ప్రజాశక్తి - యానాం (కాకినాడ) : యానాంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో పుదుచ్చేరి ప్రజాపనులశాఖ మంత్రి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. మంత్రి, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌తో పాటు ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్‌పి రఘునాయగంలు శాంతి కపోతాలను, త్రివర్ణ బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. పోలీసులు, హౌమ్ గార్డులు, ఆయా పాఠశాలలకు చెందిన స్కౌట్ దళాలు భారీ కవాతు నిర్వహించాయి. పలు పాఠశాలలు విద్యార్థులు వివిధ నృత్యాలను ప్రదర్శించారు. ఈ నృత్యాలు ఆద్యంతం అందరినీ అలరించాయి. ఉత్తమ కవాతు, నృత్య ప్రదర్శనలకు మంత్రి, ఎమ్మెల్యే బహుమతులు, మెమెంటోలు అందచేశారు. ముందుగా మంత్రి లక్ష్మీ నారాయణన్ స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. స్థానిక ప్రముఖులు,నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి ఆయన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే లయన్స్ క్లబ్ పిల్లరాయ యానాం, నెహ్రూ యువ కేంద్ర, రీజెన్సీ పబ్లిక్ స్కూల్, శ్రీ వేద, డ్రీమ్స్ తదితర పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.










