ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్రప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జివో 187ను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శనివారం విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో వెబ్‌కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ ఉంటుంది. కటాఫ్ తేదిగా 2022 ఆగస్టు 31గా ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఎలాంటి సర్వీస్ లేకపోయినా (సున్నా సర్వీస్) బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం మొదటి సారి కల్పించింది. 2024 ఆగస్టు 31లోపు పదవి విరమణ పొందే ఉపాధ్యాయులు బదిలీకి అనర్హులుగా పేర్కొంది. 2021లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. బదిలీల ప్రక్రియ మొత్తం 30 రోజుల్లో పూర్తికానుంది. ఈ నెల 12, 13 తేదిల్లో యాజమాన్యాలు వారీగా, సబ్జెక్టు, మీడియం వారీగా ఖాళీలను పాఠశాల విద్యాశాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది. 14 నుంచి 17వ తేది వరకు ఉపాధ్యాయులు బదిలీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 18,19 తేదిల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తారు. 20,21,22 తేదిల్లో సీనియార్టీ లిస్ట్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. 23,24 తేదిల్లో వీటిపై అభ్యంతరాలు తెలుపవచ్చు. 26వ తేదిన సీనియార్టీ తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 27 నుంచి జనవరి 1వ తేది వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ప్లేస్‌లు కేటాయించిన తుది జాబితాను జనవరి 2 నుంచి 10వ తేది వరకు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈ జాబితాపై ఏదైనా ఫిర్యాదులు వస్తే 11వ తేదిన పరిశీలిస్తారు. 12వ తేదిన బదిలీల ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. మున్సిపల్, గిరిజన ఉపాధ్యాయులకు బదిలీల షెడ్యూల్ విడిగా ఉంటుందని పేర్కొన్నారు.
అసంబద్ధమైన విధానాలు
ఉపాధ్యాయ బదిలీల్లో కొన్ని అసంబద్ధమైన నిబంధనలు తీసుకొచ్చారని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఉపాధ్యాయ పోస్టులను మిగులుగా చూపే అశాస్త్రీయమైన విధానాన్ని ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే మ్యాపింగ్ చేయడం, పోస్టులను మిగులుగా చూపడం జరిగిందని చెబుతున్నారు. 2021లో బదిలీ అయి రేషనలైజేషన్‌లో పోస్టు పోతున్న వారికి రేషనలైజేషన్ పాయింట్లను ప్రస్తావించలేదు. మ్యాపింగ్‌కు గురైతేనే అదనపు పాయింట్లు ఇవ్వడం, రేషనలైజేషన్‌కు గురైతే అదనపు పాయింట్లు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు స్పెషల్ పాయింట్లు ఉంటే ఇప్పుడు తొలగించారు. కండర క్షీణత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు, వినికిడి లోపం ఉన్నవారికి ప్రాధాన్యత తొలగించడం జరిగింది. పోస్టులను బ్లాకు చేయడం కూడా సరైన పద్ధతి కాదని అంటున్నారు.
మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలి : ఎమ్మెల్సీ సాబ్జీ
మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు కూడా తక్షణమే విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డిమాండ్ చేశారు. కట్ ఆఫ్ తేదీని 2022 ఆగస్టు 31కు బదులు 2022 నవంబర్ 30గా ప్రకటించాలని ఒక ప్రకటనలో కోరారు. రేషనలైజేషన్ పాయింట్లు కేటాయింపులో పాఠశాలల విలీనమయిన ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా రేషనలైజేషన్ వ్లల ప్రభావితమయిన ఉపాధ్యాయులందరికీ 5 పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2021లో బదిలీలు కాబడి ప్రస్తుత రేషనలైజేషన్ గురవుతున్న ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు వర్తింప చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన సవరణ ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు.










