని తెలియజేస్తోంది. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన జిఎస్టీ వల్ల రాష్ట్రాలు తమ పన్ను విధింపు అధికారాలు కోల్పోవడంతోబాటు, ఎదుగూ బొదుగూ లేని జిఎస్టీ ఆదాయంతో కటకటలాడుతున్నాయి. ఆ విధంగా రాష్ట్రాల ఆదాయాలాను కుదించివేసింది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో రాష్ట్రాలు పెద్దయెత్తున ఆదాయం కోల్పోతే చిల్లి గవ్వ కూడా విదిలించని కేంద్రం, అప్పులు తెచ్చుకోడానికి అనుమతి ఇచ్చింది. ఆ ప్రకారమే రాష్ట్రాలు అప్పులు తెస్తే, ఆర్థిక క్రమ శిక్షణ లేదని నిందిస్తున్నది. అన్ని వనరులు ఉండి కూడా జిడిపిలో 60 శాతం దాకా అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం ఎస్‌జిడిపిలో 25 శాతం మాత్రమే అప్పులు వున్న రాష్ట్రాలను తప్పుబట్టడం దొంగే దొంగ అన్న చందంగా ఉంది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడే ద్రవ్యలోటు 3.5 శాతానికి మించకూడదంటూ రాష్ట్రాలపై కొరడా ఝుళిపిస్తున్నది. రాష్ట్రాల చేతులు కట్టిపడేస్తున్నది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు సర్‌ఛార్జీలు, సెస్సులు విధిస్తూ కేంద్రం నేరుగా తన ఖాతాలోకి మళ్లించుకుంటోంది. ఇది కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల పేరుతో లోటు భర్తీకి నోట్లను ముద్రించుకునే అధికారం కేంద్రానికి ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్లు, రిజర్వు బ్యాంకు మిగులును వాడుకుంటుంది. ఇన్ని అవకాశాలు ఉండి కూడా కేంద్రం జిడిపిలో పరిమితికి మించి అప్పులు చేసింది. దీనిపై జాతికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందిపోయి, రాష్ట్రాలపైకి నెపం నెట్టాలని చూడడం దారుణం.
     ఫెడరలిజంపై మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ఈ దాడికి వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు బిజెపి యేతర పాలిత రాష్ట్రాలన్నీ ఐక్యంగా పోరాడాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి బదులు రాజీ వైఖరిని అనుసరిస్తున్నది. ఈ వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ద్రవ్య ఫెడరలిజంపై మోడీ సర్కార్‌ చేస్తున్న దాడి తాలూకు ప్రమాదాన్ని గుర్తించకుండా, ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్రానికి వత్తాసు పలకడం శోచనీయం.