
గర్భవిచ్ఛిత్తి (అబార్షన్)పై సుప్రీంకోర్టు గురువారం నాడిచ్చిన సంచలన తీర్పు స్వాగతించదగింది. మహిళలందరికీ చట్టపరంగా సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని, వివాహితులు, అవివాహితులు అనే తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. 'వైవాహిక అత్యాచారం' కూడా అబార్షన్ పరిధి లోనే ఉంటుందని పేర్కొన్న ధర్మాసనం బలవంతపు గర్భధారణ నుండి స్త్రీలను కాపాడాల్సిన అవసరం ఉందంటూ మహిళా హక్కులకు గొప్ప దన్నునిచ్చింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ (ఎమ్‌టిపి) చట్టం ప్రకారం...అత్యాచారం నిర్వచనంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాలని కోర్టు తీర్పునివ్వడం మరో ముందడుగు. తద్వారా దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన వైవాహిక అత్యాచారంపై విచారణలకు మార్గం సుగమం చేసింది. ఒక మహిళ వైవాహిక స్థితి ఆమె అబార్షన్ హక్కుని హరించడానికి కారణం కాకూడదని, అవివాహిత మహిళలు కూడా 24 వారాల్లో అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అర్హులేనని, ఒంటరి లేదా అవివాహిత మహిళలను అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించకపోవడం ఆమె ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. అబార్షన్ చట్టాల ప్రకారం.. వివాహిత, అవివాహిత మహిళల మధ్య వ్యత్యాసం కృత్రిమం, రాజ్యాంగం ప్రకారం నిలబడలేనిదని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ద్వారా సంతానోత్పత్తి విషయంలో మహిళల నిర్ణయాధికారాన్ని గుర్తించినట్టయింది.
అత్యాచార బాధితులు, మైనర్లు, వివాహితులు, మానసిక సమస్యలతో బాధ పడుతున్నవారు, పిండం సరిగా అభివృద్ధి చెందని ఘటనల్లో 24 వారాల వరకు మహిళలు అబార్షన్ చేయించుకోవచ్చునని ఎమ్‌టిపి చట్టం పేర్కొంది. అవివాహితులు తమ సమ్మతితో గర్భం దాల్చితే 20 వారాల వరకు మాత్రమే అబార్షన్ చేయించుకునే వీలుండగా తాజా తీర్పుతో అది 24 వారాలకు పెరిగింది. 2021లో సవరించిన అబార్షన్ చట్టం నిబంధనలలో భర్త అనే పదానికి బదులుగా భాగస్వామి అనే పదాన్ని చేర్చినందున అబార్షన్ పరిస్థితిని కేవలం వైవాహిక సంబంధానికి మాత్రమే పరిమితం చేయాలని పార్లమెంటు భావించడం లేదని ధర్మాసనం పేర్కొంది. చట్టాలను వర్తింపజేయడం, అలాగే వాటిని చేసే పార్లమెంటు, అసెంబ్లీల నిజ ఉద్దేశాన్ని గురించి భాష్యం చెప్పడం ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాల ప్రధాన కర్తవ్యం. ఈ తీర్పు ద్వారా జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని ధర్మాసనం తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిందని భావించవచ్చు. అంతేగాక చట్టాలు, నిబంధనలు ఎప్పుడూ స్థిరంగా వుండవనీ సామాజిక వాస్తవాలకు అనుగుణంగా అవి మారుతుంటాయనీ ఒక విశ్వజనీన సత్యాన్ని వక్కాణించడం శ్లాఘనీయం.
'అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే కలయిక అనీ, భర్తతోనూ లైంగిక వేధింపులు ఎదుర్కొనవచ్చునని, భర్త వేధింపులవల్ల లొంగిపోక తప్పని స్థితి ఏర్పడవచ్చు'నంటూ ఆచరణాత్మక అంశాలను ధర్మాసనం పేర్కొంది. పురుషాధిక్య సమాజంలో దురన్యాయాలకు పాల్పడుతున్నవారికి ఈ తీర్పు చెంపపెట్టు వంటిది. అబార్షన్ హక్కు విషయంలో వైవాహిక స్థితికి సంబంధించి తలెత్తిన సమస్యను పరిష్కరించాలని కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఛాందస భావాలను పెంచి పోషించడమే తన విధానంగా గల ప్రస్తుత ప్రభుత్వం అంత సాఫీగా పరిష్కరిస్తుందని ఆశించడం కష్టమే! అయితే, న్యాయస్థానాలు చేసిన సూచనలను సైతం ప్రభుత్వాలు ఆదేశాలుగా భావించాలన్న సంప్రదాయాన్ని నమ్మే ఈ దేశంలో సుప్రీం ఆదేశాన్ని అమలు చేయకుండా మోడీ సర్కారు మొండికేస్తే ప్రజాగ్రహాన్ని చవి చూడక తప్పదు. ఏది ఏమైనా మహిళా హక్కుల ఉద్యమాలకు ఈ తీర్పు విశేష మద్దతు కల్పిస్తుంది. సమాజంలో సగభాగంగా వున్న మహిళల హక్కుల ముందడుగుకు ఇతోధికంగా తోడ్పడుతుంది. అయితే, 'న స్త్రీ స్వాతంత్య్రమర్హతి' అన్న మనువాదాన్ని రాజ్యాంగంగా రూపొందించాలని వాదించే ఛాందస శక్తుల పాలనలో ఇటువంటివాటిని సాధించుకోడానికి మరిన్ని పోరాటాలు సాగించడం అవసరమని ప్రగతికాముకులు సదా గుర్తుంచుకోవాలి.