Feb 19,2023 08:42

జనార్ధన్‌కి పందెం గిత్తలంటే చాలా ఇష్టం. అదొక వ్యామోహం, వ్యసనం. తనకి యుక్త వయసు వచ్చి, పెళ్లయి ఇంట్లో పెత్తనం చేతికి అంది వచ్చింది. ఇక వెంటనే ఒక జత ఒంగోలు జాతి కోడె దూడల్ని కొని, పందేల కోసం మేపడం మొదలుపెట్టాడు. ప్రతి మూడేళ్లకీ, ఉన్న కోడెల్ని అమ్మి, మళ్లీ లేత వాటిని ఎంత ధర అయినా పెట్టి కొనేవాడు. వాటిని పోటీలకు సిద్ధం చేసేవాడు. పమిడిపాడు జనార్ధన్‌ కోడె గిత్తలంటే రాష్ట్రం మొత్తంమీద పేరు రావాలని తాపత్రయం అతనిది. అదో కీర్తి దాహం! అదొక ఆనందం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గిత్తల పోటీలు ఎక్కడ జరిగినా, ఎంత దూరమైనా వెళ్తాడు. శ్రీకాకుళం నుంచీ చిత్తూరు వరకూ, ఖమ్మం నుంచీ కరీంనగర్‌, నిజామాబాద్‌ వరకూ ఎక్కడ పోటీలు జరిగినా, ప్రత్యేక వాహనంలో తన కోడెల్ని తీసుకుపోతాడు. పోటీలో నిలుపుతాడు. బహుమతి కోసం పోటీపడతాడు. చాలాసార్లు బహుమతితో బహు ఆనందంతో తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కోడెగిత్తల దగ్గర పదేళ్లనుంచీ పనిచేస్తున్నాడు ఇసాకు. పందెం గిత్తల్ని మేపడం చాలా ఖర్చుతో కూడిన విషయం. తక్కువగా అనుకున్నా వాటి తిండికీ, పోషణకీ, సంరక్షణకీ నెలకి 60, 70 వేల రూపాయలకి పైనే అవుతుంది.
ఒక కోడెదూడకి రోజూ అరకేజీ జీడిపప్పు, అరకేజీ బాదం పప్పు, రెండు కిలోల బెల్లం, నాలుగు కొబ్బరికాయలు, ఐదు కిలోల గానుగ చెక్క, ఐదు కిలోల ఉలవ గుగ్గిళ్లు దాణాగా పెట్టాలి. ఎంత వేసవి కాలంలో కూడా వాటికి పచ్చి మేత తప్పనిసరి. అదీ మెత్తని లేత మేత. ఇకరోజూ కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆముదం వీటిలో ఒక నూనెతో వాటికి వళ్లంతా మాలిష్‌ చేయాలి. ఇవన్నీ ఇష్టంగా చేసేవాడు ఇసాకు.
జనార్ధన్‌కి వారసత్వంగా వచ్చిన 60 ఎకరాల పొలం వుంది. అది బంగారం పండే పొలం. 30 ఎకరాలు అరటి, నిమ్మ, దానిమ్మ తోటలు వున్నాయి. టౌన్‌లో ఎరువులు, పురుగు మందుల వ్యాపారం వుంది. ఎంత పొలం వున్నా, ఎన్ని వ్యాపారాలు వున్నా అంతకు మించిన లోభితనం వుంది. ఇసాక్‌కి అతి తక్కువ జీతం ఇస్తాడు.
'అదేంది సామీ! ఆడ మడిసి కూలికి పోయి రోజూ రెండు వందలు తెచ్చుకుంటంది. నాకు అంత కూడా ఇయ్యకపోతే ఎట్ట సామీ! ఈ గిత్తల్ని మేపడం, పోటీలకి పోవడం అంటే నాకూ బెమే! ఆ బెమతో పనిచేస్తన్నానని, జీతం ఇంత తక్కువ ఇస్తే ఎట్ట? కలుపుకి ఆడోళ్లకి ఎంత కూలి ఇస్తన్నారో అంత ఇయ్యి సామీ!' అని అడుగుతున్నాడు ఇసాకు. ఇప్పుడు కాదు.. రెండేళ్లుగా అడుగుతూనే వున్నాడు.
'ఏం ఇయ్యమంటావురా? గిత్తల తిండికి రోజూ ఎంత ఖర్చవుతుంది? వాటి తిండికి ఖర్చుపెట్టీ, నీకు జీతం పెంచీ ఎక్కడ చావమంటావురా? నిజానికి ఈ కోడె దూడల వల్ల నాకు ఏమైనా ఆదాయం వుందీ, చేతి చమురు వదిలిచ్చుకోవడమే తప్ప! వీటి గుండా నేను ఎంత నష్టపోతున్నానో, ఎంత డబ్బు పోగొట్టుకుంటన్నానో నీకు తెలియదంట్రా?' అన్నాడు.
'నిజమే సామీ, నేను కూడా బతకాలిగా? నేనేం జీతం ఎక్కువియ్యమని అడగటం లేదుగా? ఆడపిల్ల కలుపుకి పోయి ఎంత తెచ్చుకుంటందో అంత ఇయ్యమంటన్నా సామీ! అంత కంటే ఎక్కువ అడగటంలేదు. నేను నేయంగానే అడుగుతున్నా కానీ అన్నేయంగా అడుగుతున్నానా?'
'సరే చూద్దాంలేరా' అంటూ కాలం జరుపుకుంటూ వస్తున్నాడు జనార్ధన్‌. ఇసాకు ఒక్కడే కాదు, ఆయన తండ్రీ, తాత ముత్తాతల నుంచీ వాళ్ల కుటుంబంలో ఆడోళ్లూ, మొగోళ్లూ, పిల్లా జెల్లా అందరూ కూడా జనార్ధన్‌ వాళ్ల తండ్రీ, తాత ముత్తాతల పనుల్లోనే వుండేవాళ్లు. జనార్ధన్‌ వాళ్ల పొలాల్లో వాళ్ల కుటుంబం కంటే ఇసాకు తండ్రి ఆదాం, తాత ఎంకడు, ముత్తాత అంకడు వాళ్లే ఎక్కువ చాకిరీ చేశారు. ఈ కుటుంబాల్లోని ఆడవాళ్లూ, పిల్లల్తో సహా వీళ్లే ఎక్కువ స్వేదం వాళ్ల పొలంలో చిందించారు. పనులు చేస్తూ కొడవలి తెగో, గడ్డపార గుచ్చుకునో, పొరపాటున గొడ్డలి తగిలో వీళ్ల రుధిరమే వాళ్ల పొలంలో ఎక్కువ చిందింది. వీళ్ల శ్రమతో జనార్ధన్‌ వాళ్ల తాత కాలం నుంచీ క్రమంగా ఎకరాలు ఎకరాలు పొలాలు కొన్నారు. లక్షలు సంపాదించారు. మేడల మీద మేడలు కట్టారు. సౌఖ్యమైన, సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. దేనికీ లోటు లేదు.
తరతరాలుగా, వంశ పారంపర్యంగా చాకిరీ చేస్తున్న ఇసాకు వాళ్లకి అన్నింటికీ లోటే! వాళ్ల పేదరికం అలాగే వుంది. వాళ్ల పూరి గుడిసెలు అలాగే వున్నాయి. వాళ్ల తాతలు గోచి పాతలు పెట్టుకుంటే, ఈనాడు మనవలు చొక్కాలూ, లుంగీలూ కట్టుకునే స్థితికి ఎదిగారు. అంతే! ఈనాటికి కూడా వాళ్లకి కూలీకి పోతేనే కుండ కాలడం, లేకుంటే కడుపు కాలడమే!
ఇసాకు కొడుకులు తమ ఇంటి ఆసాములైన జనార్ధన్‌ వాళ్ల పనులు కాదని, బేల్దారి పనులకు పోవడం మొదలుపెట్టారు. జనార్ధన్‌కి ఎంత అత్యవసరమైన పని వున్నా, బతిమాలినా వాళ్లు రావడం లేదు. అందరూ ఇచ్చేటంత కూలీ ఇవ్వడు. తక్కువ ఇస్తాడు. అదేమంటే దబాయిస్తాడు. అందుకే వాళ్లు ఈయన పనికి రావడం మానుకున్నారు. తను పిలిచినా పనికి రాకపోవడంతో ఇసాకు కొడుకులంటే జనార్ధన్‌ మండిపడుతున్నాడు. కొడుకులకి నచ్చజెప్పలేని ఇసాకు అంటే కూడా జనార్ధన్‌కి కోపంగా వుంది.
జనార్ధన్‌కి 35 ఏళ్లు. బాగా బలంగా, పుష్టిగా వుంటాడు. మంచి తిండి తింటాడు. ఇసాకుకు 56 ఏళ్లు. బలహీనంగా, గాలికి పడిపోయేలా వుంటాడు. జీవితంలో మంచి ఆహారం తిన్న రోజులు అతి తక్కువ. సరైన ఆహారం ఎప్పుడూ లేదు. తన కంటే వయసులో దాదాపు 20 ఏళ్లు పెద్ద అయినా ఇసాకుని 'ఒరే' అనే పిలుస్తాడు జనార్ధన్‌. రెండేళ్ల నుంచీ తను జీతం పెంచమని అడుగుతున్నా 'చూద్దాం లేరా, చూద్దాం లేరా' అనే మాటలు వినీ వినీ విసుగు పుట్టడంతో చివరకి ఇసాకు అన్నాడు.
'వచ్చే నెల నుంచీ నేను పని మానుకుంటా సామీ! మరీ ఇంత తక్కువ జీతానికి చేసేది ఏంది? అని మా పిల్లలు కూడా కోప్పడతన్నారు.'
'ముందుగానే చెప్పడం మంచిది కదా సామీ! వచ్చేనెల నుంచీ ఎవర్నో ఒకర్ని మాట్టాడుకొండి. నే మానుకుంటా!'
ఆ మాటలకి జనార్ధన్‌ నివ్వెరపోయాడు.
ఒక్క క్షణం మనసులో ముల్లు పెట్టి పొడిచినట్లయింది. ఇసాకు నమ్మకస్తుడు. కపటం లేదు. కోడెల్ని సొంత బిడ్డలుగానే భావిస్తాడు. వాటిని ఎంతో అపురూపంగా సంరక్షణ చేస్తున్నాడు. వేళకి మేత వేయడం, దాణా పెట్టడం, మాలిష్‌ చేయడంలాంటి పనులు ఎంతో ఇష్టంగా చేస్తాడు. వాటికి బాగా మాలిమి అయ్యాడు. వీడు మానుకుంటే తనకి ఇబ్బందే! ఇంత తక్కువ జీతానికి ఎవడూ దొరకడు. దొరికినా, ఇంత బాగా వాటిని చూసుకోవడం కష్టం! ఈ కోడెలు తన ప్రాణంలో ప్రాణం! ఇప్పటికి నాలుగు పందేలకి వెళ్లి, నాలుగు చోట్లా మొదటి బహుమతి కొట్టుకొచ్చిన గిత్తలు. బండ లాగుడు పందేల్లో వీటికి పోటీ ఇచ్చేవి ఎక్కడా లేవు. అంత గొప్పవి!
'సరే, ఎంత ఇమ్మంటావురా ?' ఆలోచనల నుంచి తేరుకుని అడిగాడు జనార్ధన్‌ .
'నెలకి పదివేలు ఇయ్యండి సామీ'
'ఏందిరోరు! ఒకేసారిగా అంత పెంచమంటా? నీ కొడుకులు నేర్పేరా ఏంరా అతి తెలివి? ఇప్పుడు ఐదు ఇస్తున్నా కదా! ఆరేలు ఇస్తా. అంతేకానీ ఒకేసారి రెట్టింపు జీతం పెంచుతార్రా ఎవురన్నా? ఇది లోకంలో ఎక్కడైనా వుందీ? అయినా నువ్వు ఏం పని చేస్తున్నావురా? వాటికి మేత వేయడం, దాణా పెట్టడమే కదా? ఎంత పనీ, ఏం పనీ! ఎప్పుడూ కూచొని వుంటమే కదరా! ఏందో పెద్ద విరగపడి చేసినట్టు మాట్లాడుతున్నావ్‌!'
'కాదులే సామీ! రోజుకి మూడు వందల లెక్కన నెలకి తొమ్మిదేలు ఇస్తే వుంటా! లేకపోతే నా తంటాలెయ్యో నే పడతా, మీ తంటాలెయ్యో మీరు పడండి!'
'చివరగా చెపుతున్నారా! ఏడు వేలు ఇస్తా. అంతకంటే రూపాయి కూడా ఎక్కువ ఇయ్యను. ఈ గిత్తల మీద నాకు పది రూపాయల ఆదాయం వుంటే.. పోనీలే, పనోడు కనిపెట్టుకుని వున్నాడని నువ్వు అడిగినట్టు ఇద్దును. నాకు వాటి మీద ఒక్క రూపాయి ఏమన్నా వస్తందీ? ఏదో అదొక పిచ్చితోనో, ఎర్రితోనో పెంచుకోవడం తప్ప!'
'సరేలే సామీ! నెల మద్దెలో మానుకుని పోవటం ధర్మం కాదు. ఈ నెలాకరు దాకా వుంటా. వచ్చే నెల నుంచీ ఎవుర్నో ఒకర్ని చూసుకోండి!' తేల్చి చెప్పాడు ఇసాకు.
'నిన్ను అనుకుని లాభం లేదులేరా! కాలం మారిపోయింది. ఇయ్యాల పనోళ్లు ఎవురో, ఆసాములు ఎవురో! ఆసాములు అంటే ఎనకటి రోజుల్లో ఎంత భయ భక్తులతో వుండే వాళ్లూ! ఆసాముల్ని కనిపెట్టుకుని రేయింబొగుళ్ల చాకిరీ చేసే వాళ్లంట! ఆ రోజులు పోయినయి! మీ తాతలూ, మీ అయ్యా అందరూ మా మోచేతి కింద నీళ్లు తాగి బతికినోళ్లు! ఈ కాలం వాళ్లకి విశ్వాసం లేకుండాపోతంది! నువ్వు మానుకుంటానంటే నీ ఇష్టంరా! మాకు ఎవురోకరు దొరక్కుండా పోతారా? లోకం గొడ్డు పోలేదుగా? నేను మాత్రం ఏడేలు కంటే ఎక్కువ ఇయ్యను. నీ ఇష్టం ఇక!' అన్నాడు జనార్ధన్‌ .
మౌనంగా ఉన్నాడు ఇసాకు.
నెలాఖరు చివరి రోజు. పొద్దున్నే గిత్తలకి నీళ్లు తాపుతున్న ఇసాకు దగ్గరకి వచ్చి అడిగాడు జనార్ధన్‌.
'ఏరా ఇసాగ్గా! జీతం ఎవ్వారం ఏమనుకుంటున్నా?'
'అనుకునేది ఏముంది సామీ! మొన్ననే చెప్పానుగా! రేపుట్నించీ రాను'.
'ఆలోచించుకోరా! నువ్వా ఒంటి వూపిరోడివి! బరువులు ఎత్తలేవూ, గట్టి పనులు ఏం చేయలేవు! నోటి కాడ కూడు ఎందుకు పోగొట్టుకుంటావు? ఇక్కడే వుండ్రా!'
'కాదులే సామీ!'
విపరీతమైన కోపంతో పళ్లు నూరుకుంటూ వెళ్లిపోయాడు జనార్ధన్‌.
సాయంత్రం, రోజూ మాదిరిగానే గిత్తలకి ఉలవ గుగ్గిళ్లు పెడుతూ, 'ఇయ్యాల్టితో మీకూ నాకూ రుణం తీరిపోయిందే!' అని మనసులో అనుకుంటూ, ఒక గుప్పెడు గుగ్గిళ్లు నోట్లోపోసుకుని నములుతున్నాడు ఇసాకు. ఇంతలో వచ్చాడు జనార్ధన్‌.
'ఏరా నా కొడకా! గిత్తలకి పెట్టాల్సిన గుగ్గిళ్లు నువ్వు తింటున్నావా?' అంటూ వాటి ముందు కూచొని, వాటికి తినిపిస్తున్న ఇసాకుని కాలితో ఒక్క తన్ను తన్నాడు జనార్ధన్‌.
ఇసాకు దూరంగా పోయి, పడ్డాడు.
'ఏంది సామీ! నాలుగు గింజలు నోట్లో యేసుకుంటే తంతావా?'
'తన్నక! గిత్తలకి పెట్టే గుగ్గిళ్లు నువ్వు తింటావా? మీరు బాగా మదం పట్టి కొట్టుకుంటన్నార్రా!' అంటూ అక్కడే వున్న చర్నాకోల తీసుకుని, కొట్టడం మొదలు పెట్టాడు.
ఇసాకు అసలే బలహీనుడు. ఆ దెబ్బలకి స్పృహ తప్పి, పడిపోయాడు. ఇసాకు పడిపోయాడనీ, వచ్చి తీసుకుపొమ్మనీ వాళ్ల ఇంటికి కబురు చేశాడు జనార్ధన్‌. భార్య ఏడుస్తూనూ, ఇద్దరు కొడుకులు ఆందోళనతోనూ వచ్చారు. ఇసాకు మాటా పలుకూ లేకుండా పడిపోయి వున్నాడు.
'పశువులకు వున్న విలువ విశ్వాసంగా పని చేసే మనుషులకి లేకపోయెనే' అని ఇసాకు భార్య ఏడుస్తోంది. ఇసాకుని ఆస్పత్రికి తీసుకుపోయారు. ఆస్పత్రిలో రెండు రోజులు వున్నాడు. కోలుకున్న తరువాత, జరిగిన విషయం కొడుకులకీ, భార్యకీ చెప్పాడు.
'వాడు ఆసామి అయితే ఎవుడికి ఎక్కువ? లక్షల డబ్బూ, ఆస్తులూ వున్నయ్యని తిడితే పడతామా, కొడితే వూరుకుంటామా? వాడికి వుంటే నాలుగు సార్లు తినమనూ, పది సార్లు పొమ్మనూ! అంతే కానీ కొడతాడూ! పోలీసు కేసు పెట్టాల్సిందే!' అన్నాడు చిన్న కొడుకు.
'తొందరపడవాకురా! కేసు పెడితే ఏమయిద్ది? వాడేం తక్కువ తిన్నాడూ! వాడూ మన మీద కేసు పెడతాడు, దొంగతనం చేసామనో, దోపిడీ చేసామనో! పోలీసులు వచ్చి మనల్నే తీసకపోయి, లోపలేస్తారు. డబ్బూ, పలుకుబడి ముందు మనం సరితూగుతామా? ఊళ్లో ఇసుంటి కేసులు ఎన్ని చూడలేదూ! మనకి దమ్ముంటే దెబ్బకి దెబ్బ తీయడమే!' అన్నాడు పెద్ద కొడుకు.
తరువాత రెండు రోజులకి ఇసాకు కొడుకులు ఇద్దరూ అర్ధరాత్రి జనార్ధన్‌ పశువుల షెడ్‌కి వెళ్లారు. షెడ్‌లో కట్టు కొయ్యలకి కట్టేసి వున్న గిత్తల పలుపు తాళ్లని విప్పారు. బానిసల్లా ఎప్పుడూ కట్టుకొయ్యలకి కట్టేసి వుండే గిత్తలు స్వేచ్ఛ లభించడంతో ఎటో వెళ్లిపోయాయి.

మొలకలపల్లి కోటేశ్వరరావు
9989 224 280