May 09,2023 17:35

ప్రజాశక్తి-కాకినాడ : రైతు భరోసా కేంద్రాల ద్వారా దాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్‌ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌, వల్లు రాజబాబు మాట్లాడుతూ.. మన జిల్లాలో ఈ రబీలో 1,62,000 ఎకరాలలో వరి సాగు జరిగిందని, సుమారు ఐదు లక్షల 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట గత పది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పంటలు బాగా పాడైనాయని, ఇప్పటికే 30 నుండి 40 శాతం కోతలు అయినాయని తెలిపారు. ఈ ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం లేదని, ధాన్యం ఆరబెట్టేటప్పుడు ప్రతి పది నిమిషాలకు వర్షం రావడం వల్ల ధాన్యం ఆరడం లేదని తెలిపారు. ఇదే అదునుగా దళారులు, మిల్లర్లు ధాన్యం 75 కేజీల బస్తాకు వెయ్యి రూపాయలు లేదా 1100కు కొనుగోలు చేస్తున్నారని.. ఇలా అయితే అయిదు ఎకరాల చేస్తున్న రైతు 250 బస్తాలు పండిస్తే లక్ష రూపాయల వరకు నష్టపోతున్నాడన్నారు. మన జిల్లాలో 80 శాతం పైబడి భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారని ఇలా అయితే కౌలు రైతు బాగా నష్టపోతాడని, ప్రభుత్వం నిబంధనలు సడలించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలనీ, ధాన్యం ఉన్న చోటకు రైతు భరోసా సిబ్బంది వెళ్లి సమాచారం సేకరించాలనీ ధాన్యం అమ్మిన వారం రోజుల్లో డబ్బులు ఎకౌంట్లో వెయ్యాలనీ, ధాన్యం రవాణా చార్జీలు, ధాన్యం తూకం చార్జీలు కింటాకు వంద రూపాయలు పెంచాలనీ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కె.వీరబాబు, వి.చంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.