Feb 17,2023 11:18

న్యూఢిల్లీ : అదాని కంపెనీల్లో అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్టన్‌తో స్వతంత్రంగా ఆడిటింగ్‌ చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అదాని గ్రూపు స్పష్టం చేసింది. అదాని గ్రూపు తీవ్ర ఎకౌంట్స్‌ అక్రమాలకు పాల్పడుతూ, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకుంటుందని హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో అదాని గ్రూపు లావాదేవీల ఆడిటింగ్‌కు ముందుకు వచ్చిందని.. దీంతో ఆ కంపెనీ తన పారదర్శకతను నిరూపించుకోనుందని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తమ సంస్థ ఎలాంటి విషయాలను దాచి పెట్టలేదని... ఆర్‌బిఐ ఇతర రెగ్యూలేటరీ సంస్థలకు తమ పారదర్శకతను నిరూపించుకోవడానికి అదాని గ్రూపు సిద్ద పడిందని రిపోర్టులు వచ్చాయి. దీనిపై అదాని గ్రూపు గురువారం బిఎస్‌ఇకి వివరణ ఇస్తూ.. అలాంటిదేమీ లేదని తోసిపుచ్చింది. తాము ఎలాంటి ఆడిట్‌ సంస్థనూ నియమించుకోలేదని స్పష్టం చేసింది. అదంతా మర్కెట్‌ పుకార్లని తెలిపింది. తమ లావాదేవీలను ఎప్పటిలానే సెబీతో పంచుకుంటామని తెలిపింది.
 

                                                                డిబి పవర్‌తో తెగిన ఒప్పందం

హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో అదాని కంపెనీలతో పలు విదేశీ సంస్థలు ఇప్పటికే తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. తాజాగా డిబి పవర్‌కు చెందిన థర్మల్‌ విద్యుత్‌ ఆస్తుల కొనుగోలుకు అదానీ పవర్‌ 2022 ఆగస్టులో కుదుర్చుకొన్న ఒప్పందం సమయం ముగిసింది. ఒప్పందంలో నిర్ణయించిన తేదీ నాటికి లావాదేవీ పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. రూ.7,017 కోట్ల విలువ చేసే ఈ ఒప్పందాన్ని 2022 అక్టోబర్‌ 31 నాటికి పూర్తి చేసుకోవాల్సి ఉంది. తర్వాత ఈ గడువును నాలుగు విడతలు పొడిగించి 2023 ఫిబ్రవరి 15 వరకు పెంచినప్పటికీ.. ఈ గడువు ముగియడంతో ఒప్పందం రద్దు అయ్యింది.