అనగనగా ఒక చికెన్‌షాపు. అక్కడ కిందపడిన మాంసపు ముక్కను చిన్ని కుక్కపిల్ల తింటోంది. ఇది చూసిన దుకాణం యజమాని దానిపైకి దుడ్డుకర్ర విసిరాడు. అది దాని నడుమ్మీద బలంగా తగిలి,. కుక్కుపిల్ల కురుకురుమని చాలాసేపు బాధతో ఏడ్చింది. పాపం మూల్గుతూ ఓ మూలన బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. దాని అందమైన నల్లని అమాయకపు కళ్లు కన్నీళ్లొలికాయి. దానికి అమ్మ ఉండేది. కానీ ఇప్పుడు లేదు. ఐదు రోజుల కిందటే లారీ ఢకొీని చనిపోయింది. అప్పట్నుంచీ ఆ బుజ్జి కుక్కపిల్ల నా అన్నవారు లేక ఇలా ఒంటరైపోయింది. ఇదిగో ఇప్పుడు చికెన్‌షాపు యజమాని కొట్టిన దెబ్బకి ఇలా ఏడుస్తోంది.
ఆ చికెన్ దుకాణం దగ్గరే ఒక ఆవు కొంతకాలంగా ఉంటోంది. ఆ ఆవు.. బుజ్జి కుక్కపిల్ల పడుతున్న అవస్థను గమనించింది. దగ్గరకు వెళ్లి, తన తోకతో కుక్కపిల్లను ప్రేమగా నిమిరింది. కుక్కపిల్ల బెదిరిపోయింది.
దాంతో ఆవు 'ఏం భయపడకు బుజ్జీ.. దెబ్బ గట్టిగా తగిలిందా?' 'ఏం ఫర్వాలేదు. తగ్గిపోతుందిలే ఏడవకు' అంటూ తన నాలుకతో దాన్ని నిమురుతూ ఓదార్చింది.
ఆ రోజు నుంచి కుక్కపిల్ల, ఆవు మంచి స్నేహితులయ్యాయి.
చికెన్ షాపు యజమాని కుక్కపిల్లను చూస్తే చాలు కర్ర పట్టుకుని బయలుదేరే వాడు. ఆవును మాత్రం ఏమీ అనేవాడు కాదు. దీంతో ఆవు చికెన్‌షాపు వద్దే నెమ్మదిగా కూర్చొని, కాపుకాసి.. అక్కడే కిందపడిన మాంసపు తునకలను నోటితో పట్టుకొని తెచ్చి, కుక్కపిల్లకు పెట్టేది. వాటిని కడుపు నిండా తిని, కుక్కపిల్ల ఆకలి తీర్చుకునేది.
ఆ పక్కనే ఓ పండ్ల దుకాణమూ ఉంది. దాని యజమాని ఆవుకు రోజూ భక్తితో రెండు అరటిపండ్లు ఆహారంగా వేసేవాడు. మరో పండు తినబోతే మాత్రం ఆవును దుడ్డుకర్రతో బాదేవాడు. ఆ రెండు అరటిపండ్లు దాని బారెడు పొట్టకు సరిపోక, ఆవు ఆకలితో అలమటించేది. కుక్కపిల్ల దీన్నంతా గమనించింది. అది పండ్ల దుకాణం వద్దే నక్కినక్కి, నెమ్మదిగా కింద దొర్లి పడిన పండ్లను, మిగిలిపోయిన అరటి పండ్లను, జామ, దానిమ్మలాంటి ఇతర పండ్ల ఆకులను ఏరి, ఆవుకు తెచ్చిపెట్టేది. ఆవు వాటిని తిని ఆకలి తీర్చుకునేది. ఇలా ఆవు, కుక్కపిల్ల ఎంతో స్నేహంగా జీవించసాగాయి.
ఒకరోజు కుక్కపిల్ల కోసం ఆవు చికెన్ ముక్కను తీసుకు వెళ్ళడాన్ని ఓ పావురం చూసి ఆవు వద్దకు వచ్చింది.
'అదేంటి మిత్రమా! ఇంత అపచారం చేస్తున్నావు? మీ గోజాతికే తలవంపులు తెచ్చేలా, కుక్కతోపాటు చికెన్ తింటున్నావు' అని అడిగింది.
'మిత్రమా.. నేను దీన్ని తినలేను, నాకు అలవాటు లేదు కదా! ఇది మా బుజ్జి కుక్కపిల్లకు. అయినా దీన్ని తింటే అపచారం ఏముంది?' అని అడిగింది ఆవు.
'నువ్వు తినకపోయినా సరే. మాంసాన్ని నువ్వు నోట కరుచుకోవడం కూడా పెద్దతప్పు' అంది పావురం.
'మరి ఈ కుక్కపిల్ల నాకు రోజూ పండ్లు, ఆకులు తెచ్చిపెడుతుంది. అవేవీ దాని ఆహారం కాదు కదా! మరి అదీ తప్పు చేస్తోందా?' అని అడిగింది ఆవు.
'ఆకులు, పళ్లు వేరు. చికెన్ వేరు' అంది పావురం.
'ఎందుకు వేర్వేరు? అదీ ఆహారమే, ఇదీ ఆహారమే కదా!' అంది ఆవు.
'మాంసం నీచు. మేం తింటాం. కానీ మీ గోవులు తినవు కదా!' అంది పావురం.
'అలాగా! అయితే అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ ఆకుకూరల తోటలు చూడు. వాటిని వారు ప్రేమతో పెంచుతున్నారా? ఆ మొక్కలను హాయిగా చివరివరకు బతకనిస్తారా- లేదు కదా!? ఈ రోజే కోసుకొని వెళ్లి, పప్పులో వేసుకొని ఉడికించి తినేస్తారు. ఆకులూ తినడానికే, మాంసమూ తినడానికే.. మరి ఒక ఆహారం గొప్ప, మరో ఆహారం నీచు ఎలా అవుతుంది మిత్రమా? ఆలోచించు' అన్నది ఆవు.
'ఎంత బాగా చెప్పావు.. నిజానికి నాదీ అదే భావన. కానీ నేను నీలా బయటకు మాట్లాడలేక ఊరుకున్నాను' అంది పావురం.
'చూడు మిత్రమా! ఈ ప్రకృతి మన అందరిదీ. ఇందులో ఎవరికి నచ్చినది వారు తినొచ్చు. ఒక జీవి బతకాలంటే వేరొక జీవిపైన ఆధార పడాల్సిందే! ఇది ప్రకృతి ధర్మం కదా. ఈ ధర్మానికి విరుద్ధంగా ఎవ్వరూ జీవించలేరు! ''ఇది గొప్ప, ఇది అథమం'' అంటూ తినే తిండిని సైతం విభజించి చూడడం అనాగరికం. మనుషుల్లో ఉన్న ఈ జబ్బు మనకూ పాకిందా? అని ఆవేదనగా ఉంది. అన్ని జంతువులూ, అందరి తిండీ సమానమే' అని కచ్చితంగా చెప్పింది ఆవు.
'ఓ పావురం మామా! నీకిష్టమైంది నువ్వు తిను. నాకు నచ్చింది నేను తింటాను. మా ఆవుకు నచ్చింది మా ఆవమ్మ తింటుంది' అని నవ్వుతూ ముద్దుముద్దుగా చెప్పింది బుజ్జి కుక్కపిల్ల.
'మీరు ఎంత చక్కగా మాట్లాడారూ! నిజంగా మీ ఇద్దరిదీ చాలా గొప్ప స్నేహం. ఇకపై నేనూ మీ జట్టుంటానే..' అని అడిగింది పావురం.
ఆవు సరేనంది. పావురం కూడా తమకు తోడైనందుకు కుక్కపిల్ల ఆనందంతో దాని ముందుకాళ్లు పైకెత్తి, తోకను వేగంగా ఆడిస్తూ గెంతులేసింది.
- ఎల్. శాంతి