Aug 17,2023 22:10

- త్వరలో గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు
మొదటి మూడు ర్యాంకులు అమ్మాయిలకే
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ విడుదల చేశారు. వీటిలో మొదటి మూడు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. మొత్తం 11 శాఖలకు సంబంధించి 111 పోస్టులకు 110 మందిని ఎంపిక చేసినట్లు సవాంగ్‌ చెప్పారు. విజయవాడలోని ఎపిపిఎస్‌సి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఎ పొలిటికల్‌ సైన్స్‌ చదివిన భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష మొదటి ర్యాంకు సాధించారని తెలిపారు. జెఎన్‌టియు అనంతపూర్‌ నుంచి బిటెక్‌ చదివిన భూమిరెడ్డి పావని రెండవ ర్యాంకు, కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న మూడవ ర్యాంకు, కె ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి నాల్గవ ర్యాంకు పొందినట్లు తెలిపారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో బిఎ చదివిన భాను ప్రకాష్‌రెడ్డి ఐదో ర్యాంకు సాధించారని వివరించారు. స్పోర్ట్స్‌ కోటా నుంచి త్వరలో ఒకరిని ఎంపిక చేస్తామన్నారు . అత్యంత తక్కువ సమయంలో గ్రూప్‌ా1 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేశామని తెలిపారు. తప్పుడు సర్టిఫికెట్లతో మోసం చేయడానికి ప్రయత్నించిన ఒక అభ్యర్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కింద కేసు నమోదు చేశామన్నారు. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో గ్రూప్‌-1, 2 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రూప్‌ా2 సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు వివరించారు. మూడు పేపర్లుగా ఉన్న మెయిన్స్‌ను రెండు పేపర్లుగా చేస్తామన్నారు. త్వరలో 2020 అసిస్టెంట్‌ పోస్టులు, 220 యూనివర్సిటీ జెఎల్‌ పోస్టులకు నియామకాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎపిపిఎస్‌సి కార్యదర్శి జె ప్రదీప్‌ కుమార్‌, సభ్యులు ఎస్‌ సలాంబాబు, పి సుధీర్‌, బిఎస్‌ సెలీనా, సివి శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.