Jul 10,2022 16:59

ఇల్లు విడిచి చాలారోజులు అయిపోయింది !
బహుశా 'నాన్నమ్మ' చనిపోయే ఉంటుంది !
నాకూ బాగా గుర్తూ
'ఉమ్మడి కుటుంబం' మాయమైపోయినా
చాలా రోజులు ఏదో గదిలో
ఓ మూల మంచమేసుకుని
ఉండే నాన్నమ్మ
ఏమైపోయిందో ఇప్పుడు !
తెలసిన ప్రతి గడపలోనూ
వెతికి వెతికి
నిరాశతో వెనుదిరిగాను !
బహుశా నాన్నమ్మ చనిపోయే ఉంటుంది !
నాన్నని కన్న అమ్మ కదా
నాన్న మనసు ఎంత నొచ్చుకుంటుందో !
ఎక్కడుందో, ఎటు పోయిందో
కాసింత చోటివ్వలేకపోయానని !
ఊరు ఊరు అంతా వెతికాను
ఏ వీధిలోనూ కనబడడం లేదు !
బహుశా 'నాన్నమ్మ' చనిపోయే ఉంటుంది !
'నాన్నమ్మ ' ఆనవాలు చెబుతూ
కనిపించిన ప్రతి వృద్ధురాలనీ
కదిపి కదిపి అడిగాను !
నేను అమ్మమ్మని అనో అనాథననో
వారు బదులిస్తూ ఉన్నప్పుడు
వాళ్ళ కళ్ళల్లోనూ నీరే చూశాను !
ఇక వెతకడం వృథా అనిపిస్తుంది
బహుశా నాన్నమ్మ
చనిపోయే ఉంటుంది !!
నీకు ఎప్పుడైనా ఎక్కడైనా
ఏ 'నాన్నమ్మ ' కనిపించినా చెప్పు !
ఆ నాన్నమ్మ కన్నకొడుకుని
నేనూ గట్టిగా కౌగిలించుకుంటాను !!!
 

- తిప్పాన హరిరెడ్డి
94938 32412