May 10,2023 07:29

        ప్రజాస్వామ్యం, పౌరస్వేచ్ఛ, పౌరహక్కుల గురించి ప్రపంచానికి నిత్యం సుద్ధులు చెప్పే అమెరికాలో ప్రజల జీవించే హక్కు ప్రమాదంలో పడింది. టెక్సాస్‌లో ఇటీవల ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదిమందిలో తెలుగు యువతి ఐశ్వర్య కూడా ఉండటం బాధాకరం.
        ప్రపంచ జనాభాలో అమెరికా వాటా ఐదు శాతం. కానీ, ప్రపంచంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గరుండే తుపాకుల్లో సగభాగం ఆ దేశంలోనే ఉంటాయి. ఏటా ఉన్మాదులు తుపాకులతో రెచ్చిపోతున్న ఘటనల్లో మూడో వంతు అమెరికాలోనే చోటుచేసుకుంటున్నాయి. కాల్పుల ఘటనల్లో మరణిస్తున్న వారినీ, తుపాకులతో కాల్చుకున్న వారిని కలిపి లెక్కిస్తే ఏటా 40,620 మంది ప్రాణాలు కోల్పోతున్నారని గత ఏడాది ఒక నివేదిక తెలిపింది. అంటే రోజూ సగటున 110 మంది తుపాకులకు ప్రాణాలు కోల్పోతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్‌ మాల్స్‌లో ఎటువైపు నుంచి ఏ ఉన్మాది కాల్చుచంపుతాడో, ఏ టీనేజర్‌ గుళ్ల వర్షం కురిపిస్తాడో అన్న ఆందోళనలోనే జనం బిక్కుబిక్కుమని గడపాలి. ఈ ఏడాది ఇప్పటివరకూ 202 మాస్‌ షూటింగ్‌ ఘటనలు జరిగాయి. తొలి మూడు నెలల్లోనే కాల్పుల వల్ల ఏడు వేలమందికిపైగా మరణించారు. టెక్సాస్‌లోనే 41 ఘటనలు జరిగాయి. ఈ ప్రాంతంలో వలసదారులు ఎక్కువగా ఉంటారు. ఇదే ప్రాంతంలోని పాఠశాలలో గత ఏడాది టీనేజర్‌ జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
        ఆయుధాలు నియంత్రించే చట్టం తేవాలని, ప్రమాదకర ఆయుధాలపై నిషేధం విధించాలని అమెరికా అధ్యక్షుడు తాజాగా కాంగ్రెస్‌ను కోరడం కంటితుడుపు చర్యే! ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక దేశంగా అమెరికా అవతరించడానికి ప్రధాన కారణం అక్కడి పెట్టుబడిదారుల అత్యాశ, శ్వేత జాతి దురహంకార వాదం. 2016లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, పలువురు రిపబ్లికన్‌ సెనెట్‌ అభ్యర్థులకు 50 మిలియన్‌ డాలర్లకుపైగా నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఖర్చు చేసింది. ప్రభుత్వాల విధానాలను, రాజకీయాలను తుపాకులే నిర్దేశిస్తుండటమే తుపాకుల సంస్కృతికి ఆజ్యం పోస్తోంది. గత ఏడాది వరుసగా వర్జీనియా, కొలరాడో, ఇల్లినాయిస్‌, టెక్సాస్‌, న్యూయార్క్‌, ఒక్లహామా తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా కాల్పుల ఘటనలు జరగడంతో తుపాకుల కొనుగోలుపై పరిమితస్థాయి సంస్కరణలు తీసుకురావాలని సెనెట్‌లో ఒప్పందం కుదిరింది. మూడు దశాబ్దాల్లో తొలిసారి ఈ అంశంపై చర్చ సాగుతుండగానే, న్యూయార్క్‌ తుపాకుల చట్టాన్ని కొట్టేస్తూ ఆత్మరక్షణ కోసం తుపాకులు కలిగి ఉండటం ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
          తుపాకీ ఉండటం ఆత్మరక్షణకు తప్పనిసరని, హోదాకు, గౌరవానికి చిహ్నమని ప్రజలు భావించేలా ఇక్కడి తుపాకీ పరిశ్రమ చేయగలిగింది. అమెరికాలో పౌరుల వద్ద 39 కోట్ల తుపాకులు చలామణిలో ఉన్నాయని, ప్రతి వందమంది పౌరుల వద్ద సగటున 120 తుపాకులు ఉన్నాయని 2018లో స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధనా సంస్థ పేర్కొంది. అమెరికాలో ఏ రాష్ట్రంలోనూ తుపాకుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన నిర్ధిష్ట వివరాలు లేవు. విచ్చలవిడిగా జరుగుతున్న కాల్పుల ఘటనలను నిరోధించడానికి పౌరుల వద్ద మరిన్ని తుపాకులు ఉండటమే పరిష్కారమని జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ ప్రచారం చేస్తోంది. బ్రిటన్‌, స్వీడన్‌, జర్మనీ, బెల్జియం, కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తుపాకులపై నియంత్రణ పెట్టినా అమెరికా బుద్ధి మారడం లేదు.
        మరోవైపు పేద, ధనిక అంతరాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. శ్వేత జాతి దురహంకారం, ఇతర మతాలు, విదేశీ వలసదారులు, నల్లజాతీయులపై ద్వేషం, డబ్బు సంపాదన ఒక్కటే జీవితం అని బోధించే పెట్టుబడిదారీతత్వం... ఇవన్నీ గన్‌ కల్చర్‌కు దోహదపడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆ దేశంలో ఇప్పటికీ పేదరికం, సామాజిక అసమానతలు, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న వారు, అశాంతితో ఉన్నవారు ఎందరో ఉన్నారు. నల్లజాతీయులు, మెక్సికన్లు, ఇస్తానియన్లు.. ఇలా ఎందరో అధ్వానమైన జీవితం గడుపుతున్నారు. అక్కడ చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్తున్న మన పౌరులు కూడా తూటాలకు బలవుతున్నారు. అమెరికన్‌ సమాజంలో తుపాకీ సంస్కృతిని తుదముట్టించాలి.