
అదే పనిగా సెల్ మోగుతుంటే తీసి 'హలో' అంది వసుప్రియ. 'వసూ! నేనే.. సమన్వితని. అదేంటే మీ ఆయన అడ్డంగా అలా దొరికిపోయాడు? అయినా అలాంటివాడిని కట్టుకున్నావేమిటే? ఇంతకీ ఈ సంబంధం కుదిర్చిన వారెవరే? ఇన్నేళ్ళ నీ కాపురంలో నువ్వు ఆ మాత్రం పోల్చలేకపోయావా? ఇంత తక్కువ కాలంలోనే అంతలా సంపాయించాడా?' అని ఏదేదో వాగుతుంటే ఒక పట్టాన బోధపడలేదు.
'షటప్! నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?' గట్టిగా అరిచింది వసుప్రియ.
'తెలివిలో ఉండే మాట్లాడుతున్నాను. ఇంతకాలం రాజభోగాలలో తేలిపోతూ సంసారం చేశాననుకుంటున్న నిన్ను నేనడగాలి.. అంత తెలివితప్పి ఎలా అతనితో ఉన్నావని?'
'నీకేమైనా పిచ్చా? మా ఆయన బంగారం. ఆయన్ని పల్లెత్తుమాటంటే ఊరుకునేది లేదు..' హెచ్చరించింది.
'ఇంతదాకా కూడబెట్టుకున్న బంగారం, ఇతర ఆస్తులను కూడా పట్టుకున్నారు.. నీకంతగా అనుమానమైతే ఒకసారి టివీ చూడు. నీ మొగుడు బంగారమో.. ఇత్తడో..' ఎద్దేవా చేస్తూ ఫోన్ కట్ చేసింది సమన్విత.
గబగబ టివీ ఆన్ చేసిన వసుప్రియ ఒక్కసారిగా స్క్రోలింగ్ చూసి మ్రాన్పడిపోయింది. సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టడంతో అవినీతి అధికారులు అతని ఇంటిపై అదాటుగా దాడి చేసి, సోదా నిర్వహించారు. రెండు కేజీలపైగా బంగారం, అరవై లక్షల పైచిలుకు నగదు, భూములు కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు.. అన్నింటినీ వెలికితీశారు. మరో ఛానల్‌లో దృశ్యాలను పదేపదే చూపిస్తున్నారు. నిజానికి తను పుట్టింటికి రావడం ఇదంతా జరగడం కలలోలాగ ఉంది. తన బెడ్‌రూంలో.. పరుపుల లోపల.. నగదు కట్టలు దాచి ఉంచాడా? అంటే ఇంతకాలం తను భర్త సరసన పడుకున్నది.. ఆ అవినీతి సొమ్ము పైనా? దేవుడి పటం వెనుక గూటిలో కొన్ని నగలను కూడా బయటికి తీస్తున్నారు. అయ్యో! ఎంత ఘోరం! ఈ పాపపు సొమ్ముకా తను పూజలు చేసింది? అరె ఇల్లంతా పాపసంచితమైందా? తన భర్త ఇంతకాలం తనని కాలు కందనీయకుండా ఐశ్వర్యంతో తులతూగేలాగ పోషిస్తున్నాడని మురిసిపోయిందే తప్ప, ఇంత దారుణంగా ఒక పాము పడగ కింద గడిపినట్టు కించిత్తయినా పోల్చలేకపోయింది.
'ఏమైందమ్మా? అలా ఒక్కసారిగా నీరుగారిపోయావేమిటి?' అన్నాడు తండ్రి భానుప్రకాశం ఆతృతగా.
'తల్లీ! ఏంటమ్మా అలాగైపోయావు?' తల్లి రూపవతి దగ్గరకొచ్చి, భుజం కదుపుతూ అడిగింది.
జవాబుగా టి.వి.వైపు చూపించింది వసుప్రియ. వారిద్దరి దృష్టి అటువైపు మళ్ళింది.
'అదేంటి..! అల్లుడు ఇలాంటివాడా? ఇంత ఘోరంగా అవినీతికి పాల్పడతాడని ఏకోశానా అనుకోలేదు. బంధువులంతా మంచివాడని, పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడంటే మురిసిపోయి, పెళ్ళి చేశాను..' బరువుగా నిట్టూర్చాడు భానుప్రకాశం.
ఈ విషయంలో తల్లిదండ్రులను తప్పుపట్టడానికి కూడా వీల్లేదు. తమ కూతురికి పెళ్ళి కావాలనే తలంపుతో పెళ్ళి కొడుకుల వెతుకులాటలో ఇతగాడు దొరికాడు. ఏ వ్యక్తినీ బైట చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేరెవరూ! ఒక్కసారిగా మనసంతా అతలాకుతలం అయిపోయింది వసుప్రియకు. భర్తతో ఇంతకాలమై అంటకాగిన తనే పోల్చలేకపోయింది అతని వ్యవహారాలేవో.. దందాలేవో.. ఎప్పుడూ తనకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడనుకుందే తప్ప, ఇలాంటివాడని అస్సలు పోల్చుకోలేకపోయింది. తనని ఎప్పటికప్పుడు పుట్టింటికి పంపిస్తున్నాడని సంబరపడిందే తప్ప, తను లేని సమయంలో అంతా చక్కబెడుతున్నాడేమోనని ఇప్పుడనిపిస్తోంది.
ఇంతకాలం భర్త రూపంలో ఉన్న ఒక అవినీతిపరుడితోనా నేను కాపురం చేసింది?
'ఈ డైమండ్ నెక్లెస్ నీ మెడకి ఎంత బాగా నప్పిందో తెలుసా? దీని ఖరీదు అక్షరాలా ఆరు లక్షలు..' అని పుట్టినరోజున తన మెడలో అలంకరిస్తుంటే మురిసిపోయానే తప్ప, ఆ సొమ్ము అతనికెలా వచ్చిందో ఒక్కసారి కూడా ఆలోచించలేదే..? 'నీకోసం అద్భుతమైన విల్లా కొన్నానన్నప్పుడు, ఏదో లోన్ పెట్టి కొన్నాడేమో అనుకున్నానే తప్ప అంత డబ్బు ఎక్కడిదనే ఆలోచనే రాలేదే నాకు. జీతంతోనే ఇంత జల్సా జీవితం సాధ్యమా? అని ఒక్కనాడైనా ఆలోచించిన పాపాన పోలేదు.. గుడ్డిగా నమ్మేశానతనిని..
'అయ్యా! భానుప్రకాశం గారూ!' అంటూ లోపలికి ఎవరో వచ్చి పిలిచేదాకా ఎవరికీ బుర్రలు పనిచేయలేదు.
ఎదురింటి ఏకాంబరం గారు.. 'అయ్యా! మరోలాగ అనుకోకండి.. ఇప్పుడే టివీలో చూశాను. అవినీతి అధికారులకి దొరికింది మీ అల్లుడే కదూ? ఇంతకాలం పరువుగా బ్రతికిన మీకు ఎంత చెడ్డ పేరు తెచ్చాడండీ! ఒక్క పైసా ఇతరులకి ఇవ్వాల్సి ఉన్నా మరుక్షణం పిలిచి మరీ ఇచ్చేసే మీకు అలాంటివాడు అల్లుడు కావడం చాలా దురదృష్టం. ఈ రోజుల్లో ఎవరూ సదాచారులు కారుగానీ.. మనమే ఏ పనికావాలన్నా లంచం ఇవ్వాలని చూస్తాం.. అయినా ఇంతలా మరీనా? అడ్డగోలుగా సంపాదించింది మనసుకి ఏం సంతోషాన్నిస్తుంది చెప్పండి?' అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు.
భానుప్రకాశం నోటంట ఒక్క మాట రాలేదు. తన అల్లుడు అలాంటి వాడు కాదనీ అనలేడు.. అలాంటివాడేననీ అనలేడు.. అలాంటి విచికిత్స స్థితి.. రూపవతి కూడా కిమ్మనలేదు.
'అయ్యా! దేనికైనా యోగం! దాన్ని ఎవరూ తప్పించలేరు..' అని ఎవరూ మాట్లాడకపోవడంతో లేచి వెళ్ళిపోయాడు ఏకాంబరం.
మీడియా అదే పనిగా తమకు మేత దొరికినట్టు హర్షవర్ధన్ మొత్తం పూర్వాపరాలను బట్టబయలు చేస్తోంది. ఇల్లంతటినీ కెమెరాలో బంధిస్తూ, అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల దృశ్యాలను పదేపదే చూపిస్తోంది .. బాబు తరుణ్ ఆడుకునే టెడ్డీబేర్, ఇతర ఆటబొమ్మల్లోనూ ఉన్న నగలు పైకి లాగారు. అంటే తన బిడ్డ ఆడుకున్నది అవినీతి మూటగట్టుకున్న ఆటబొమ్మలతోనా? ఛీ! ఎంత ఘోరం? తన సంసార జీవితం ఇంత మాయపొరలతో నిండిపోయి ఉన్నదా ఇంతకాలం?
భానుప్రకాశానికి మేనమామ మౌళి నుండి ఫోన్ 'ఒరే! భానూ! నీ అల్లుడేంట్రా.. అంత బరితెగించాడు..? ఇంతకాలం ఏదో గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వాడని నువ్వు చెబుతుంటే.. కామోసు అనుకున్నాను. మొదట్లో నేనొక సంబంధం తెస్తే ప్రైవేటు ఉద్యోగం వాడని, వాళ్ళకి బంధుగణంలో ఎక్కువగా పేరులేదంటూ ఎద్దేవా చేశావు. కానీ ఇప్పుడు.. కొరివితో తల గోక్కున్నట్లయింది కదరా! మీ అల్లుడికేంగానీ.. నీకు బుర్ర మీద వెంట్రుక లుండవు.. ఇలా జరిగాక సమాజంలో ఎంత చిన్నచూపు? నీ కూతురు భవిష్యత్తును గంగలో కలిపినట్లైంది' అని తూర్పారబట్టి, అసలు ఏ జవాబు ఆశించకుండానే ఫోన్ పెట్టేశాడు.
అదేసమయంలో పక్కింటి వనజాక్షి వచ్చింది. 'ఏమే వసూ! ఇప్పుడు అందరి నోటా నీ భర్త గురించే! నిజానికి నువ్వు అతన్ని కళ్ళేలతో కట్టి బిగించలేదు. కనీసం అతనేంచేస్తున్నాడో.. అంత డబ్బు ఎలా వస్తోందోనని కూడా ఆలోచించలేదు.. ఇప్పుడు చూశావా.. ఊబిలో కూరుకుపోయావ్! ఎంత తాళి కట్టినా.. అలాంటివాడితో ఎలా కాపురం చేస్తావు? అని ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న సంధిస్తూ నిలదీస్తుంటే వసుప్రియ మల్లగుల్లాలు పడింది. నిలదీయడం అనేకంటే తనని ఒక ఆలోచనలో పడేసిందనటం సమంజసం.
వనజాక్షి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా గమనించలేదు. తల్లి, తండ్రి మొహాన నెత్తుటి చుక్క లేదు. టివీలో భర్తను అరెస్ట్ చేసి, తీసుకెళ్తున్న దృశ్యాలను చూపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అతని వెనుక ఎందరు ఉన్నారో గుట్టు విప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మీడియా ఊదరగొడుతోంది వార్తలతో.. అదే సమయంలో తలుపు చప్పుడు.. బైట నుండి ఎవరో అధికారులమంటూ లోపలికొచ్చారు.
'నమస్కారం.. మేం ఎ.సి.బి. అధికారులం.. హర్షవర్ధన్ అవినీతితో సంపాదించిన ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. ఆ ప్రయత్నంలో బంధువుల ఇళ్ళన్నీ సోదా చేస్తున్నాం.. అందులో భాగంగా మీ ఇంటిని కూడా తనిఖీ చేయాలి..' అని గుర్తింపు కార్డులు చూపించి, ఇల్లంతా తిరగతోడారు.
ఎక్కడా ఏమీ దొరకలేదు వాళ్ళకి. వెళ్ళబోతున్న ఆఫీసర్లతో 'సార్! ఈ గొలుసు, గాజులు, ఉంగరాలు ఆయన చేయించినవే.. తీసుకెళ్ళండి..' అని వెంటనే వాటిని తీసి ఇచ్చింది వసుప్రియ.
ఏవో కాగితాలపైన భానుప్రకాశం సంతకం పెట్టాక వాళ్ళు కదిలారు. ఇది జరిగిన పావుగంటలోనే విలేకర్లు హడావుడిగా ప్రవేశించారు. 'హర్షవర్ధన్ మీకు తాళి కట్టిన భర్త కదా! అతనిపైన ఏనాడూ మీకు అనుమానం రాలేదా? లేక వచ్చినా.. మీకు అన్నీ సమకూరుతున్నాయి కదానీ.. అతని అవినీతిని సమర్ధించారా?' ఒక టివీ యాంకర్ ఆడిగాడు.
దానికి సమాధానంగా 'మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సంపాదనలు, వ్యవహారాలు నాకు అసలు తెలీదు. ఆయన అటువంటి వారని కలలో కూడా ఊహించలేదు' అంది వసుప్రియ.
'ఈ పరిస్థితిలో మీ భర్త తప్పును మన్నించగలరా? శిక్ష పడిన అతన్ని మీ జీవితంలోకి ఆహ్వానించగలరా?' మరో విలేకరి ప్రశ్న.
'ఆయనతో ఇంతవరకూ సాగించిన జీవితం పూలపానుపు అనుకున్న నాకు అది విషసర్పంతో సహవాసమని తెలిసింది. న్యాయస్థానం విధించే శిక్ష గురించి నేను ఆలోచించను. నేను ఆయన నుండి విడిపోడానికే నిర్ణయించుకున్నాను' అంది స్థిరంగా వసుప్రియ.
'ఏ స్త్రీ అయినా తన భర్త ఎంతటి నీచుడైనా క్షమించి, అక్కున చేర్చుకుంటుంది. అలాంటిది మీరు మాత్రం అతన్ని క్షమించకుండా, కనీసం కలవకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం సాహసం కాదా?' తిరిగి ప్రశ్న.
'అయినప్పటికీ నా నిర్ణయంలో మార్పు లేదు. సంఘంలో గౌరవమర్యాదలు కోల్పోయిన కళంకితుడైన వ్యక్తిని నా భర్త అని చెప్పుకోడానికే సిగ్గుపడుతున్నాను. మళ్ళీ అతని సాహచర్యమా? లేదు. మరిక అతనితో కలసి ఉండే జీవితానికి స్వస్తి పలుకుతున్నాను. ఇక విడాకులకే సిధ్ధపడుతున్నాను..' స్థిరంగా చెబుతున్న ఆమెను విభ్రాంతిగా చూశారు విలేకరులు.
'అమ్మా! నువ్వు..!' అర్ధోక్తిలో ఆగిపోయారు భానుప్రకాశం.
'ఇదే నా నిర్ణయం నాన్నా.. కలో గంజో తాగి, మీ పంచన పడుంటాను తప్ప, ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదు. ఒకవేళ మీకు కూడా కష్టమైతే నేను ఏ కూలోనాలో చేసుకుని, నా బిడ్డతో వేరేగా బ్రతుకుతాను'
'అబ్బ! మీ నిర్ణయం అమోఘం! ఇంతవరకూ దుర్మార్గుడైన భర్తను క్షమించి, మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించిన మహిళలనే చూశాం. ఇంతటి కఠోర నిర్ణయాన్ని సాహసంతో తీసుకున్న స్త్రీని మొట్టమొదటిసారిగా మిమ్మల్నే చూస్తున్నాం' అభినందనలతో ముంచెత్తారు విలేకరులు.
మరో పావుగంటలోనే ఇదంతా అన్ని టీవీ ఛానళ్ళలో ప్రసారమైంది. 'అవినీతి భర్తకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన ఇల్లాలు.. ఆమె సాహస నిర్ణయం స్త్రీ జాతికే గర్వకారణం.. తాళి కట్టిన భర్త అవినీతిపరుడని తెలిసిన మరుక్షణం విడాకులకి సిధ్ధమైన సాహస వనిత..!' ఇలా ఎన్నో రకాలుగా విశ్లేషిస్తూ మీడియా తమ వార్తలను రకరకాల కోణాలలో చూపించ సాగింది.
శ్రీశ్రీశ్రీ
'బాబూ! ఇంతదాకా నేను చెప్పిన కథ సాహసానికి సంబంధించినదే!' అన్నారాయన.
'ఏ అధికారి అయినా డబ్బు యావతో అధిక ఆర్జనకోసం వెంపర్లాడి, తన భవిష్యత్తును నాశనం చేసుకున్న యదార్థగాథను కళ్ళకు కట్టినట్లు చెప్పారు' అన్నాన్నేను.
రోజూ ఏదో సమయంలో ఎదురింట్లో ఉన్న ముసలాయనను ఒకసారి పలకరించి, ఏవో కబుర్లు చెప్పడం నా దినచర్యలో ఓ భాగమైంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలిదుగానీ, ఏడాది నుంచి ఇక్కడే ఉంటున్నారు.
'అంతేకాదు బాబూ! ఒక మనిషి అత్యాశ అతని బ్రతుకును ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందో చూడు.. అతనికి ప్రభుత్వం విధించిన శిక్షలు ఉద్యోగంలోంచి తీసేయడం.. పదేళ్ళ జైలుశిక్ష.. వీటన్నింటి కంటే ఘోరమైనది.. అతనికి విడాకులిచ్చి దూరమైపోవడమనే భార్య తీసుకున్న సాహస నిర్ణయం. ఆ తరువాత ఏ బంధువు ఇంటికి వెళ్ళినా మొహం మీదనే తలుపేయడం మొదలెట్టారు. కన్నవాళ్ళు కూడా అసహ్యించుకొని, గుమ్మం ఎక్కనీయలేదు. చేతిలో చిన్నమెత్తు సంపాదన లేక ఒక మెట్టు దిగి, కూలికి వెళితే అక్కడ చేతగాని పనితనం వెటకరించింది. కష్టపడని ఫలితం శరీరం ముసలితనానికి చేరువై, లొంగిపోయింది. బుధ్ధి గడ్డితిని చేసిన వెధవపనికి అతను తనను తాను నిందించుకుంటూనే విడాకులిచ్చిన భార్య దగ్గరకే వెళ్ళి, కాళ్ళపైన పడినా తృణీకరించి, వెళ్ళగొట్టింది. అలా చివరికి తననెవరూ ఎరుగని ఒక పల్లెటూరుకి చేరి, ముసలితనంలో ఒంటరివాడై నానా అగచాట్లు పడ్డాడాయన..'
'ఒక పొరపాటుకి ఉద్యోగపరంగానే కాక కుటుంబపరంగా కూడా అతనికి శిక్ష పడటం అతనికే కాదు.. సంఘంలో అవినీతికి పాల్పడాలని చూసేవాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావచ్చు. అలాంటి మనిషికి ఎంతటి ఘోరమైన శిక్ష అయినా తక్కువే! స్త్రీ ఎంతగా అభిమానిస్తుందో.. ద్వేషం కలిగితే అంతలా శిక్షిస్తుందనడానికి.. మీరు చెప్పిన కథ ఒక చక్కని ఉదాహరణ..' అన్నాను.
'ఆ ఉదాహరణకు నేపథ్యం నాదే బాబూ!'
'మీదా?.. అంటే..?!'
'ఆ నికృష్టుడెవరో కాదు.. ఆ సివిల్ ఇంజనీర్ హర్షవర్ధన్.. నేనే బాబూ..' చెప్పలేక తలదించుకున్నాడాయన.
కె.కె.రఘునందన
9705411897