మనదేశ జాతీయ ఫలం మామిడి. మండువేసవిలో మహా మధురాన్ని పంచిపెట్టే మామిడి పండ్లంటే ఇష్టం లేనివారుండరంటే అతిశయోక్తి కాదు. వీటిలో ఇప్పటికే వందలాది రకాలు ఉండగా, ఇంకా ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మనం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని సరికొత్త మామిళ్ళు ఇప్పుడు కడియం విరివన క్షేత్రాల్లో కొలువు దీరుతున్నాయి. సాంకేతిక శాలల్లో కొత్తగా ఊపిరి పోసుకున్నవి కొన్నైతే.. విదేశాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ పునరుత్పత్తి చేస్తున్న రకాలు మరికొన్ని. మన నేలపై తొలిసారిగా మొగ్గ తొడిగి, ఫలప్రదమై ఈ నవీన మావిళ్ళు గురించి తెలుసుకుందాం.
రెడ్ ఐవరీ..
సన్నగా, పొడవుగా, పింక్ రంగులో.. నాజూగ్గా, చూడ్డానికి ఎంతో ఆకర్షణగా ఉండే మామిడి రెడ్ ఐవరీ. ఈ పళ్ళ సుందరిని స్థానిక రైతులు 'ఇలియానా మామిడి' అని పిలుస్తున్నారు. లోపల గుజ్జులో పీచు పదార్థం తక్కువ ఉండటం దీని విశేషం. పండు చాలా తియ్యగా ఉంటుంది. ఒక్కొక్క కాయ దాదాపు కిలో బరువు ఉంటుంది. పింక్ రంగులో ధగధగా మెరిసే ఈ ఫలాలు మొక్క నాటిన రెండో ఏడాదికే కాపునిస్తుంది. నాలుగు లేదా ఐదు అడుగుల ఎత్తు చెట్టుకే నిండుగా కాయలు కాస్తుంది. కాయలు చక్కగా కాడలతో కిందకు వేలాడుతూ చెట్టు కూడా భలే అందంగా ఉంటుంది. చిన్న పిల్లలు చేతులకు సైతం ఈ పండ్లు చక్కగా అందుతాయి. పండు చెట్టు నుంచి కోసిన తర్వాతా పదిహేను రోజుల వరకూ నిల్వ ఉంటుంది. పెను గాలులను సైతం తట్టుకొని, కాయలు రాలకుండా ఉండటం దీని ఘనత. చిన్ని చెట్టుకే 200 వరకూ కాయలు కాస్తుంది. దాదాపు ఎలాంటి నేలలోనైనా ఈ మొక్క బాగానే పెరుగుతుంది. సమానంగా నీటి తడులు అవసరము. సరికొత్త మొక్కలు దేశంలోనే అరుదైనవని వీటిని పెంచుతున్న కడియం శ్రీ సాయి రాఘవేంద్ర నర్సరీ రైతు మార్ని నారాయణరావు చెప్పారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి సాగు చేస్తున్నామని, థాయిలాండ్‌లో ఒక్కో పండు రూ 400కి విక్రయిస్తుంటారన్నారు.
అమెరికన్ పోలీమర్..
కాయ రంగు, ఆకారం, రుచి ఈ మామిడి అన్నీ వింతే. నీలం రంగుపై లేత బూడిద రంగు పొర ఉంటుంది. కాయలు గుండ్రంగా నిగనిగలాడుతూ ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు పులుపు, మగ్గితే తేనెలొలుకు తీపి ఈ మామిడి ప్రత్యేకత. పీచు పదార్థం, షుగర్ కూడా ఎక్కువ పాళ్ళలోనే ఉంటుంది. ఎర్రమట్టి నేలల్లో బాగా కాస్తాయి. సరి సమానంగా నీటి తడి అవసరం. ఇది కూడా నాటిన మూడేళ్లలో కాపుకొస్తుంది. విదేశాల్లో దీనికి మంచి గిరాకీ ఉంది. ఇది అమెరికా జాతి అయినప్పటికీ ఇజ్రాయెల్లో ఈ మొక్కలు ఎక్కువగా తోటలు వేసి, సాగు చేస్తున్నారు.
బనానా మామిడి..
ఇది గమ్మత్తయిన మామిడి. సన్నగా, పొడవుగా ఉంటుంది. అరటి పండ్లలా నిలువుగా తొక్క వలుచుకుని, చక్కగా తినొవచ్చు. మధురమైన రుచి దీని ప్రత్యేకత. దీన్ని మనదేశంలో 'మహాజన్' అని కూడా పిలుస్తున్నారు. ఇందులోని ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు రంగు కాయలు కాసే మొక్కల రకాలున్నాయి. ఇది అత్యాధునిక రకం. మొక్కనాటిన రెండున్నర ఏళ్ళకే ఫలసాయం అందుతుంది. ఇది కూడా నాలుగు, ఐదు అడుగుల ఎత్తులో కాయలు కాస్తుంది. వీటిని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. పీచు పదార్థం కాస్త తక్కువగా ఉంటుంది. లోపల టెంక చాలా సన్నగా ఉంటుంది. ఈ కాయ కూడా గాలికి రాలదు. గుజ్జు ఎక్కువగా ఉండటంతో విదేశాల్లో జ్యూస్‌కి ఉపయోగిస్తారు.
అన్నీ నేలల్లో పెరిగే ఈ మొక్కలను తోటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 250 నుంచి 350 వరకు మొక్కలు పడతాయి. కాయలు చక్కగా పక్వానికి రావడానికి, చీడపీడల నుండి తట్టుకోవడానికి పేపర్ కవర్లు తొలగితే మంచిది.
నొమ్ డోకమై..
ఎన్నో సుగుణాల సుందరి నొమ్ డోకమై. పండు మేలిమి ఛాయతో ధగధగా మెరిసిపోతోంది. ఒక్కొక్క కాయ అర కిలో వరకూ బరువు ఉంటుంది. పండు తియ్యగా ఉన్నప్పటికీ ఇందులో గ్లూకోజ్ శాతం తక్కువ. షుగర్ పేషెంట్లకు కూడా తొక్కతో సహా హాయిగా తినొచ్చట. కేకుల్లా ముక్కలు కోసుకుని తిన్నా మధురమే ఈ పండు. గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. ఒక్కో గుత్తులో ఒకటి నుంచి 15 వరకూ కాయలు ఉంటాయి. ఐదడుగుల ఎత్తులోనే ఈ మధురఫలాలు కాస్తాయి. మన దేశవాళీ పళ్ల కంటే నెల ముందుగానే ఈ మామిడి కాపుకొస్తుంది. భారీ గాలులు కూడా తట్టుకొని, కాయలు రాలిపోకుండా ఉంటాయి. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అధిక లాభాలు గల తోటలుగానూ సాగు చేసుకోవచ్చు. ఏ నేలలో అయినా పెరుగుతాయి. ఎర్రమట్టి నేలల్లో అయితే ఇంకా బాగా పెరుగుతుంది. ఇది కూడా పండు పాడవ్వకుండా పది పదిహేను రోజుల వరకూ నిలవ ఉంటుంది. జ్యూస్ చేసుకోవడానికి ఈ పండు చాలా బాగుంటుంది.