Oct 09,2022 09:52

'ఏవండోయ్‌  ! పదిగంటల పాసింజర్‌కి మనవడు రామం అమెరికా నుంచి వస్తున్నాడట.. మిమ్మల్ని రమ్మన్నాడు' ఉదయాన్నే పేపరు చదువుతున్న రఘురామయ్యకి కాఫీ అందిస్తూ చెప్పింది జానకీదేవి.
ఆ మాటలకు రఘురామయ్య ఆశ్చర్యపోయాడు. 'ఏమిటీ మనవడొస్తున్నాడా? అందులోనూ అమెరికా నుంచి, నీకేమైనా పిచ్చా.. ఏం మాట్లాడుతున్నావ్‌?' అన్నాడు రఘురామయ్య.
'నేను సరిగ్గానే చెప్పాను. ఇప్పుడే నాకు ఫోన్‌ చేసి చెప్పాడు. మీరు ఆలస్యం చెయ్యకుండా స్టేషన్‌కి జీపు తీసుకొని వెళ్లండి. లేకపోతే పిల్లాడు ఇబ్బంది పడిపోతాడు. ఈలోగా నేను ఆ గది అంతా సర్దుతాను. మీకేమిటీ నాకూ ఆశ్చర్యంగా ఉంది' కాఫీ గ్లాసు అందుకొంటూ చెప్పింది.
రఘురామయ్య వెంటనే రైతు సన్యాసిని పిలిచి, జీపుని బయటకు తియ్యమన్నాడు.
అరగంటలో స్టేషన్‌కి బయలుదేరాడు. వేదాగ్రహారం కొండ పక్కన ఏటి ఒడ్డున ఉండే చిన్న పల్లెటూరు. ఆ ఊరి రైల్వేస్టేషన్‌ ఆ ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరికి రఘురామయ్య మోతుబరి రైతే కాక సర్పంచ్‌ కూడా. వాళ్ల తాతలు దగ్గర్నుంచీ ఆ కుటుంబం వాళ్లే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు.
రఘురామయ్యకు ఇద్దరు పిల్లలు.. శ్రీనివాస్‌, సుజాత. పెద్దవాడు శ్రీనివాస్‌ డాక్టరు చదివి, పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిపోయి ఇప్పుడు డాక్టర్‌ శ్రీనివాసమూర్తి అయ్యాడు. అక్కడే ఒక తెలుగమ్మాయిని పెళ్లాడాడు. వాళ్ల కొడుకే రఘురాం. ఈ రోజు వస్తోంది వాడే.
ఎప్పుడో పదిహేనేళ్లనాడు కూతురు పెళ్లప్పుడు వచ్చాడు కొడుకు. ఆ తరువాత తాను ఎన్ని
ఉత్తరాలు రాసి, ఫోన్లు చేసినా వస్తాననేవాడు కానీ రావడం మాత్రం జరగలేదు.
కొడుకు కుటుంబం రాక కోసం ఆ వృద్ధ దంపతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సమయంలో మనవడు వస్తున్నాడన్న వార్త వాళ్లకి ఎంతో ఆనందాన్ని కలిగించింది.
రఘురామయ్య జీపు స్టేషన్‌కి చేరుకునేసరికి ఇంకా పాసింజర్‌ రాలేదు. ఆ స్టేషన్లో రోజూ రెండు పాసింజర్లే ఆగుతాయి. విశాఖపట్నం నుంచి వచ్చేవి, విశాఖపట్నం వెళ్లేవి.
ప్లాట్‌ఫారం నిండా మనుషులే. ఎక్కువగా కూలీలు. రోజూ పట్నానికి వెళుతుంటారు.
ఇంతలో పాసింజర్‌ వస్తున్నట్లు రెండో బెల్లు కొట్టారు.
ఓ ఐదు నిముషాల తరువాత పాసింజర్‌ వచ్చి ఆగింది.
రఘురామయ్య చెట్టు కింద నిలబడి, మనవడు ఏ బోగీలోంచి దిగుతాడో అని ఎదురుచూస్తున్నాడు.
ఇంతలో 'తాతా!' అన్న పిలుపు మధురంగా వినిపించింది రఘురామయ్యకి.
ఎదురుగా మనవడు రఘురాం.. ఒక్కసారిగా అతని శరీరం పులకరించింది. మొదటిసారి మనవణ్ణి చూస్తున్నాడు. ఎప్పుడూ వాడి ఫోటోలు చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడటం ఇప్పుడే.
ఒక్కసారిగా మనవడిని కౌగిలించుకొన్నాడు.
'తాతా! నేను వచ్చేశాను' అన్నాడు రఘురాం.
'చాలా సంతోషంరా రామం.. మీ నాన్న కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా వాడు రాలేదు. కనీసం నువ్వైనా వచ్చావు.. పద' అంటూ వాడి చెయ్యి పట్టుకొన్నాడు.
సన్యాసి అతని సూట్‌కేసుని పట్టుకొని, జీపు దగ్గరకు నడిచాడు.
'తాతా! మన ఊరు స్టేషన్‌ గురించి నాన్న ఎన్నోసార్లు చెప్పారు. నాన్న చదువుకున్నప్పుడు ఎన్నోసార్లు నడిచి, స్టేషన్‌కొచ్చీ పాసింజర్‌ ఎక్కేవారట' అన్నాడు రామం స్టేషన్‌ వైపు చూస్తూ..
'ఈ స్టేషన్‌ బ్రిటిష్‌ కాలం నాటిదిరా.. మా తాతగారు సర్పంచ్‌గా ఉన్న కాలంలో బ్రిటిష్‌ వాళ్లతో పోరాడి, దీన్ని కట్టించారట..' అన్నాడు రఘురామయ్య.
'గ్రేట్‌.. నాకు మన దేశం రావడం చాలా సంతోషంగా ఉంది. చాలారోజుల నుంచి రావాలనుకుంటున్నాను. కానీ నాన్న డిగ్రీ పూర్తయిన తరువాత వెళ్దువుగానిలే అంటూ ఇన్నాళ్లూ వెళ్లనివ్వలేదు. పద తాతా బయలుదేరదాం. నాకు మామ్మని తొందరగా చూడాలని ఉంది..' అన్నాడు జీవు వైపు నడుస్తూ..
కొద్దిసేపటికి జీపు బయలుదేరింది. రామం ముందు సీట్లో కూర్చున్నాడు.
చుట్టూ పచ్చటి పంట పొలాలు.. వాటి మీద ఎగురుతున్న కొంగలు.. అంత అందమైన ప్రకృతిని అతనెప్పుడూ చూడలేదు. పుట్టిన దగ్గర్నుంచీ కాంక్రీట్‌ అడవిలాంటి అమెరికాలోని పట్నంలో పెరిగిన రామానికి ఈ పల్లె సౌందర్యం చాలా అందంగా కనిపించసాగింది.
'తాతా! ఆ చేలు ఏమిటి?'
అవి వరి పొలాలు.. మనం తినే బియ్యం. వాటి ధాన్యంలోంచే వస్తుంది. అదే అమెరికాలో అయితే జొన్నలు ఎక్కువగా పండిస్తారు.' అన్నాడు రఘురామయ్య మనవడితో.
'తాతా! నాన్న పొలానికి వెళ్లేవాడా చిన్నప్పుడు?'
'వాడా.. వాడికెప్పుడూ చదువే.. పొలం అంటే ఇష్టం ఉండేది కాదు..'
ఇంతలో జీపు ఊరి పొలిమేరలోకి ప్రవేశించింది.. కొద్ది దూరంలో ఏరు కనిపించసాగింది..
'తాతా! అదేనా మన ఊరి ఏరు.. నాన్నగారు ఎప్పుడూ ఇందులోనే స్నానం చేసేవాళ్లం అనీ చెబుతుంటారు.. చాలా బాగుంది' అన్నాడు ఏటి వంక చూస్తూ.
'అవున్రా.. మన ఊరు ఇక్కడ కట్టడానికి కారణం ఈ ఏరే.. పూర్వం పల్లెలన్నీ నీటికి ఇబ్బంది ఉండదనీ ఏటి ఒడ్డునే కట్టేవారు' అన్నాడు మనవడితో.
ఇంతలో జీవు ఊళ్లో ప్రవేశించి, రఘురామయ్య ఇంటి ముందర ఆగింది.
ఆగిన మరుక్షణం జానకమ్మ పరుగున వచ్చి, మనవడిని ఇంట్లోకి తీసికెళ్లింది.
లోపలికెళ్లగానే వాడి బుగ్గలు రెండూ నొక్కి, ముద్దు పెట్టుకుంది.
'ఎన్నాళ్లకు ఈ మామ్మ గుర్తొచ్చిందిరా నీకు.. మీ నాన్నకు లేకపోయినా కనీసం నీకైనా చూడాలనిపించింది.' అంది మనవడితో.
'చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను మామ్మా. పరీక్షల వల్ల ఆలస్యం అయ్యింది' అన్నాడు.
వెంటనే పరుగు పరుగున ఇల్లంతా తిరగడం మొదలుపెట్టాడు. 'నాన్న చదువుకున్న గది ఏది?' జానకమ్మని అడిగాడు. ఆమె పక్క గదిలోకి తీసికెళ్లగానే ఆ గదిలోకి వెళ్లి చాలాసేపు దాన్ని చూస్తుండిపోయాడు.
'మామ్మా! నేను ఈ ఇల్లు చూడకపోయినా రోజూ నాన్న చెబుతుండేవాడు కాబట్టి నాకు ఇది కొత్తగా అనిపించటం లేదు. నాన్న స్నానం చేసిన నుయ్యి చూపించు' అన్నాడు జానకమ్మతో.
'పద.. పెరట్లో ఉంది!' అంటూ..'వాళ్ల నాన్న ఈ ఊరు రాకపోయినా పిల్లవాడికి అన్ని చెప్పాడంటే వాడికి మనమన్నా, ఈ ఊరన్నా ఎంతిష్టమో తెలుస్తోంది' అంది జానకమ్మ భర్తతో కళ్లు తుడుచుకుంటూ..
''జననీ జన్మభూమిశ్చ' అన్నారు... ఉన్న వూరు మీదా, కన్న తల్లిదండ్రుల మీద ఎవరికి ప్రేముండదు చెప్పు?' అన్నాడు రఘురామయ్య.
పెరడంతా మనవడు కలియ తిరుగుతూ చెట్టుచెట్టునీ అడుగుతూ వాటిని ముట్టుకొని, ఆనందిస్తున్న దృశ్యాలను రఘురామయ్య దంపతులు చూసి చాలా ఆనందించారు.
రఘురామయ్యకైతే తాతగారింటి మీద మనవడి మమకారానికి ఆశ్చర్యమేసింది.
ఆ రాత్రి కొడుకుతో రఘురామయ్య ఫోనులో మాట్లాడి, రామం తమను చూడటానికి వచ్చాడనీ చెప్పాడు.
'ఆ! నేనే పంపేను.. చాలారోజుల నుంచి మిమ్మల్నీ, మన ఊర్ని చూస్తాననీ గొడవ పెడుతున్నాడు.. మా ఇద్దరికీ శలవు సమస్య వల్ల కుదరటం లేదు. మొన్ననే వాడి చదువు పూర్తయ్యింది. అందుకనే వాడిని పంపేను. మీకు ఎంతసేపూ మీ ప్రేమలూ, అభిమానాలే కానీ మా సమస్యలు తెలియవు.. అవన్నీ సరే.. వాడిని నెల రోజులుంచుకొనీ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించక ఇక్కడికి పంపించెయ్యిండి. ఈలోగా వాడికి అడ్డమైన అలవాట్లను అలవాటు చెయ్యకండి. ఆ తరువాత మేము వాడితో ఇక్కడ పడలేము' అని చెప్పి, ఫోను పెట్టేశాడు కొడుకు శ్రీనివాస్‌ ఉరఫ్‌ డాక్టర్‌ శ్రీనివాసమూర్తి.
కొడుకు మారాడేమో అనీ అనుకున్నాడు కానీ, అతని మాటల వల్ల అది నిజం కాదని తెలుసుకున్నాడు.
మర్నాడు ఉదయాన్నే రామం ప్రత్యూషపు వేళ లేచి, తాతనీ, మామ్మనీ కూడా లేపి, తనతోపాటు ఏటికి తీసికెళ్లాడు.
ఆ తెల్లవారి ఝామున చల్లటి నీళ్లలో వాళ్లతోపాటు స్నానం చేసి, ఏటి ఒడ్డున శివాలయంలోని గుడి గంట శబ్దం చేస్తుంటే.. అలలు అలలుగా ఊరంతా వ్యాపించి.. రఘురామయ్య దంపతులకు అనిర్వచనీయమైన అనుభూతి కలగసాగింది.
రఘురామయ్య ఇంటికి వచ్చిన రైతులందరికీ మనవణ్ణి పరిచయం చేశాడు. వాళ్లు కొడుకూ, కోడలూ ఎందుకు రాలేదనీ ప్రశ్నిస్తుంటే మాత్రం మౌనం వహించాడు.. దానికి సమాధానం అతని దగ్గరలేదు.
ఆ రోజు నుంచి రామం రైతులతో కలిసి తమ పొలాలను చూడటానికి వెళ్లి, వాళ్లు చేస్తున్న వ్యవసాయ వివరాలను అడిగి తెలుసుకునేవాడు.
ఇంటికి వచ్చి తన సందేహాలను తాతతో పంచుకునేవాడు.
''తాతా! నీటి కోసం చెరువు మీద ఆధారపడ్డం ఎందుకు? ఒక నాలుగైదు ట్యూబ్‌ వెల్స్‌ వేస్తే ఆ సమస్య తీరుతుంది కదా.. రెండు సంవత్సరాలైంది నీళ్లులేక. పంటలు పండలేదని మన రైతు సన్యాసి చెబితే నాకు ఆశ్చర్యం వేసింది.' అన్నాడు.
'మన ఊరికి బోర్లు పడవురా.. చాలా రోజుల క్రితం ప్రయత్నించారు మావాళ్లు.. వందడుగులు వెళ్లినా నీరు పడలేదు' అన్నాడు.
'తాతా! వందకాక పోతే 150 అడుగుల్లో పడతాయి. అదీకాక ఒక మూల పడకపోతే ఇంకో మూల పడతాయి. నేను ఈ రోజే పట్నం వెళ్లి, బోరు వాళ్లతో మాట్లాడతాను' అన్నాడు.
ఆ మర్నాడే బోరింగ్‌ రిగ్‌ వచ్చి రఘురామయ్య పొలంలో మూడు చోట్ల బోరింగ్‌ని తవ్వితే 150 అడుగులకు నీరు పడింది. ఆరోజే ట్యూబ్‌ వెల్స్‌ని బిగించారు. ఇక పొలానికి ఆ మూడింటితో ఒకటే నీరు.. ఆ మూడు బోరింగుల వల్ల మొత్తం యాభై ఎకరాలకు నీరు సమృద్ధిగా అందడంతో ఆకు మళ్లు తయారుచేసి, ఆకు పోశారు.
ఎప్పుడైతే రఘురామయ్య పొలంలో నీళ్లు పడ్డాయో ఊరి వాళ్లంతా బోర్లు తియ్యడం మొదలుపెట్టారు.
అలా పదిహేను రోజుల్లో ఊళ్లో వంద ట్యూబ్‌ వెల్స్‌ వెలిశాయి.
దాంతో రఘురామయ్య మనవడు రామం పేరు ఊరంతా మారుమోగిపోయింది.
రామం రైతు సన్యాసితో ఏ పొలంలో వరి వెయ్యాలో, చెఱకు ఎక్కడ వెయ్యాలో చెప్పి మొత్తం యాభై ఎకరాలను దున్నించి, పంటలని వేయించాడు. నీటికైతే కొరత లేదు.. బోరింగ్‌ల దగ్గర మూడు షెడ్లు కట్టించి, మొక్కలు వేశాడు.
ఒక రోజు రాత్రి రామం తాత దగ్గరకు వచ్చి 'తాతా! నువ్వు సర్పంచ్‌వి కదా.. మన ఊళ్లో ఐదెకరాల లోపు పేదరైతులు చాలామంది ఉన్నారు. వాళ్లు ట్యూబ్‌ వెల్స్‌ వేయించుకోలేరు. నువ్వు మన ఎమ్మెల్యేతో మాట్లాడి, ఏటి నుంచి చెరువులకి కాలవల్ని తవ్విస్తే నీటి సమస్య తీరి, పేదవాళ్లందరూ బాగుపడతారు. కడుపు నిండా తిండి తింటారు.. ఆ పని చెయ్యొచ్చు కదా?' అనీ అన్నాడు.
'రామం.. నువ్వొచ్చీ అప్పుడే నెల రోజులైపోయింది. మీ నాన్న నిన్ను నెలరోజుల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా పంపించెయ్యమన్నాడు. ఇవాళో రేపో వెళ్లిపోయే నీకు ఇవన్నీ ఎందుకురా? నువ్వనుకున్నంత సులభంగా ఈ పనులన్నీ కావు. మేము పాతిక సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా, ఫలించటం లేదు. బోలెడు రాజకీయాలు. కాబట్టి ఈ ఊరి సమస్యల్లో తలదూర్చకుండా వెంటనే అమెరికాకి టికెట్‌ బుక్‌ చేసుకో.. లేకపోతే మీ నాన్న గొడవ పెడతాడు' అన్నాడు మనవడితో.
'తాతా! నేను అమెరికా తిరిగి వెళ్లిపోవడానికి ఇక్కడికి రాలేదు.. ఇక్కడ స్థిరంగా ఉండిపోవాలనే వచ్చాను. నాకు అమెరికాలో ఉండాలని లేదు. నేను ఇక్కడే ఉండి, వ్యవసాయం చేస్తూ ఈ ఊరిని అభివృద్ధి చేస్తాను. కాబట్టి నువ్వు ఇంక ఆ విషయం మాట్లాడకు. నేను రేపే సన్యాసిని తీసికెళ్లి, ఎమ్మెల్యేని కలిసి ఈ విషయం మాట్లాడుతాను' అన్నాడు రామం.
'రామం! నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? మీ అమ్మనాన్నలిద్దరూ అమెరికాలో స్థిరపడితే నువ్విక్కడ ఎలా ఉంటావు? దానికి వాళ్లు ఒప్పుకుంటారా? కొడుకు దగ్గర లేకపోతే ఎంత బాధో మాకు తెలుసు. ఆ బాధ మీ అమ్మానాన్నలకి కలిగించకు. అందుకే తక్షణం నువ్వు బయల్దేరు. నువ్వు మొండి పట్టుపట్టి, ఇక్కడే ఉంటానంటే మీ నాన్న నాకు శాశ్వతంగా దూరమవుతాడు' అన్నాడు కోపంగా.
ఆ రోజురాత్రి రఘురామయ్య కొడుకుతో ఈ విషయాన్ని ఫోన్‌ ద్వారా చెప్పేడు.

                                                          ***

వారం రోజుల తరువాత కొడుకు శ్రీనివాసమూర్తి అమెరికా నుంచి వచ్చాడు.
చెప్పా పెట్టకుండా వచ్చిన కొడుకుని చూడగానే ఆ దంపతులు మొదట ఆశ్చర్యపోయినా, ఈ కారణంగానైనా వచ్చినందుకు ఆనందించారు. మనవడు వెళ్లననీ పట్టుపట్టకపోతే ఈరోజు కొడుకు వచ్చి ఉండేవాడు కాదనిపించింది వాళ్లకి.
మధ్యాహ్నం ఒంటి గంటకు పొలం నుంచి వచ్చేడు రామం.
తండ్రిని ఇంటి దగ్గర చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీనివాసమూర్తి కొడుకువైపు కోపంగా చూశాడు.
గంట తరువాత భోజనాలు వడ్డించింది జానకమ్మ.
'ఏరా! నెల్లాళ్ల తరువాత తిరిగి వచ్చేస్తాననీ ఇక్కడికి వచ్చి రానంటావా? ఏ అభివృద్ధికీ నోచుకోని ఈ పల్లెలో ఎలా బతుకుదామనుకుంటున్నావు? స్వర్గంలాంటి అమెరికాని వదలి, ఏ సదుపాయాలూ లేని ఈ పల్లెలో ఉండటం అంత సులభమనుకుంటున్నావా? అయినా నువ్వు మాకు ఒక్కగా నొక్క కొడుకువి. అటువంటిది నువ్వు మమ్మల్ని వదలి ఇక్కడకొచ్చేస్తే మేమెందుకురా అక్కడ ఉండటం? నీ కోసం అహోరాత్రులు మేమిద్దరం కష్టపడటం' అన్నాడు.
'మీరెప్పుడైనా ఆలోచించారా? మీ అమ్మానాన్నల గురించి ఆలోచించని మీకు నేను జీవితాంతం మీ దగ్గరే ఉండాలనుకోవడం స్వార్థం కాదా? ప్రతీవాళ్లూ తమ స్వార్థం చూసుకుంటే తల్లితండ్రులను ఎవరు చూస్తారు చెప్పండి..?' అన్నాడు రామం తండ్రితో.
'నేను అమెరికాకి వెళ్లింది పేరు, డబ్బు తద్వారా మన కుటుంబం ఆర్థికంగా బాగుపడాలనీ.. నేనక్కడ సంపాదిస్తున్నాను కాబట్టే తాత మామ్మలిద్దరూ హాయిగా ఇక్కడ ఉన్నారు తెలుసా?' అన్నాడు కొడుకుతో.
'కొన్ని కోట్లు ఉన్నా కొడుకు లేకుండా బతకలేను అనీ నువ్వు బాధపడుతున్నట్లే తాత కూడా నీలాగే ముప్పై ఏళ్ల నుంచి బాధపడుతున్నాడు. వృద్ధాప్యంలో కన్నకొడుకు దగ్గర జీవితాన్ని గడపాలనే ప్రతీ తల్లీతండ్రీ కోరుకుంటారు. అందుకే నువ్వు చేసిన తప్పే నేను చేస్తున్నాను. ఇక్కడ నేను ఉంటే తాతవాళ్లకి నువ్వు లేని లోటు నా ద్వారా తీరుతుందని నా ఆశ. అయినా కేవలం డబ్బు కోసం మన తల్లితండ్రుల్ని, బంధువుల్ని, దేశాన్ని వదలి, అంత దూరం వెళ్లడం ఎంత తప్పో నిన్ను చూస్తే తెలుస్తుంది. కలో గంజో అందరూ కలిసి తాగడం మంచిపని. కొడుకు తమ దగ్గరే ఉన్నాడన్న భరోసా తల్లితండ్రులకు వృద్ధాప్యంలో ఎంతో ఆనందం కలిగిస్తుంది. కాబట్టి నేను నీతో రాను. నువ్వెళ్లిపో' అన్నాడు రామం.
రఘురామయ్యకు మనవడి మాటలు చెపులకు ఇంపుగా వినిపించాయి. కొడుకు తీర్చనిది ఈ రోజు మనవడు తీరుస్తున్నందుకు అతనికి చెప్పలేని ఆనందంగా ఉంది.
'నాన్నా! నేను నీకు దూరమయ్యానన్న కోపంతో ఇప్పుడు నా కొడుకుని నాకు కాకుండా చెయ్యడం తప్పు కాదా?' అన్నాడు తండ్రితో శ్రీనివాసమూర్తి.
'నాన్నా! ఇందులో తాత తప్పు అసలు లేదు. వసుధైక కుటుంబం అని చెప్పుకునే మనం ఈ రోజు దానికి తూట్లు పొడిచి, ఒంటరిగా బతుకుతూ మానవ సంబంధాలను తెంచుకుంటున్నాము. ఎంత డబ్బు సంపాదించినా ప్రేమను, ఆప్యాయతల్ని కొనలేము. వాటికోసమే నేనింత దూరం వచ్చాను. ఇంక నేను అక్కడికి రాను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. అమ్మకి ఈ విషయమే చెప్పండి' అంటూ మనసు గాయపడేలా మాట్లాడి, వెళ్లిపోతున్న కొడుకుని బాధతో చూశాడు శ్రీనివాసమూర్తి.
ఎంత చెప్పినా వినని కొడుకుని వదలి ఆ మర్నాడే అతను అమెరికా వెళ్లిపోయాడు.

                                                             ***

నెల రోజుల తరువాత..
ఒకరోజు ఉదయాన్నే రఘురామయ్య పేపరు చదువుకుంటున్నప్పుడు రామం వచ్చి 'తాతా! నేననుకున్నంత పనీ అయ్యింది. నాన్న, అమ్మ రేపు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇంక శాశ్వతంగా ఇక్కడే ఉంటారట' అని చెబుతుంటే రఘురామయ్య గాలిలో తేలిపోసాగాడు.
ఇంక ఆ మాటలు విన్న జానకమ్మకైతే ఆనందానికి అంతులేదు. మనవడిని గుండెలకు హత్తుకుని, ఆనందభాష్పాలు కురిపించింది.

గన్నవరపు నరసింహమూర్తి
94417 53974